ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరున్ గ్రీన్ సౌతాఫ్రికాతో బాక్సింగ్ డే టెస్టు సందర్భంగా గాయపడ్డాడు. ఆట మధ్యలో గాయపడిన గ్రీన్.. గాయాన్ని సైతం లెక్కచేయకుండా.. బ్యాటింగ్ చేశాడు. అయితే.. టెస్టు ముగిసిన తర్వాత.. అసలు గ్రీన్‌కు అయిన గాయం ఎంత తీవ్రమైనదో తెలిసిన తర్వాత.. గ్రీన్ తెగువకు క్రికెట్ అభిమానులు నీరాజనాలు పలుకుతున్నారు. దేశంపై ఎంత ప్రేమతో ఆడుతున్నాడో అంటూ.. సోషల్ మీడియా వేదికగా హ్యాట్సాఫ్ గ్రీన్ అంటూ పోస్టులు చేస్తున్నారు. క్రికెట్‌లో ఆటగాళ్లు గాయపడటం సహజమే అయినా.. ఎముక విరిగిపోయినా.. దాన్ని లెక్కచేయకుండా గ్రీన్ బ్యాటింగ్ చేయడమే ఇక్కడ ప్రత్యేకం. గతంలో చాలా మంది ఆటగాళ్లు గాయపడి.. కట్టుకట్టుకుని వచ్చి ఆట కొనసాగించారు. కానీ.. గ్రీన్ మాత్రం విరిగిన ఎముకతోనే బ్యాటింగ్ చేశాడు.
ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య మెల్‌బోర్న్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఫీల్డింగ్ చేస్తూ.. గ్రీన్ గాయపడ్డాడు. అతని చేతి వేలికి గాయమైంది. అయితే.. ఒక ఆల్‌రౌండర్‌గా టీమ్‌లో ఎంతో కీలకమైన గ్రీన్ తన ప్రాముఖ్యతను గుర్తుంచుకుని.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగాడు. బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి హాఫ్ సెంచరీతో రాణించాడు. అప్పటికీ గ్రీన్ చేతి గాయంతో బాధపడుతున్నాడు. అయినా కూడా బ్యాటింగ్‌లో అదరగొట్టాడు. అంతకుముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో గ్రీన్ ఏకంగా 5 వికెట్లతో చెలరేగి, సౌతాఫ్రికాను 189 పరుగులకే కట్టడి చేశాడు. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌కు గ్రీన్ బ్యాటింగ్ చేయడం ఎంతో కీలమైన దశలో.. రెండో ఇన్నింగ్స్ ఆడే అవసరం లేకుండానే.. సౌతాఫ్రికాను రెండో ఇన్నింగ్స్‌లోనూ 204 పరుగులకే ఆసీస్ బౌలర్లు ఆలౌట్ చేసి గెలిచారు.
ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత.. ఆస్పత్రికి వెళ్లి గాయానికి ఎక్స్‌రే తీయించుకున్న గ్రీన్‌కు దిమ్మతిరిగింది. ఎక్స్‌రేలో అతని చేతి వేలి ఎముక విరిగిపోయింది. దీంతో గ్రీన్‌కు సర్జరీ అవసరమని వైద్యులు నిర్ధారించారు. తన చేతి వేలి ఎక్స్‌రేను గ్రీన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ చూసిన తర్వాత.. ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ తెగ ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే.. గ్రీన్‌ను ఐపీఎల్ 2023 కోసం ముంబై ఫ్రాంచైజ్.. అతన్ని ఏకంగా రూ.17.50 కోట్ల భారీ ధరపెట్టి కొనుగోలు చేసింది. ఈ గాయం, సర్జరీతో గ్రీన్‌కు ఐపీఎల్‌కు ఎక్కడ దూరం అవుతాడో అని వారు ఆందోళన పడుతున్నారు. అయితే.. ఐపీఎల్ ఇంకా చాలా సమయం ఉండటంతో గ్రీన్ అప్పటి వరకు కోలుకుంటాడని క్రికెట్ పండితులు పేర్కొంటున్నారు. మరి కొత్త ఏడాదిలో 4 టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆడేందుకు భారత్ పర్యటనకు రానున్న ఆస్ట్రేలియా టీమ్‌లో గ్రీన్ ఉంటాడో.. లేక గాయానికి విశ్రాంతి తీసుకుంటాడో చూడాలి. మరి గ్రీన్ గాయం, అతను చూపించిన తెగువపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.