జింబాబ్వే సీనియర్ ఆటగాడు బ్రెండన్ టేలర్‌పై ఐసీసీ ఎట్టకేలకు చర్యలు తీసుకుంది. అన్ని క్రికెట్‌ల నుండి మూడున్నరేళ్లపాటు నిషేధించింది. అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించడంతో పాటు, డ్రగ్స్ తీసుకుని యాంటీ డోపింగ్ కోడ్ ను కూడా అతిక్రమించినట్లు పేర్కొంది. దీంతో ఐసీసీ అతనిపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఐసీసీ తాజా నిర్ణయంతో 2025 జూలై 28 వరకు టేలర్ క్రికెట్‌కు దూరం కానున్నాడు.
The ICC has released a statement on Brendan Taylor.https://t.co/IYKHAVeZHa
— ICC (@ICC) January 28, 2022
35 ఏళ్ల బ్రెండన్ టేలర్ అంతర్జాతీయ క్రికెట్‌కు గతేడాదే వీడ్కోలు పలికాడు. జింబాబ్వే తరఫున అత్యధికంగా 17 సెంచరీలు చేసిన రికార్డు కూడా టేలర్ పేరు మీదనే ఉంది. 34 టెస్టుల్లో 36 సగటుతో 2320 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 205 వన్డేల్లో 35 సగటుతో 6684 పరుగులు చేశాడు. ఇందులో 11 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 44 టీ20ల్లో 22 సగటుతో 859 పరుగులు చేశాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున 2014 సీజన్ ఆడాడు బ్రెండన్ టేలర్.
కాగా బ్రెండన్ టేలర్ ఇటీవలే ఓ లేఖలో సంచలన విషయాలు వెల్లడించాడు. గతంలో ఓ భారత వ్యాపారవేత్త క్రికెట్ లీగ్ పై చర్చించేందుకు భారత్ రావాలని కోరాడని, తాను వెళితే డ్రగ్స్ తో పార్టీ ఇచ్చి, తాను డ్రగ్స్ తీసుకున్నప్పటి వీడియోతో బ్లాక్ మెయిల్ చేశారని టేలర్ లేఖలో తెలిపాడు. ఫిక్సింగ్ కు పాల్పడాలంటూ తనకు 15 వేల డాలర్లు కూడా ఇచ్చారని వెల్లడించాడు. అప్పటి పరిస్థితుల కారణంగా ఆ డబ్బును స్వీకరించాల్సి వచ్చిందని లేఖలో తెలిపాడు. అయితే ఈ సమాచారాన్ని తమతో వెంటనే పంచుకోలేదంటూ బ్రెండన్ టేలర్ పై చర్యలు తీసుకుంది ఐసీసీ. కాగా తన తప్పిదాలను టేలర్ అంగీకరించాడని ఐసీసీ పేర్కొంది.
To my family, friends and supporters. Here is my full statement. Thank you! pic.twitter.com/sVCckD4PMV
— Brendan Taylor (@BrendanTaylor86) January 24, 2022