క్రీడాలోకంలో ఫామ్ లో ఉంటేనే ఏ ఆటగాడికైనా జట్టులో స్థానం.. పేరు ఉంటాయి. ఇక ఒక్కసారి అతడు ఫామ్ కోల్పోయాడో అంతే.. అతడిపై విమర్శల బాణాలు ఎక్కుపెడతారు మాజీలు. ఈ క్రమంలోనే గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న కింగ్ కోహ్లీ తాజాగా ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ లో దుమ్ము రేపాడు. రెండు అర్ద శతకాలకు తోడు ఓ సెంచరీతో కదం తొక్కాడు. అయితే ఈ నేపథ్యంలోనే అతడిని విమర్శించిన నోర్లే.. అతడిని పొగడటం ప్రారంభించాయి. తాజాగా గౌతమ్ గంభీర్ కోహ్లీ ఫామ్ లోకి రావడంపై కాస్త వ్యంగ్యంగానే స్పందించాడు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
విరాట్ కోహ్లీ గత కొంత కాలంగా సగటు క్రికెట్ అభిమానుల నోళ్లల్లో నానుతున్న పేరు. దానికి కారణం అతడు ఫామ్ లో లేక పోవడమే. దాంతో మాజీ క్రికెటర్ల నుంచి సాధారణ ప్రేక్షకుడు సైతం కోహ్లీ పై విమర్శలు చేశారు. తాజాగా ఆ విమర్శలు అన్నింటికి తన బ్యాట్ తోనే సమాధానం చెప్పాడు కోహ్లీ. ఆసియా కప్ లో దుమ్ము రేపుతూ అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్స్ జాబితాలో అగ్రస్థానంలోకి వచ్చాడు. ఇక విరాట్ సెంచరీ చేయడంపై టీమిండియా మాజీ క్రికెటర్ భాజాపా ఎంపీ గౌతమ్ గంభీర్ కాస్త వ్యంగ్యంగానే స్పందించాడు. కోహ్లీ శతకంపై అతడు మాట్లాడుతూ.. ” క్రికెట్ చరిత్రలో ఏ ఆటగాడు కూడా సెంచరీ చేయకుండా 3 ఏళ్లు జట్టులో కొనసాగిన దాఖలాలు లేవు.
అదీ కాక విరాట్ స్థానంలో ఎవరైనా యువ ఆటగాడు ఇన్ని సంవత్సరాలు శతకం బాదకుండా ఉంటే అతడిని జట్టులో కొనసాగించేవారు కాదనుకుంటా! అయితే కోహ్లీ సెంచరీ చేయకపోయినా గానీ అతడిని జట్టులో ఆడించడానికి ప్రధాన కారణం విరాట్ గతంలో భారీగా పరుగులు చేయడమే. ఏ ఆటగాడు అయినా వెయ్యికి పైగా రోజులుగా సెంచరీ చేయకుండా జట్టులో కొనసాగడం అంటే మాటలు కాదు. అయితే కరెక్ట్ టైమ్ లో విరాట్ ఫామ్ లోకి వచ్చాడు. నేను అతడిని విమర్శించడం లేదు.. పరిస్థితిని వివరిస్తున్నాను.” అని పేర్కొన్నాడు. అయితే ఈ వాఖ్యలు ప్రస్తుతం క్రీడా ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపథ్యంలోనే గతంలో విరాట్ కు గంభీర్ కు IPLల్లో పెద్ద గొడవ జరిగిన విషయం మనందరికి తెలిసిందే. అప్పటి నుంచి వీరిద్దరికి ఒకరంటే ఒకరికి పడటం లేదన్నది కొందరి వాదన. దాంతోనే గంభీర్.. విరాట్ పై విమర్శలు చేస్తున్నాడని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరి విరాట్ పై గంభీర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.