ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా మంచి స్థితిలోనే ఉంది. ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడి 2, ఒక పరాజయంతో సెమీస్ రేసులో మెరుగ్గా ఉంది. కాగా.. ఈ మెగా టోర్నీ తర్వాత టీమిండియా న్యూజిలాండ్ టీ20, వన్డే సిరీస్‌లు ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో వన్డే, టెస్టు సిరీస్‌లు ఆడనుంది. ఈ నాలుగు సిరీస్‌ల కోసం సెలెక్టర్లు తాజాగా జట్లను ప్రకటించారు. ఈ ఎంపికలో ఊహించని మార్పులు చేశారు. అయితే.. న్యూజిలాండ్‌తో సిరీస్‌ల కోసం మొత్తం యువ క్రికెటర్లతో కూడిన జట్లును ఎంపిక చేశారు. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీలను న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ఎంపిక చేయలేదు. వరల్డ్ కప్ ఆడి ఉంటారు కదా.. విశ్రాంతి అడిగి ఉంటారు అని అంతా భావించారు. కానీ.. సెలెక‌్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ.. ఎవరూ రెస్ట్ కోరలేదని.. తామే వారిని పక్కనపెట్టినట్లు వెల్లడించి.. బాంబు పేల్చారు.
అయితే.. వారి ప్రదర్శన ఆధారంగా వారిని పక్కనపెట్టలేదు లేండీ. కేవలం వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా వారిని కివీస్‌తో టీ20, వన్డే సిరీస్‌ల నుంచి తప్పించారు. అయితే.. ఈ విషయాన్ని ఆటగాళ్ల అభిష్టం మేరకు కాకుండా.. వారి ఫిట్‌నెస్, ఆడుతున్న నిరంతర క్రికెట్‌ను దృష్టిలో ఉంచుకుని.. మెడికల్ టీమ్, టీమ్ మేనేజ్‌మెంట్‌తో సంప్రదింపులు జరిపి సెలెక‌్షన్ కమిటీ స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయంగా చేతన్ శర్మ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ..‘చూడండి.. ఎవరూ రెస్ట్ అడగలేదు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌ను దృష్టిలో ఉంచుకుని, మెడికల్ టీమ్‌తో టచ్‌లో ఉన్నాం. మా వద్ద అందరి ఆటగాళ్ల రిపోర్టులు ఉన్నాయి. ఎవరికి ఎక్కడ రెస్ట్ ఇవ్వాలో, ఎవరికి ఎక్కడ రెస్ట్ అవసరమో మాకు తెలుసు.
ఈ వర్క్‌లోడ్‌ను మేనేజ్ చేయడం మా సెలెక్టర్ల పనే. టీమ్ మేనేజ్‌మెంట్, సెలెక‌్షన్ కమిటీ, మెడికల్ టీమ్ ఈ మూడు విభాగాలు కలిసి.. ఒక ప్లేయర్‌కు ఎలా రెస్ట్ ఇచ్చి.. రాబోయే సిరీస్‌కు అతన్ని ఫ్రెష్‌గా ఉంచాలనేది చూస్తాం. టెస్టు క్రికెట్ ఎంతో ముఖ్యమైనది.. అందుకోసమే టెస్టు జట్టులో ఉన్న ఆటగాళ్లు ఫ్రెష్‌గా టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉండాలి. టీమిండియా రానున్న కాలం 6 టెస్టులు ఆడనుంది.’ అని చేతన్ శర్మ పేర్కొన్నారు. అయితే.. నవంబర్ 18, 20, 22 తేదీల్లో టీమిండియా.. న్యూజిలాండ్‌తో వారి దేశంలోనే మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. అలాగే నవంబర్ 25, 27, 30 తేదీల్లో న్యూజిలాండ్‌లోనే వారితో మూడు వన్డేలు ఆడనుంది. ఇక బంగ్లాదేశ్‌తో డిసెంబర్ 4, 7, 10వ తేదీల్లో మూడు వన్డేలు మీర్‌పూర్ వేదికగా ఆడనుంది. అలాగే డిసెంబర్ 14 నుంచి 18 వరకు తొలి టెస్టు, 22 నుంచి 26 వరకు బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు ఆడనుంది టీమిండియా.
ఎవరెవరూ ఎంపికయ్యారంటే..
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు: హార్దిక్ పాండ్యా(కెప్టెన్), రిషభ్ పంత్(వైస్ కెప్టెన్), శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్, సిరాజ్, భువనేశ్వర్‌కుమార్, ఉమ్రాన్ మాలిక్.
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు: శిఖర్ ధావన్(కెప్టెన్), రిషభ్ పంత్(వైస్ కెప్టెన్), శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, శార్థుల్ ఠాకూర్, షాబాజ్ అహ్మెద్, దీపక్ చాహర్, ఉమ్రాన్ మాలిక్.
బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, శ్రేయస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, షమీ, సిరాజ్, దీపక్ చాహర్, యష్ దయాల్.
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, చతేశ్వర్ పుజారా, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, కేఎస్ భరత్, జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దుల్ ఠాకూర్, షమీ, సిరాజ్, ఉమేష్ యాదవ్.