టీ20 వరల్డ్ కప్ లో భారత్ పరాయజం పొందడంతో.. అటు జట్టుపై, ఇటు టీమ్ సెలక్షన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. మరోవైపు స్టార్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ ను ఒక్క మ్యాచ్ కూడా ఆడించకపోవడం ఏంటని? మాజీలు సెలక్షన్ కమిటీని దుయ్యబట్టారు. ఇక అద్భుత ప్రదర్శనతో ఇటీవల కాలంలో ఆకట్టుకుంటున్న హర్షల్ పటేన్ ను సైతం తుది జట్టులో ఎంపిక చేసినా ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. దీంతో జట్టు ఎంపికపై సోషల్ మీడియా వేదికగా అభిమానులు విమర్శలు గుప్పించారు. ఈనేపథ్యంలోనే ఈ విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు టీమిండియా స్టార్ ఫినిషర్ దినేశ్ కార్తీక్. కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మలు జట్టులో అద్బుతమైన వాతావరణం కల్పిస్తున్నారని డీకే పేర్కొన్నాడు.
ప్రస్తుతం టీమిండియా న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ను కివిస్ తో ఆడనుంది. ఈనేపథ్యంలో జట్టులోని సీనియర్ ఆటగాళ్లు అయి రోహిత్, రాహుల్, కోహ్లీ, దినేశ్ కార్తీక్ కు విశ్రాంతిని ఇచ్చింది బీసీసీఐ. దాంతో యువ ఆటగాళ్లకు సత్తా నిరూపించుకునే అవకాశం వచ్చింది. ఇక ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న దినేశ్ కార్తీక్.. చాహల్, హర్షల్ పటేల్ లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. డీకే ఓ క్రీడా ఛానెల్ తో మాట్లాడుతూ..”కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ టీమిండియాలో అద్భుతమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారని, ఇక జట్టుకు ఎంపిక కానీ వారితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నారని” దినేశ్ కార్తీక్ చెప్పుకొచ్చాడు.
అయితే చాహల్, హర్షల్ మాత్రమే ఈ టీ20 వరల్డ్ కప్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని ఆటగాళ్లు. అయినా వారు ఇబ్బందికి గురికాలేదని దినేశ్ కార్తీక్ అన్నాడు. అదీకాక వారికి జట్టులో చోటు దక్కకపోవడంతో చాహల్, హర్షల్ ఆగ్రహానికి గురికాలేదని డీకే చెప్పుకొచ్చాడు. ఇక టోర్నీ ప్రారంభానికి ముందే ద్రవిడ్, రోహిత్ మనం ఆడబోయేది గడ్డు పరిస్థితుల్లో అని ముందే చెప్పారు. అందుకే జట్టులో అపోహలు, కోపతాపాలకు చోటులేదని ఈ సందర్భంగా చెప్పుకోచ్చాడు దినేశ్. అయితే ఏదైన ఒక ఆటగాడు జట్టుకు ఆడకపోతే పెద్దగా నష్టపోయిది ఏమీ ఉండదని, జట్టులో 11 మంది ఆటగాళ్లు రాణిస్తేనే టీమ్ విజయావకాశాలు ఉంటాయని ఈ సందర్బంగా వివరించాడు.