భారత క్రికెట్‌లో చాలా కాలంగా లేని ఒక కొత్త పద్ధతికి బీసీసీఐ శ్రీకారం చుట్టబోతుంది. అదే.. వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లు. గతంలో టీమిండియా కెప్టెన్ అంటే దాదాపు అన్ని ఫార్మాట్లకు కెప్టెన్‌గానే ఉన్న పరిస్థితి. సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ.. ఇలా అందరూ అదే సాంప్రదాయంతో భారత జట్టును నడిపించారు. అయితే.. ఈ ఫార్ములాను ఇప్పటికే చాలా దేశాలు బ్రేక్ చేశాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా జట్లకు ఇద్దరేసి కెప్టెన్లు ఉన్నారు. టెస్టులకు ఒకరు, వన్డేలు, టీ20లకు ఒకరు. ఇదే పద్ధతిని ఇప్పుడు టీమిండియాలోనూ ప్రవేశ పెట్టేందుకు బీసీసీఐ దాదాపు అన్ని ఏర్పాట్లు చేసేసింది. కేవలం అధికారిక ప్రకటన లేకుండా.. ఈ ‘స్ల్పిట్ కెప్టెన్సీ’ విధానాన్ని అవలంభించేందుకు రెడీ అవుతుంది.
టీ20 వరల్డ్ కప్ 2022 తర్వాత.. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు హార్ధిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించిన బీసీసీఐ.. ఇప్పుడు శ్రీలంకతో మంగళవారం నుంచి జరగబోయే టీ20 సిరీస్‌కు సైతం పాండ్యానే కెప్టెన్‌గా నియమించింది. రోహిత్ శర్మను ఉద్దేశపూర్వంగానే టీ20లకు దూరం పెడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. జనవరి 1న ముంబైలో.. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్, ఎన్‌సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్, మాజీ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మతో బీసీసీఐ రివ్యూ మీటింగ్ నిర్వహించింది. ఈ సమావేశంలో బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. అనధికారికంగా హార్దిక్ పాండ్యాను టీ20లకు కెప్టెన్‌గా పర్మినెంట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. రోహిత్ శర్మను మాత్రం వన్డే, టెస్టు కెప్టెన్సీ బాధ్యతల్లో కొనసాగించేందుకు ఓకే చెప్పింది బీసీసీఐ.
తరచూ గాయాలతో, ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడే రోహిత్ శర్మ కెప్టెన్‌గా అన్‌ఫిట్ అని, అతన్ని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పిస్తారనే ప్రచారం జరిగింది ఈ సమావేశానికి ముందు. రోహిత్ కెప్టెన్ అయిన తర్వాత.. ఒక్క విదేశీ టెస్టులోనూ ఆడలేదు. పైగా అతను కెప్టెన్ అయిన తర్వాత.. టీమిండియాకు ఐదుగురు కెప్టెన్లుగా వ్యవహరించారు. కేవలం ఏడాది కాలంలోనే రోహిత్ అనేక మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. రెగ్యులర్ కెప్టెన్ లేకపోవడం జట్టుపై కచ్చితంగా ప్రభావం చూపుతుందన్న విషయం అందరికి తెలిసిందే. అయినా కూడా.. టీ20 కెప్టెన్సీ పాండ్యాకు అప్పగించి.. వన్డే, టెస్టు కెప్టెన్‌గా మాత్రం రోహిత్ శర్మ కొనసాగేలా బీసీసీఐ ఒప్పుకుంది.
అయితే.. సరిగ్గా ఏడాది క్రితం ఇదే విషయాన్ని విరాట్ కోహ్లీ బీసీసీఐ ముందు ఉంచితే మాత్రం ససేమిరా అంది. అప్పుడు బీసీసీఐ అధ్యక్షుడు, ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడు వేరు కదా అని అనుకుని ఉండవచ్చు. కానీ.. బీసీసీఐ కీలక నిర్ణయాలు అన్ని బీసీసీఐ కార్యదర్శి జైషా చేతుల్లోనే ఉంటాయనే విషయం బహిరంగ రహస్యమే. అప్పుడు ఇప్పుడు జైషానే బీసీసీఐ కార్యదర్శి, సో.. అధ్యక్షుడి మార్పుకు ఈ మార్పుకు ముడిపెట్టలేం. ఇక విరాట్ కోహ్లీ.. మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ భారంతో తన బ్యాటింగ్ దెబ్బతింటుందని గ్రహించి.. టీ20 కెప్టెన్సీని స్వచ్ఛందంగా వదులుకున్నాడు. కానీ.. వన్డేలు, టెస్టుల్లో భారత కెప్టెన్‌గా కొనసాగతాననే తన నిర్ణయాన్ని బీసీసీఐ ముందు ఉంచాడు.
అయితే.. కోహ్లీ నిర్ణయంతో ఏకీభవించని బీసీసీఐ.. పరిమిత ఓవర్లకు ఒకే కెప్టెన్ ఉండాలని తాము బలంగా నమ్ముతున్నట్లు చెప్పి.. కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి అవమానకరంగా తొలగించింది. దీంతో.. కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ కూడా రాజీనామా చేశాడు. ఆ తర్వాత టీమిండియా ప్రదర్శన ఎంత దారుణంగా తయారైందో అందరికి తెలిసిందే. టెస్టుల్లో నంబర్ స్థానం కోల్పోయాం. టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్‌లో చిత్తుగా ఓడిపోయాం. ఆసియా కప్‌లో దారుణ ప్రదర్శన ఇలా.. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వదిలేసిన తర్వాత టీమిండియా పరిస్థితి అధ్వానంగా తయారైంది. విజయాల పరంగా మెరుగ్గా ఉన్నా.. జట్టులో నిలకడలేకుండా పోయింది. తరచూ కెప్టెన్ల మార్పుతో అభిమానులు విసుగెత్తిపోయారు. ఇలా.. కోహ్లీకి అన్యాయం చేసిన బీసీసీఐ తగిన మూల్యం చెల్లించింది.
కోహ్లీ అడిగినట్లు టెస్టు, వన్డే కెప్టెన్సీ అతనికే ఉండనిచ్చి, రోహిత్‌కు లేదా వేరేవారికి టీ20 కెప్టెన్సీ ఇచ్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. కానీ.. పరిమిత ఓవర్ల ఫార్మాట్లు (వన్డే, టీ20)లకు ఒకే కెప్టెన్ అంటూ.. కోహ్లీని తప్పించి రోహిత్‌కు కెప్టెన్సీ ఇచ్చిన బీసీసీఐ.. ఇప్పుడు మాత్రం కోహ్లీ చెప్పిన ప్లాన్‌ను ఫాలో అవుతూ.. పాండ్యాకు టీ20, రోహిత్‌కు టెస్టు, వన్డే కెప్టెన్సీ ఇచ్చింది. మరి కోహ్లీ విషయంలో వర్క్‌అవుట్ కాని ఫార్ములా ఇప్పుడెలా వర్క్‌అవుట్ అవుతుందని బీసీసీఐ భావిస్తుందంటూ.. క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. విరాట్ కోహ్లీ విషయంలో ఒక న్యాయం, రోహిత్ శర్మకు ఒక న్యాయం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#TeamIndia squad for three-match T20I series against Sri Lanka.#INDvSL @mastercardindia pic.twitter.com/iXNqsMkL0Q
— BCCI (@BCCI) December 27, 2022