దేశంలో ఐపీఎల్ సందడి అపుడే మొదలైంది. రెండు రోజుల క్రితం బెంగుళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ -2022 మెగా వేలం ఈ పండుగ వాతావరణాన్ని సృష్టించింది. అయితే తాము ఎంతో ఇష్టంగా అభిమానించే ఫ్రాంఛైజీలు ఆటగాళ్లను సరిగా ఎంపిక చేసుకోలేదని ఒకవైపు.. ఇన్నాళ్లు జట్టునే అంటిపెట్టుకున్న సీనియర్ ఆటగాళ్లను విస్మరించాయని మరోవైపు అభిమానులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. అందుకు సమాధానంగా మేనేజ్‌మెంట్ లు వివరణ ఇస్తున్నాయి.
ఐపీఎల్ -2022 మెగా వేలంలో ఫ్రాంఛైజీలు చాలామంది సీనియర్ ఆటగాళ్లని పక్కన పెట్టేశాయి. అందులో చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఒకటి. ‘మిస్టర్ 360’ గా పేరొందిన సురేష్ రైనాను పక్కన పెట్టేసింది. ఐపీఎల్ ప్రారంభం నుంచి రైనా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో సభ్యుడు. జట్టులో ‘చిన్న తలైవా’గా పేరొందిన రైనా ఇక మీదట పసుపు రంగు జెర్సీలో కనిపించడు. ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్ ఈ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్సమెన్ ని కొనుగోలు చేయలేదు. ఈ విషయంపై సీఎస్‌కే అభిమానలు తీవ్ర నిరాశతో ఉన్నారు. ఇన్నాళ్లు చెన్నై అంటే రైనా.. రైనా అంటే చెన్నై అని చెప్పుకునే అభిమానులకు ఇది ఏ మాత్రం మింగుడు పడటం లేదు. ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథ్ స్పందించాడు.‘ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మెన్‌లలో రైనా ఒకరు. సీఎస్‌కే తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు. గత 12 ఏళ్లుగా రైనా సీఎస్‌కే తరఫున బాగా రాణిస్తున్నాడు. కానీ, ప్రతీ ఆటగాడిని ఫామ్ ఆధారంగానే జట్టులోకి తీసుకోవడం జరుగుతుంది. అతన్ని కొనుగోలు చేయడం మాకు చాలా కష్టమైన విషయమని అర్థం చేసుకోవాలన్నారు.’ మరోవైపు.. ఐపీఎల్‌లో తమ జట్టుకు ఎన్నో విజయాలు అందించిన రైనా సేవలకు చెన్నై సూపర్‌కింగ్స్ ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపింది.
Super Thanks for all the Yellove memories, Chinna Thala!🥺
#SuperkingForever 🦁 pic.twitter.com/RgyjXHyl9l
— Chennai Super Kings – Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) February 13, 2022
మరో సీనియర్ బ్యాట్స్‌మెన్ డుప్లెసిస్‌ను కూడా చెన్నై జట్టు విస్మరించింది. ఈ సౌతాఫ్రికా క్రికెటర్ ని ఆర్సీబీ జట్టు కొనుగోలు చేసింది. డుప్లెసిస్‌ను కొనుగోలు చేయకపోవడం వివరణ ఇస్తూ,.. “ ఫాఫ్ గత దశాబ్ద కాలంగా మాతో ఉన్నారు. అది వేలం ప్రక్రియ ఏమి చేయలేం.. మేము అతనిని కోల్పోయాం.” అని చెప్పుకొచ్చాడు. డుప్లెసిస్ గత సీజన్‌లో సీఎస్‌కే తరుపున అద్భుతంగా రాణించాడు. ఐపీఎల్ 2021 లో కేకేఆర్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో డుప్లెసిస్ 59 బంతుల్లో 86 పరుగులు చేసి ‘మ్యాన్ అఫ్ ది మ్యాచ్’ గా నిలవడంతో పాటు.. టైటిల్ విన్నర్ గా సీఎస్‌కే నిలబెట్టాడు.