ఇప్పటికే వన్డే కెప్టెన్ మార్పు, విరాట్ కోహ్లీ అలక, రోహిత్ శర్మ గాయంతో సతమతం అవుతున్న టీమిండియాకు మరో కొత్త సవాల్ ఎదురైంది. ఈ నెల 26 నుంచి సౌతాఫ్రికాతో భారత్ టెస్ట్ సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనకు ముందు భారత్‌కు కొత్త సమస్య వచ్చిపడింది. అదే టీమిండియా వైస్‌కెప్టెన్ ఎంపిక. నిజానికి సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు జట్టును ప్రకటించినప్పుడే సెలెక్టర్లు రోహిత్ శర్మను కొత్త వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. కాగా రోహిత్ ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడడంతో కథ మొదటికొచ్చింది. దీంతో సెలెక్టర్లు వైస్ కెప్టెన్ ఎంపికపై దృష్టి సారించారు.
ఈ రేసులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు లోకేష్ రాహుల్. అయితే అతనికి రిషబ్ పంత్ నుంచి గట్టి పోటీ తప్పేలా లేదు. వీరితోపాటు ఎంతోకాలంగా జట్టులో ఉన్న చటేశ్వర్ పుజారా పేరు కూడా సెలెక్టర్ల పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అలాగే రవిచంద్రన్ అశ్విన్, బుమ్రా కూడా రేసులో ఉన్నారు. అయితే వీళ్లందరూ కాకుండా ఇన్నిరోజులు వైస్ కెప్టెన్‌గా ఉన్న అజింక్యా రహానేకే సెలెక్టర్లు ఆ బాధ్యతను అప్పగించినా ఆశ్యర్యపోవాల్సిన పని లేదు. గతంలో కోహ్లీ గైర్హాజరీలో రహానే విజయంతంగా టీమిండియాను నడిపించాడు. అతని కెప్టెన్సీలో 6 టెస్టులు ఆడిన భారత్ నాల్గింటిలో గెలిచి 2 డ్రా చేసుకుంది. ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఇప్పటివరకు 79 టెస్టులు ఆడిన రహానే 39 సగటుతో 4,795 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
More details here – https://t.co/XXH3H8MXuM#TeamIndia #SAvIND https://t.co/jppnewzVpG
— BCCI (@BCCI) December 13, 2021
నిజానికి వైస్ కెప్టెన్ రేసులో పుజారా కూడా ఉన్నప్పటికీ ఫామ్‌లో లేకపోవడం అతనికి మైనస్‌గా మారింది. ఇప్పటివరకు 92 టెస్టులు ఆడిన పుజారా 44 సగటుతో 6,589 పరుగులు చేశాడు. అందులో 18 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలున్నాయి. సుదీర్ఘ కాలంగా జట్టులో కొనసాగుతున్న అశ్విన్, బుమ్రా కూడా ఈ రేసులో ఉన్నారు. ఇప్పటివరకు అశ్విన్ 81 టెస్ట్‌ల్లో 427 వికెట్లు పడగొట్టగా, బుమ్రా 24 టెస్టుల్లో 101 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో ఫామ్ కోల్పోవడంతో రహానే వైస్ కెప్టెన్సీ కోల్పోయిన సంగతి తెలిసిందే. మరి టీమిండియా వైస్ కెప్టెన్‌గా ఎవరు ఉంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: నన్ను తప్పిస్తే ద్రావిడ్ వచ్చాడు.. అలాగే రహానేను తప్పిస్తే..