ఏడాదిన్నర క్రితం అతనే టీమిండియాకు హీరో.. కానీ ఇప్పుడు కనీసం సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా ఇవ్వలేదు బీసీసీఐ. ఒక్క సిరీస్‌కు అందుబాటులో లేకుంటే మరీ ఇంత కఠినంగా వ్యవహరిస్తారా? అంటూ బీసీసీఐపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు.
తాజాగా బీసీసీఐ అన్యువల్ కాంట్రాక్ట్ లిస్ట్ విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో మొత్తం నాలుగు కేటగిరిల్లో ఆటగాళ్లతో కాంట్రాక్ట్ చేసుకుంది. కొంతమందికి ప్రమోషన్ దక్కగా కొంతమంది గ్రేడ్ తగ్గించింది. మరి కొంతమంది ఆటగాళ్లను అయితే ఏకంగా అన్యువల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించింది. అందులో తెలుగు క్రికెటర్ హనుమ విహారి కూడా ఉన్నాడు. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై క్రికెట్ వర్గాల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక తెలుగు క్రికెటర్ కావడంతోనే విహారి విషయంలో ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నారని క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు.
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ముందు గాయం, ఫిట్‌నెస్ సమస్యలతో జట్టుకు దూరమైన విహారి.. తిరిగి ఫిట్‌నెస్ సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. జాతీయ జట్టులో లేకపోయినా దేశవాళీ క్రికెట్‌లో విహారి మంచి ప్రదర్శన కనబర్చాడు. ఇటివల చేతికి గాయమైనా.. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్‌తో తన జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అలాగే 2021లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ సందర్భంగా సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టుల్లో అశ్విన్‌తో కలిసి అద్భుతమైన డిఫెన్స్‌తో ఇండియాను ఓటమి నుంచి కాపాడింది విహారినే. ఆస్ట్రేలియా పేసర్లు బౌన్సర్లతో గాయపరుస్తున్నా.. 161 బంతులను ఎదుర్కొని నాటౌట్‌గా నిలిచి భారత్‌ను ఓడిపోకుండా కాపాడాడు.
ఆ ఇన్నింగ్స్‌ను క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోరు. అలాంటి గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడి టెస్టు క్రికెట్ అంటో చూపించిన విహారి లాంటి ప్లేయర్‌కు మరింత సమయం ఇవ్వకుండా బీసీసీఐ చాలా కఠినంగా వ్యవహరించింది. గత ఏడాది ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ విహారీకి చివరి టెస్టు. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి విహారిని ఎంపిక చేయలేదు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 16 టెస్టులు ఆడిన విహారీ 34 యావరేజ్‌తో 834 రన్స్ చేశాడు. అందులో ఐదు హాఫ్ సెంచరీలు ఉండగా.. ఓ సెంచరీ కూడా ఉంది. ఆఫ్ స్పిన్నర్‌గా అతడు ఐదు వికెట్లు కూడా తీశాడు. ఆంధ్రా తరఫున దేశవాళీ క్రికెట్ ఆడుతున్న విహారీ 113 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 53 యావరేజ్‌తో 8600 రన్స్ చేశాడు. విహారీ ఖాతాలో 23 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 302 నాటౌట్.
ఇలా మంచి స్టాట్స్‌తో దేశవాళీ క్రికెట్‌లో అదరగొడుతూ.. త్వరలోనే జాతీయ జట్టులోకి వచ్చేలా ఉన్న విహారిని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించింది బీసీసీఐ. ఇప్పటికే టెస్టుల్లో కాస్త వీక్‌గా ఉన్న భారత బ్యాటింగ్ లైనప్‌కు విహారి లాంటి డిఫెన్సివ్ ప్లేయర్ అవసరం ఎంతో ఉంది. అయినా కూడా బీసీసీఐ విహారిని కనీసం సీ గ్రేడ్‌లో కూడా కొనసాగించకుండా తప్పించింది. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు క్రికెటర్లపై ఈ వివక్ష ఇంకెంత కాలం కొనసాగుతుందంటూ సంచలన ఆరోపణలు గుప్పిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
NEWS 🚨- BCCI announces annual player retainership 2022-23 – Team India (Senior Men).
More details here – https://t.co/kjK4KxoDdK #TeamIndia
— BCCI (@BCCI) March 26, 2023