ఐపీఎల్ మెగా వేలానికి ముందు ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేసుకునే అంశంపై తుది గడువును ప్రకటించింది బీసీసీఐ. కొత్త ఫ్రాంచైజీలయిన లక్నో, అహ్మదాబాద్‌లకు డెడ్‌లైన్ విధించింది. గతంలో ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు గత ఏడాది డిసెంబర్ 25ను గడువు తేదీగా నిర్ణయించినా.. అహ్మదాబాద్ ఫ్రాంచైజీని దక్కించుకున్న సీవీసీ క్యాపిటల్స్‌పై బెట్టింగ్ ఆరోపణలు రావడంతో ఆటగాళ్ల ఎంపిక వాయిదా పడ్డది. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి జనవరి 31ని డెడ్‌లైన్‌గా ప్రకటిస్తూ బీసీసీఐ అల్టిమేటం జారీ చేసింది.దీంతో తప్పనిసరిగా రెండు కొత్త ఫ్రాంచైజీలు జనవరి 31లోగా తమ తుది ఆటగాళ్ల జాబితాను బీసీసీఐకి సమర్పించాల్సి ఉంటుంది.
గతంలో బీసీసీఐ 2022 ఐపీఎల్ మెగా వేలాన్ని బెంగుళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ప్రక్రియ పూర్తి అయితే కానీ, వేలం నిర్వహించే తేదీలు, వేదికలపై స్పష్టత లేదని బీసీసీఐ ప్రతినిధి ఒకరు వెల్లడించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే, అహ్మదాబాద్ ఇప్పటికే తమ ఫ్రాంచైజీ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్, కోచ్‌గా ఆశిష్ నెహ్రా, మెంటార్‌గా గ్యారీ కిర్‌స్టెన్‌ను నియమించుకున్నది. మరోవైపు సంజీవ్ గొయెంకా ఆధ్వర్యంలోని లక్నో ఫ్రాంచైజీ హెడ్ కోచ్‌గా ఆండీ ఫ్లవర్, మెంటార్ గౌతమ్ గంభీర్‌ను నియమించుకున్న విషయం తెలిసిందే. అయితే కెప్టెన్ విషయంలో మాత్రం లక్నో ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే బరిలో ఉన్న 8 ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లను మినహాయించి వేలంలో పాల్గొనే ఆటగాళ్లలో ముగ్గురు క్రికెటర్లను ఎంపిక చేసుకునే అవకాశాన్ని కొత్త ఫ్రాంచైజీలకు కల్పించిన విషయం తెలిసిందే.