ఐపీఎల్.. ఇండియన్ క్రికెట్ తలరాతని మార్చేసిన రిచ్ లీగ్. ఆటగాళ్లకి అద్భుతమైన అవకాశాలతో పాటు.., కోట్ల రూపాయలను కురిపించిన స్టార్ లీగ్. ఇందుకే బీసీసీఐ ఐపీఎల్ నిర్వహణ విషయంలో చాలా క్లియర్ గా ఉంటుంది. ఒక్కో ఐపీఎల్ సీజన్ విలువ కొన్ని వేల కోట్ల రూపాయలు. సో.. ఐపీఎల్ పై ఎప్పటికప్పుడు హైప్ క్రియేట్ చేస్తూ, అవసరమైన మార్పులు, చేర్పులు చేయడానికి బోర్డు కష్టపడుతూనే ఉంటుంది. ఇందులో భాగంగానే బీసీసీఐ తాజాగా నూతన రిటైన్ పాలసీ రూల్స్ విడుదల చేసింది.
దీని ప్రకారం 2022 నుండి ప్రతి ఐపీఎల్ ఫ్రాంచైజీలో ఆటగాళ్లు భారీ ఎత్తున మారబోతున్నారు. ప్రతి ఫ్రాంచైజీకి ఇప్పుడు తమతో ఉన్న నలుగురు ఆటగాళ్ళని మాత్రమే అంటిపెట్టుకునే వెసులుబాటు ఉంది. మిగిలిన వారంతా ఆటోమాటిక్ గా మెగా ఆక్షన్ లోకి వచ్చేస్తారు. ఇక ఈ నలుగురిలో కూడా ఫ్రాంచైజీ తమ ఇష్టం వచ్చిన వారిని ఉంచుకోవడానికి వీలు లేదు. దీనికి కూడా మార్గదర్శకాలను విడుదల చేశారు. ముగ్గురు భారతీయులు.. ఒక విదేశీ ప్లేయర్, లేదా ఇద్దరు భారతీయులు.. ఇద్దరు విదేశీలును ఉంచుకోవాల్సి ఉంటుంది.
ఈ రిటైన్ పాలసీ రూల్స్ ముంబై, ఢిల్లీ, చెన్నై వంటి పటిష్టమైన జట్లకు భారం కానుండగా.., హైదరాబాద్, పంజాబ్, రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్ వంటి జట్లకు వరం కానుంది. ఇక ఇదే సమయంలో మరో రెండు కొత్త జట్లు కూడా ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. రెండు కొత్త ఫ్రాంచైజీలకు సంబంధించి ఆగస్టు మధ్యలో టెండర్ విడుదల కానుంది. అక్టోబర్ మధ్యలో బిడ్ల ఆహ్వానం, డిసెంబర్ మాసంలో మెగా యాక్షన్ నిర్వహించబోతున్నారు. ఇందులో ఒక్కో ఫ్రాంచైజీ కనీస విలువ రూ.2000 కోట్లుగా నిర్ణయించనున్నారు. సో.. రానున్న కాలంలో ఐపీఎల్ ప్రేక్షకులకి సరికొత్త మజా అందించబోతుంది అనమాట.