టీమిండియా కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ గత కొద్దిరోజులుగా క్రికెట్ అభిమానులకు షాకులిస్తూనే ఉన్నాడు. తాజాగా కోహ్లీ సంబంధించి మరో పుకారు షికారు చేస్తోంది. అందుకు మాజీలు కూడా ఓట్లు వేస్తున్నారు. టీమిండియా టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని ప్రకటించిన కొద్దిరోజులకే వచ్చే సీజన్ నుంచి ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకుంటానని కోహ్లీ ప్రకటించిన విషయం తెలిసిందే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారధిగా విరాట్ కోహ్లీకి మంచి ఘనతలే ఉన్నాయి. కానీ, ఒక్కసారి కూడా ఆర్సీబీ కప్పు కొట్టకపోవడం అభిమానులకు తీవ్ర నిరాశను కలిగించే అంశమే. కోహ్లీ కెప్టెన్సీలో కచ్చితంగా కప్పు కొట్టాలన్న అభిమానుల ఆశలపై యాజమాన్యం నీళ్లు చల్లేలాగే కనిపిస్తోంది.
విషయం ఏంటంటే కోహ్లీ మీద ఒత్తిడి తగ్గించేందుకు ఈ సీజన్ మధ్యలోనే విరాట్‌ని కెప్టెన్సీ నుంచి తొలగించాలని భావిస్తున్నారంట. ఆ విషయాన్ని ఓ మాజీ క్రికెటర్ కూడా స్పష్టం చేశారు. కోల్‌కత్తాతో జరిగిన మ్యాచ్ తరహాలో ఇంకో చెత్త ప్రదర్శన చేస్తే గనుక కోహ్లీని కెప్టెన్సీ నుంచి దింపేస్తారనే ఆ మాజీ క్రికెటర్ కూడా అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ సెకెండాఫ్‌లో కోల్‌కతా చేతిలో 9 వికెట్ల తేడాతో దారుణంగా విఫలమైన తర్వాత.. యాజమాన్యం ఇలాంటి ఆలోచనలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. కోహ్లీనే తప్పుకుంటున్నట్లు ప్రకటించినా.. అప్పటి వరకు కూడా యాజమాన్యం ఆగేలా కనిపించడం లేదు. కోహ్లీకి సెప్టెంబర్ 24న చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరగబోయే మ్యాచ్ అగ్నిపరీక్ష అనే చెప్పాలి.
సీజన్ మధ్యలో కెప్టెన్లను మార్చడం ఫ్రాంచైజీలకు కొత్తేం కాదు. గతంలోనూ స్టార్ ప్లేయర్ కెప్టెన్‌గా ఉండి.. రాణించలేకపోయిన సందర్భాల్లో పలు జట్లు ఈ నిర్ణయం తీసుకున్నవే. కేకేఆర్ కెప్టెన్‌గా ధినేశ్ కార్తీక్, సన్‌రైజర్స్ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్‌ను తొలగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలోకి కోహ్లీ పేరు చేరుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆర్సీబీ యాజమాన్యం ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకుంటే కోహ్లీ, అభిమానులు ఎలా స్పందిస్తారన్నది ప్రశ్న. కోహ్లీ స్వచ్ఛందంగా తప్పుకోవడం లేదా యాజమాన్యం తప్పిచడం జరుగుతుందని తెలుస్తోంది.
కోహ్లీ తర్వాత మరి ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు అన్న ప్రశ్నకు ఆర్సీబీ జట్టులో మేలైన ఎంపిక కచ్చితంగా ఏబీ డివిలియర్స్ అవుతాడని ఆ మాజీ క్రికెటర్ తెలిపారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అతనికి ఉన్న అనుభవం కచ్చితంగా ఆర్సీబీకి ఉపయోగపడుతుందని యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కోహ్లీని మధ్యలోనే కెప్టెన్సీ నుంచి తొలగిస్తే డివిలియర్స్ కన్నా మంచి ఆప్షన్ వేరోటి లేదనే చెప్పాలి. అదే నిజమైతే ఆర్సీబీ అభిమానులకు కొంతలో కొంత ఊరట లభిస్తుంది. ఈ అంచనాలు, ఊహాగానాలపై అఫీషియల్‌గా ఆర్సీబీ యాజమాన్యం గానీ, విరాట్ కోహ్లీగానీ స్పందించే వరకు ఒక స్పష్టత రాదనే చెప్పాలి.
ఆర్సీబీ యాజమాన్యం నిజంగానే కోహ్లీని కెప్టెన్సీ నుంచి తొలగిస్తుందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.