అద్భుత ప్రదర్శనతో యువ భారత్ జట్టు ఐదోసారి అండర్–19 వన్డే క్రికెట్ ప్రపంచకప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. శనివారం ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్లో యశ్ ధుల్ నాయకత్వంలోని భారత జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది.
ఇప్పటివరకూ ఏ జట్టుకూ సాధ్యంకాని విధంగా భారత్ ఐదోసారి విజేతగా నిలిచింది. 2000, 2008, 2012 మరియు 2018లో టైటిల్‌లను గెలుచుకుంది. నిన్నటి మ్యాచ్ లో దినేష్ బానా మ్యాచ్ ముగించిన తీరు.. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని గుర్తుచేసింది. బానా క్రీజులోకి వచ్చేసరికి విజయానికి చివరి 26 బంతుల్లో 14 పరుగులు కావాలి. ఈ హర్యానా క్రికెటర్ రెండు భారీ సిక్సర్లు కొట్టి భారత్ ఛేజింగ్‌ను 14 బంతులు మిగిలి ఉండగానే ముగించాడు. అయితే బానా లాంగ్ ఆన్ మీదుగా కొట్టిన సిక్స్.. వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరిగిన 2011 ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత మాజీ కెప్టెన్ MS ధోని కొట్టిన సిక్స్‌ను గుర్తు చేసింది. ఐసీసీ ఈ షాట్ గురించి ప్రస్తావిస్తూ “ఇలాంటి ముగింపును ఇంతకు ముందు ఎక్కడ చూసాము?” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఇక నిన్నటి మ్యాచ్ విషయానికొస్తే.. మొదట టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లు రవికుమార్ (4/34), రాజ్ బవా (5/31) విజృభించడంతో 189 పరుగులకే కుప్పకూలింది. అనంతరం యువ భారత్ ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకోగా.. ఆంధ్రా కుర్రాడు షేక్ రషీద్ (50: 84 బంతుల్లో 6×4), నిషాంత్ సింధు (50; 54 బంతుల్లో 5×4, 1×6) అర్ధ శతకాలతో రాణించారు. చివర్లో దినేష్ బానా లాంగ్ ఆన్ మీదుగా సిక్స్ కొట్టి భారత్ ను ఐదోసారి విజేతగా నిలిపాడు.