మైదానంలో ఆటగాళ్లు ఒకరిపై ఒకరు.. పై చేయి సాధించాలని చూస్తుంటారు. ఈ క్రమంలోనే బ్యాటర్ బౌలర్ పై ఒత్తిడి పెంచడానికి.. కొన్ని కొన్ని సందర్భాల్లో భారీ షాట్లు కొడుతుంటాడు. దీంతో బౌలర్ ఆత్మ రక్షణలో పడతాడు అని అతడి భావన. ఇది నిజమే కావొచ్చు.. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ప్లాన్ రివర్స్ అవుతుంది. ప్లాన్ రివర్స్ అయ్యి వికెట్ పడింది అంటే.. అక్కడ మాస్టర్ మైండ్ ఉన్నట్లే లెక్క. అచ్చం ఇలానే అఫ్రిదీ ని అవుట్ చేశాడు.. మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని. ధోని ప్లాన్ ను అద్భతంగా ఎగ్జిక్యూటివ్ చేశాడు మన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్. ఈ వీడియో చూసినప్పుడల్లా ధోని-సచిన్ ప్లాన్ కు పాపం అఫ్రిదీ బలైన తీరు నవ్వుతెప్పిస్తుంది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
అది 2007 పాకిస్థాన్ తో 5 వన్డేల సిరీస్ లో భాగంగా టీమిండియా గౌహతిలో తొలి మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ లో భారత్ 5 వికెట్ల తో పాక్ ను ఓడించింది. ఇక ఈ మ్యాచ్ లో హైలైట్ ఏమన్నా ఉంది అంటే.. అది అఫ్రిదీ అవుటనే చెప్పాలి. షాహీద్ అఫ్రిదీ.. క్రీజ్ లో కుదురుకున్నాడు అంటే చాలు ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే. కానీ ఈ మ్యాచ్ లో అతడి డాషింగ్ బ్యాటింగ్.. ధోని ప్లాన్ ముందు దిగదుడుపే అయ్యింది. ధోని కూల్ ప్లాన్ ను.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ఎగ్జిక్యూటివ్ చేయడంతో పాక్ డాషింగ్ బ్యాట్స్ మెన్ అఫ్రిదీ తొక ముడిచాడు. ఈ అవుట్ గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. ఈ మ్యాచ్ లో పాక్ 157/3 స్కోరుతో పటిష్టంగా ఉంది. క్రీజ్ లో యూసుఫ్, షాహీద్ అఫ్రిదీ ఉన్నారు. బౌలింగ్ వేయడానికి సచిన్ వచ్చాడు. ఈ ఓవర్ రెండో బంతిని అఫ్రిదీ ముందుకు వచ్చి భారీ షాట్ ఆడాడు.. అది కాస్తా బౌండరికీ వెళ్లింది. దాంతో తన స్ట్రాటజీ ఏంటో అఫ్రిదీ సచిన్ కు చెప్పకనే చెప్పాడు.
ఇక అదే ఓవర్ 5వ బంతిని కూడా అఫ్రిదీ ముందుకు వచ్చి ఆడాడు.. కానీ ఈ సారి బంతి ఆఫ్ సైడ్ వైడ్ వేశాడు సచిన్.. అది కాస్తా అఫ్రిదీకి అందకపోవడంతో ధోని స్టంప్ అవుట్ చేశాడు. ఇక్కడే ధోని ఓ మాస్టర్ ప్లాన్ ను వేశాడు. అఫ్రిదీ ముందుకు వెళ్తాడు అని ముందే గ్రహించిన ధోని.. సచిన్ కు బాల్ ను తన చేయి చూపించిన వైపు వెయ్యమని చేయి చూపిస్తాడు. సచిన్ కూడా ధోని చెప్పినట్లే వేస్తాడు. ఇది ఊహించని అఫ్రిదీ మునపటి షాట్ లాగే ముందుకు వచ్చి.. ధోని బుట్టలో పడ్డాడు. ఈ వీడియో చూసిన అభిమానులు.. ధోనినా మజాకానా అని అంటున్నారు. అయితే ధోనికి ఇలాంటి ప్లాన్స్ అన్ని వెన్నెతో పెట్టిన విద్య. గతంలో చాలా సార్లు డాషింగ్ బ్యాటర్లను తన తెలివితో బోల్తా కొట్టించాడు ఈ జార్ఖండ్ డైనమెట్. సచిన్ కూడా అంతే షార్ఫ్ గా ధోని ప్లాన్ ను క్షణాల్లో అమలు చేశాడు. బాల్ వేయడానికి, ధోని చేయి చూపడానికి మిల్లి సెకన్స్ ఉన్నాయి. అయినప్పటికీ సచిన్ అద్భుతంగా బాల్ వేశాడు. దాంతో సచిన్ పై ఒత్తిడి తెద్దాం అనుకున్న అఫ్రిదీ.. అంతే స్పీడ్ గా పెవిలియన్ కు వెళ్లాడు.