ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ గొప్ప మనసును చాటుకున్నాడు. మూడు టెస్టుల సిరీస్‌లో మ్యాచ్ ఫీజ్‌గా వచ్చే డబ్బు మొత్తం విరాళంగా ప్రకటించాడు. దీంతో బెన్ స్టోక్స్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. దాదాపు 17 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ ఆడేందుకు పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టింది ఇంగ్లండ్ జట్టు. టీ20 వరల్డ్ కప్ 2022కు ముందు పాకిస్థాన్ వెళ్లి 7 టీ20ల సిరీస్‌ను 4-3తో గెలిచి వచ్చిన ఇంగ్లండ్.. వరల్డ్ కప్ తర్వాత మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు మళ్లీ పాక్‌కు వెళ్లింది. అయితే తన కెరీర్‌లో తొలి సారి టెస్టు సిరీస్ ఆడేందుకు పాకిస్థాన్ వెళ్లిన బెన్ స్టోక్స్ పాక్ గడ్డపై అడుగుపెడుతూనే.. తన మంచి మనసును చాటుకున్నాడు. పాకిస్థాన్ వరద బాధితులకు ఈ సిరీస్‌తో వచ్చే మ్యాచ్ మొత్తం (దాదాపు 37 లక్షలపైనే) విరాళంగా ప్రకటించాడు.
పాకిస్థాన్‌లో ఈ ఏడాది భారీ వరదలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వరదల్లో ఎంతో మంది ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ఈ విషయం తెలుసుకున్న బెన్ స్టోక్స్ పాకిస్థాన్‌లో అడుగుపెట్టిన రెండో రోజే ఈ భారీ విరాళం ప్రకటించాడు. అయితే.. డిసెంబర్ 1 నుంచి ఇంగ్లండ్-పాకిస్థాన్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ రావల్పిండి వేదికగా ప్రారంభం కానుంది. అలాగే రెండో టెస్టు డిసెంబర్ 9 నుంచి ముల్తాన్‌లో, మూడో టెస్టు డిసెంబర్ 17 నుంచి కరాచీలో జరగనున్నాయి. పాకిస్థాన్‌లో నెలకొన్న అనిశ్చితి, ఉగ్రదాడుల నేపథ్యంలో ఆ దేశానికి క్రికెట్ ఆడేందుకు ఏ జట్టు ముందుకు రాని విషయం తెలిసిందే. గతేడాది న్యూజిలాండ్ జట్టు వచ్చినా.. మ్యాచ్ ఆరంభానికి కొన్ని నిమిషాల ముందు పర్యటనను రద్దుచేసుకుని హుటాహుటిన స్వదేశం తిరిగి వెళ్లిపోయింది.
ఆ తర్వాత.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా సైతం తమ పాకిస్థాన్ పర్యటనను రద్దు చేసుకున్నాయి. కానీ.. ఆ తర్వాత.. మళ్లీ పాకిస్థాన్ వెళ్లి మ్యాచ్‌లు ఆడాయి. దీంతో ఇంగ్లండ్ మరో సారి టెస్టు సిరీస్ కోసం పాక్‌లో అడుగుపెట్టింది. కాగా.. ఇంగ్లండ్-పాకిస్థాన్ జట్లు ఇటివల ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022 ఫైనల్‌లో తలపడిన విషయం తెలిసిందే. అదృష్టం కొద్ది సెమీస్‌కు చేరిన ఈ రెండు జట్లు.. న్యూజిలాండ్, ఇండియాను ఓడించి ఫైనల్లోపోటీ పడ్డాయి. 2019 వన్డే వరల్డ్ కప్‌లో విరోచిత పోరాటంతో ఇంగ్లండ్‌కు వరల్డ్ కప్ అందించిన బెన్ స్టోక్స్.. పాక్‌తో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్లోనూ అద్భుత ఇన్నింగ్స్ ఆడి.. ఇంగ్లండ్‌కు రెండో టీ20 వరల్డ్ కప్ అందించాడు. ఇప్పుడు భారీ విరాళం పాక్ వరద బాధితులకు ప్రకటించి.. పాకిస్థానీయుల మనసులు గెలుచుకున్నాడు. తన విరాళం వరదల వల్ల ఎక్కువగా ప్రభావితమైన ప్రాంతాల పునర్నిర్మాణం కోసం వెళ్తుందని ఆశిస్తున్నట్లు బెన్ స్టోక్స్ పేర్కొన్నాడు.
I’m donating my match fees from this Test series to the Pakistan Flood appeal ❤️🇵🇰 pic.twitter.com/BgvY0VQ2GG
— Ben Stokes (@benstokes38) November 28, 2022