ఫుట్ బాల్ అనగానే మన దేశంలో చాలామందికి పెద్దగా తెలియదు. ప్రస్తుత తరంలో అయితే మెస్సీ, రొనాల్డో లాంటి వాళ్లు.. ఈ ఆటకు వన్నె తీసుకొచ్చారు. భారత్ లోనూ కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకుంటూనే ఉన్నారు. అయితే వీళ్ల కంటే ముందు మరో దిగ్గజం.. ఫుట్ బాల్ లో ఎన్నో అద్భుతాలు చేశాడు. పెద్దగా సదుపాయాలు లేని టైంలోనే.. ఫుట్ బాల్ గేమ్ ని మరో రేంజ్ కి తీసుకెళ్లాడు. ఆయనే పీలే. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పీలే(82).. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఫుట్ బాల్ చరిత్రలో అత్యంత మేటి ఆటగాళ్లలో పీలే ఒకడు. గతేడాది క్యాన్సర్ బారిన పడిన ఆయన.. అప్పటి నుంచి చికిత్స తీసుకుంటూనే ఉన్నారు. ఈ మధ్య ఆరోగ్యం విషమించడంతో పలు అవయవాలు పనిచేయడం మానేశాయి. గత కొన్నిరోజుల నుంచి మృత్యువుతో పోరాడుతూనే ఉన్నారు. ఇక సావోపాలోలోని ఆల్బర్ట్ ఐన్ స్టీన్ ఆస్పత్రిలో కుటుంబసభ్యుల సమక్షంలో కన్నుమూశాడు. పీలే కెరీర్ విషయానికొస్తే.. ఫుట్ బాల్ చరిత్రలోనే మూడు ప్రపంచకప్ విజయాల్లో భాగస్వామి అయిన ఏకైక ఆటగాడు. తన అద్భుతమైన ఆటతీరుతో దాదాపు రెండు దశాబ్దాల పాటు సాకర్ ప్రేమికులను ఉర్రూతలూగించాడు. తన తరంలోనే కాకుండా ఓవరాల్ ఫుట్ బాల్ చరిత్రలోనే లెజెండ్ గా పేరు సంపాదించాడు.
బ్రెజిల్ కు దక్కిన అద్భుతమైన ప్లేయర్స్ లో పీలే ఒకడు. 1958, 1962, 1970ల్లో బ్రెజిల్.. వరల్డ్ కప్ గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. ఇకపోతే ఫార్వర్డ్, అటాకింగ్ మిడ్ ఫీల్డర్ గా.. గ్రౌండ్ లో అతడి గేమ్ చూస్తే ఎవరికైనా సరే మతిపోతుంది. ప్రస్తుత జనరేషన్ కు పీలే గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ యూట్యూబ్ లోకి వెళ్లి ‘పీలే టాప్ 5 గోల్స్’ అని సెర్చ్ చేస్తే మాత్రం ఫిఫా ఛానెల్ లో వీడియో ఉంటుంది. అవి చూస్తే పీలే గేమ్ లో మ్యాజిక్ ఏంటనేది మీకు అర్ధమైపోతుంది. ఫుట్ బాల్ లో బ్రెజిల్ టాప్ జట్టుగా అవతరించిందంటే.. అందులో పీలే కృషి ఎంతో ఉంది. 1958లో మోకాలి గాయాన్ని కూడా లెక్కచేయకుండా రాణించి, ఉత్తమ యంగ్ ప్లేయర్ గా అవార్డు అందుకున్నాడు. 1962, 1966 వరల్డ్ కప్స్ లో గాయం కారణంగా ప్రభావం చూపించలేకపోయాడు. 1966లోనే నిరాశజనక ప్రదర్శన కారణంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ 1970 ప్రపంచకప్ లో ఉత్తమ ఆటగాడిగా గోల్డెన్ బాల్ సొంతం చేసుకున్నాడు. ఓవరాల్ గా ప్రపంచకప్ లోని 14 మ్యాచుల్లో 12 గోల్స్ సాధించాడు.
A inspiração e o amor marcaram a jornada de Rei Pelé, que faleceu no dia de hoje.
Amor, amor e amor, para sempre.
.
Inspiration and love marked the journey of King Pelé, who peacefully passed away today.Love, love and love, forever. pic.twitter.com/CP9syIdL3i
— Pelé (@Pele) December 29, 2022