ఆరోన్ ఫించ్.. ఆస్ట్రేలియా వన్డే క్రికెట్ కు తాజాగా గుడ్ బై చెప్పాడు. దాంతో ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్సీ పగ్గాలను ఎవరు అందుకుంటారా అని.. క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే జట్టు పగ్గాలను అందుకునే వారిలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు డేవిడ్ వార్నర్.. వార్నర్ సైతం వన్డే కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించడానికి ఉత్సహాంగానే ఉన్నట్లు అక్కడి క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే డేవిడ్ భాయ్ పావులు కదుపుతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈక్రమంలోనే అతడు క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ హాక్లీని కలవనున్నట్లు సమాచారం. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఆరోన్ ఫించ్ వన్డే రిటైర్మెంట్ తర్వాత ఆస్ట్రేలియా జట్టు పగ్గాలు చేపట్టబోయేది ఎవరని? చర్చ జోరుగా నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే పగ్గాలను డేవిడ్ వార్నర్ చేపడితేనే బాగుంటుందని, నా మద్దతు అతడికే అని మాజీ సారథి ఫించ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అయితే కొందరు మాత్రం టెస్ట్ కెప్టెన్ పాట్ కమిన్స్ కే వన్డే పగ్గాలు కూడా అందించాలని అంటున్నారు. అందరి అంచనాలను నిజం చేస్తూ వార్నర్.. ఆస్ట్రేలియా క్రికెట్ చీఫ్ నిక్ హాక్లీని త్వరలో కలవనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే అక్కడి క్రీడా వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. దానికి తగ్గట్లు గానే వార్నర్ సైతం రంగంలోకి దిగి కెప్టెన్ పగ్గాల కోసం ప్రయత్నాలు మెుదటు పెట్టాడు. మరి వార్నర్ కు పగ్గాలు ఇవ్వడానికి క్రికెట్ ఆస్ట్రేలియాకు అడ్డు వచ్చే అంశాలు ఏవి? అని తెలుసుకోవాలంటే మనం 2018లోకి వెళ్లాలి.
2018లో బాల్ టాంపరింగ్ కేసులో డేవిడ్ వార్నర్, స్టీవెన్ స్మిత్, బాన్ క్రాఫ్ట్ లపై నిషేధం విధించారు. ఈ క్రమంలో స్మిత్ పై 2 సంవత్సరాలు ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించకుండా నిషేధం విధించగా.. వార్నర్ పై లైఫ్ లాంగ్ కెప్టెన్సీ ని చేపట్టకుండా నిషేధం విధించారు. తాజాగా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టే సరైన ఆటగాళ్లు ఎవరూ లేకపోవడంతో వార్నర్ నే పలువురు ఆటగాళ్లు పగ్గాలు చేపట్టాలని సూచిస్తున్నారు. దాంతో పాటే క్రికెట్ ఆస్ట్రేలియా (CA) బోర్డుకు పలు సార్లు విన్నవించుకున్నట్లు తెలుస్తోంది. వారందరి విన్నపాల నేపథ్యంలో బోర్డుకూడా ఓ నిర్ణయానికి రాబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అన్నీ కుదిరి లైన్ క్లీయర్ అయితే లాంఛనంగానే వార్నర్ ఆస్ట్రేలియా కెప్టెన్ గా బాధ్యతలను నిర్వర్తించే అవకాశాలు త్వరలోనే ఉన్నాయి. మరి ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్ గా పగ్గాలు చేపట్టబోతున్న వార్నర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.