ఈమధ్య వరుసగా విఫలవుతున్న సీనియర్ బ్యాటర్ ఛటేశ్వర్ పుజారా ప్లేసులో యంగ్ బ్యాటర్‌ను తీసుకోవాలని బీసీసీఐ భావిస్తోందట. అతడికి వరుస ఛాన్స్‌లు ఇచ్చి ఎంకరేజ్ చేయాలని అనుకుంటోందట. దీంతో పుజారా పని ఇక అయిపోయినట్లేనని, అతడు మూటా ముల్లె సర్దుకోవాల్సిందేనని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు ఓటమిని అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతిష్టాత్మక ఫైనల్లో ఆస్ట్రేలియా చేతుల్లో 209 రన్స్ తేడాతో భారత్ ఓటమిపాలైంది. టెస్టుల్లో వరల్డ్ కప్‌గా భావించే డబ్ల్యూటీసీ ట్రోఫీని మరోమారు చేజార్చుకుంది. కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో కనీస పోటీ ఇవ్వకుండా కంగారూ చేతుల్లో టీమిండియా చిత్తుగా ఓడటాన్ని ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. ఈ ఓటమితో భారత జట్టులో ప్రక్షాళన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు సారథ్యానికి త్వరలో గుడ్ బై చెబుతాడని వార్తలు వస్తున్నాయి. అతడి ప్లేసులో కొత్త కెప్టెన్ కోసం బీసీసీఐ ఇప్పటికే సమాలోచనలు చేస్తోందని సమాచారం. రోహిత్ ప్లేసులో నయా కెప్టెన్‌గా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పేర్లను పరిశీలిస్తున్నారట.
వయసును దృష్టిలో ఉంచుకొని అశ్విన్, జడ్డూలకు కాకుండా యంగ్స్టర్లు శుబ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ల్లో ఒకరికి నాయకత్వ పగ్గాలు అప్పజెప్పే కోణంలోనూ బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. టీమ్‌లో 30 ఏళ్లు పైబడిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానె, ఛటేశ్వర్ పుజారా, రవిచంద్రన్ అశ్విన్‌లకు రీప్లేస్మెంట్ కోసం బీసీసీఐ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించిందట. వీళ్లు ఉండగానే యంగ్ ప్లేయర్లకు ఛాన్స్ ఇచ్చి.. ఫ్యూచర్ కోసం సిద్ధం చేసుకోవాలని భావిస్తోందట. మరో నెల రోజుల్లో జరిగే వెస్టిండీస్‌తో సిరీస్ నుంచి ఈ ప్లాన్‌ను అమలు చేయనుందట. ఇందులో భాగంగా విండీస్ సిరీస్‌లో కొత్త వారికి అవకాశాలు ఇవ్వనుందట. పుజారా ప్లేసులో ఐపీఎల్లో అదరగొట్టిన యశస్వీ జైస్వాల్‌ను రీప్లేస్ చేయనున్నారట. జైస్వాల్ రాణిస్తే అతడ్ని మూడో ప్లేసులో సెటిల్ చేయాలని అనుకుంటున్నారట. దీంతో ఇక పుజారా మూటా ముల్లె సర్దుకోవాల్సిందేనని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.