ఓ స్టార్ క్రికెటర్ కెప్టెన్సీ పగ్గాల నుంచి తప్పుకున్నాడు. గత మ్యాచులో తన జట్టు దారుణంగా ఓడిపోవడంతో సారథ్యం నుంచి తప్పుకున్నాడని తెలుస్తోంది. ఎవరా క్రికెటర్ అంటే..!
శ్రీలంక టెస్ట్ టీమ్ కెప్టెన్ దిముత్ కరుణరత్నే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవాలని అతడు ఫిక్స్ అయ్యాడు. త్వరలో జరగనున్న ఐర్లాండ్ సిరీస్ (ఏప్రిల్ 16 నుంచి 28వ తేదీల మధ్యలో 2 టెస్టులు) తర్వాత కెప్టెన్సీ పగ్గాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు సోమవారం ప్రకటించాడు. ఇదే విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్‌ఎల్‌సీ)కు కూడా తెలియజేశానని కరుణరత్నే వెల్లడించాడు. అతడి నిర్ణయంపై లంక బోర్డు స్పందించాల్సి ఉంది. న్యూజిలాండ్ చేతిలో 0-2 తేడాతో టెస్ట్ సిరీస్ కోల్పోయిన నిమిషాల వ్యవధిలోనే కరుణరత్నే ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఓటమిని తట్టుకోలేకే అతడు జట్టు సారథ్యం నుంచి తప్పుకోవాలని డిసైడైనట్లు వినిపిస్తోంది.
కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడంపై కరుణరత్నే స్పందించాడు. ఇకపై జట్టులో తాను సాధారణ సభ్యుడిగా కొనసాగుతానని స్పష్టం చేశాడు. కొత్త టెస్ట్ సైకిల్ (ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25)కు కొత్త సారథిని నియమించడం మంచిదని సెలెక్టర్లకు సూచించాడు. 2019లో తొలిసారి శ్రీలంక టెస్ట్ జట్టు పగ్గాలను కరుణరత్నే చేపట్టాడు. సారథిగా తొలి సిరీస్‌లోనే (దక్షిణాఫ్రికాపై) చారిత్రక సిరీస్ సాధించాడు. మొత్తంగా 26 టెస్ట్‌ల్లో లంకకు సారథిగా వ్యవహరించిన అతడు.. 10 విజయాలు, 7 డ్రాలు, 9 పరాజయాలను ఎదుర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక జట్టు ఇన్నింగ్స్ 58 పరుగుల తేడాతో దారుణ ఓటమిని చవిచూసింది. దీంతో రెండు టెస్టుల ఈ సిరీస్‌ను కివీస్ టీమ్ 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌తో డబ్ల్యూటీసీ 2021-23 సీజన్ ముగిసింది.