17 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత.. పాక్ గడ్డపై అడుగుపెట్టి టెస్టు క్రికెట్ ఆడుతున్న ఇంగ్లండ్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. టెస్టు క్రికెట్‌లో తొలి రోజు ఆటలో అత్యధిక పరుగులు చేసి.. ఆస్ట్రేలియా వరల్డ్ రికార్డును బ్రేక్ చేసింది. 1910లో ఆస్ట్రేలియా జట్టు సౌతాఫ్రికాపై సిడ్నీలో టెస్టు ఆడుతూ.. తొలి రోజు 6 వికెట్లు కోల్పోయి 494 పరుగులు చేసింది. తాజాగా ఇంగ్లండ్ 112 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. పైగా తొలి రోజు ఒక జట్టు నలుగురు ఆటగాళ్లు సెంచరీలు బాదడం కూడా రికార్డే. పాక్ బౌలర్లును పిచ్చి కొట్టుడు కొడుతూ.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఏకంగా కేవలం 4 వికెట్లు కోల్పోయి 506 పరుగుల భారీ స్కోర్ చేసింది. పైగా నలుగురు ఆటగాళ్లు సెంచరీల మోతమోగించారు. రావాల్పిండి వేదికగా ప్రారంభమైన టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్లోక్స్ టాస్ గెలిచి.. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
స్టోక్స్ నిర్ణయానికి న్యాయం చేస్తూ.. ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలే, బెన్ డకెట్ పాకిస్థాన్ బౌలర్లతో చెడుగుడు ఆడుకున్నారు. తొలి వికెట్‌కు ఈ జోడి ఏకంగా 233 పరుగులు జోడించింది. తొలి వికెట్ తీసేందుకు పాకిస్థాన్ బౌలర్లు చెమటలు కక్కి, మూడు చెరువుల నీళ్లు తాగారు. వికెట్లు పడక, పరుగులు ఆపలేక.. నిరశించిపోతున్న పాకిస్థాన్ జట్టుకు జాహిద్ మహమూద్ తొలి వికెట్ అందించి.. ఊపిరిపోశాడు. 110 బంతుల్లో 15 ఫోర్లతో 107 పరుగులు చేసి బెన్ డకెట్ అవుట్ అయ్యాడు. డకెట్ ఏకంగా 6 ఏళ్ల గ్యాప్ తర్వాత ఇంగ్లండ్ టెస్టు టీమ్‌లోకి వచ్చాడు. వచ్చిరావడంతోనే సెంచరీతో సత్తా చాటాడు. ఇక మరో ఓపెనర్ జాక్ 111 బంతుల్లో 21 ఫోర్లతో 122 పరుగులు బాది.. కొద్ది సేపటికే హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. సెంచరీతో చెలరేగిన ఓపెనర్లు అవుట్ అయ్యారని సంతోష పడ్డ పాకిస్థాన్‌కు ఒల్లీ పోప్, హెర్రీ బ్రూక్స్ రూపంలో మరో కష్టం మీదపడింది. మధ్యలో జో రూట్ 23 పరుగులు చేసి త్వరగానే అవుటైనా.. బ్రూక్స్, పోప్ జోడీ పాక్ బౌలర్లపై విరుచుకుపడింది. ఈ క్రమంలో పోప్ 104 బంతుల్లో 14 ఫోర్లతో 108 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ సారి మొహమ్మద్ అలీ వికెట్ పడగొట్టాడు.
సెంచరీలు బాది ముగ్గురు ఆటగాళ్లు జాక్, డకెట్, పోప్ వన్డేల్లో స్టైల్లో బ్యాటింగ్ చేస్తే.. బ్రూక్స్ ఏకంగా టీ20ల్లో పాక్ బౌలర్లను చీల్చిచెండాడు. 81 బంతుల్లోనే 14 ఫోర్లు, 2 సిక్సులు బాది 101 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక కెప్టెన్ బెన్ స్టోక్స్ సైతం క్రీజ్‌లోకి వచ్చిరాగానే బాదడం మొదలుపెట్టాడు. కేవలం 15 బంతులే ఆడి స్టోక్స్ 6 ఫోర్లు, ఒక సిక్స్ బాది 34 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇలా 75 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ 506 పరుగుల చేసిన దశలో, బ్యాడ్ లైట్ కారణంగా అంపైర్లు తొలి రోజు ఆటను నిలిపివేశారు. పాక్ బౌలర్లలో నసీమ్ షా 15 ఓవర్లు వేసి 96 పరుగులు సమర్పించుకున్నాడు. అలాగే మొహమ్మద్ అలీ 17 ఓవర్లలో 96, హరీస్ రౌఫ్ 13 ఓవర్లలో 78, ఆగ్హా సల్మాన్ 5 ఓవర్లలో 38, షకీల్ 2 ఓవర్లలో 30 పరుగులు సమర్పించుకున్నారు. ఇక రెండు వికెట్లతో రాణించిన జాహిద్ మహమూద్ 23 ఓవర్లు వేసి ఏకంగా 160 పరుగులు ఇచ్చాడు. తొలి రోజు ఇంగ్లండ్ బ్యాటింగ్ సునామీతో ముగిసింది.
బజ్‌బాల్ కాదు.. పిచ్ వల్లే..!
అయితే.. పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ జట్టు ఈ స్థాయిలో చెలరేగడానికి చాలా మంది ఇంగ్లండ్ అనుసరిస్తున్న బజ్‌బాల్ స్ట్రాటజీ, అగ్రెసివ్ క్రికెట్ అనుకుంటున్నారు. కానీ అసలు విషయం అదికాదు. ఈ మ్యాచ్‌లో రావాల్సింది పిచ్ కీలకపాత్ర పోషిస్తోంది. పిచ్ హైవేలా ఉండటంతో బాల్ ఈజీగా బ్యాట్‌పైకి వస్తోంది. బౌలర్లకు ఏ మాత్రం సహకరించడంలేదు. దీంతో సహజంగానే వేగంగా ఆడే ఇంగ్లండ్ క్రికెటర్లకు ఇది మరింత కలిసొచ్చింది. కాగా.. రావాల్పింది టెస్టు కోసం ఏర్పాటు చేసిన పిచ్‌పై మ్యాచ్ ప్రారంభమైన కొద్ది సేపటికే తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
5️⃣0️⃣6️⃣ runs on the first day of a Test match!
We love this team 😍
Scorecard: https://t.co/wnwernG6Ch
🇵🇰 #PAKvENG 🏴 pic.twitter.com/AlXodwtd8h
— England Cricket (@englandcricket) December 1, 2022
Stumps on Day One in Rawalpindi 🏏#PAKvENG | #UKSePK pic.twitter.com/6K1PfSwNZe
— Pakistan Cricket (@TheRealPCB) December 1, 2022