న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్ టీమిండియాకు మంచి ఫలితాలను ఇచ్చింది. పొట్టి ఫార్మాట్‌లో అద్భుతమైన ఆటతీరుతో భారత జట్టు భవిష్యత్తు ఆశాజనకంగా ఉండబోతోందని శుబ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, ఉమ్రాన్ మాలిక్ లాంటి ప్లేయర్లు నిరూపించారు. భారత జట్టుకు ఎక్కువ కాలం, నిలకడగా సేవలందించే సత్తా తమకు ఉందని వీళ్లు చెప్పకనే చెప్పారు. ముఖ్యంగా గిల్ సూపర్ సెంచరీతో రాణించడంతో మూడు ఫార్మాట్లలోనూ జట్టుకు పర్మినెంట్ ఓపెనర్ దొరికినట్లయింది. అదే సమయంలో త్రిపాఠి రూపంలో విధ్వంసకర ఓపెనర్ జట్టుకు లభించినట్లయింది.
కివీస్‌తో జరిగిన చివరి టీ20లో 22 బంతుల్లో 44 పరుగులు చేసి విలువైన ఇన్నింగ్స్ ఆడాడు రాహుల్ త్రిపాఠి. ఇందులో 4 ఫోర్లు, 3 సిక్సర్లు ఉండటం విశేషం. ఒక షాట్ అయితే సూర్య కుమార్ యాదవ్, ఏబీ డివిలియర్స్ మాదిరిగా క్రీజు నుంచి పక్కకు జరిగి కొట్టాడు. దీంతో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. త్రిపాఠీని మరో 360 డిగ్రీస్ ప్లేయర్‌గా అందరూ మెచ్చుకుంటున్నారు. టీమిండియా క్రికెటర్ దినేష్ కార్తీక్ కూడా ఈ బ్యాటర్‌ను పొగిడాడు. త్రిపాఠి నిస్వార్థమైన బ్యాట్స్‌మన్ అని దినేష్ కార్తీక్ అన్నాడు. భవిష్యత్తులో ఓ పెద్ద ఆటగాడ్ని అతడు భర్తీ చేయబోతున్నాడని చెప్పాడు. కెరీర్ లో నిలదొక్కుకుంటున్న తరుణంలో దూకుడుగా, అటాకింగ్ గేమ్‌తో ఆడుతుండటం గొప్ప విషయమని డీకే పేర్కొన్నాడు.
కెరీర్‌కు రిస్క్ అని తెలిసినా.. జట్టు కోసం త్రిపాఠి ధాటిగా ఆడుతుండటం మంచి విషయమని దినేష్ కార్తీక్ చెప్పుకొచ్చాడు. ‘న్యూజిలాండ్‌పై రాహుల్ త్రిపాఠి ఆడిన ఇన్నింగ్స్‌ను ఎవరూ మర్చిపోవద్దు. ఐపీఎల్‌లో అతడు రాణించినా, విఫలమైనా.. టీమిండియాలో మూడో స్థానానికి అతడే సరైనవాడు. కోహ్లీ టీమ్‌లో కొనసాగితే ఓకే. ఒకవేళ విరాట్ లేకుంటే మాత్రం అతడి స్థానాన్ని భర్తీ చేసే సత్తా త్రిపాఠీకే ఉంది. అతడికే ఆ చాన్స్ ఇవ్వాలి. గ్రౌండ్‌లోకి దిగాడంటే పరిస్థితులతో సంబంధం లేకుండా తనదైన ఎటాకింగ్ గేమ్‌ను ఆడటంలో త్రిపాఠి భేష్. ఎంతటి పెద్ద మ్యాచ్ అయినా, ఎలాంటి బౌలర్‌నైనా బాదేయడం అతడి స్పెషాలిటీ. ఇలాంటి ఆటగాళ్లు జట్టులో ఉండటం చాలా ముఖ్యం’ అని దినేష్ కార్తీక్ వివరించాడు.