టీమిండియా గత కొంత కాలంగా తీరికలేకుండా సిరీస్ లు, టోర్నీలు ఆడుతోంది. ఆసియా కప్ ముగిసిన వెంటనే సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా తో టీ20 సిరీస్ ఆడిన భారత్.. మళ్లీ వెంటనే టీ20 వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొంది. ఈ టోర్నీలో సెమీస్ లోనే ఇంటిదారి పట్టింది టీమిండియా. అనంతరం సీనియర్లు అయిన విరాట్, రోహిత్, రాహుల్ లకు విశ్రాంతి ఇచ్చి.. మిగతా ఆటగాళ్లను అటు నుంచి అటే కివీస్ పర్యటనకు పంపింది. ఇక ప్రస్తుతం బంగ్లా పర్యటనలో ఉన్న టీమిండియా ఘోర ప్రదర్శన కనబరుస్తోంది. ఈ క్రమంలోనే వన్డే సిరీస్ ను కోల్పోయింది. ఇక వచ్చే కొత్త ఏడాది సైతం భారత జట్టు తీరికలేని షెడ్యూల్లతో బిజీగా మారబోతోంది. మాస్టర్ కార్డ్ సిరీస్ లో భాగంగా బీసీసీఐ శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లతో జరిగే టీ20, వన్డే, టెస్ట్ సిరీస్ లకు సంబంధించి షెడ్యూల్ ను రిలీజ్ చేసింది. ఇండియా వేదికగా ఈ మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ మ్యాచ్ ల్లో భాగంగా హైదరాబాద్ లో సైతం ఓ మ్యాచ్ భారత్ ఆడనుంది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
2023 కొత్త సంవత్సరం ప్రారంభం నుంచే టీమిండియా బిజీ బిజీ షెడ్యూల్ తో మ్యాచ్ లు ఆడబోతుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను తాజాగా BCCI విడుదల చేసింది. మాస్టర్ కార్డ్ సిరీస్ లో భాగంగా టీమిండియాకు రానున్నాయి విదేశీ జట్లు శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలు. మాస్టర్ కార్డ్ సిరీస్ లో భాగంగా టీమిండియా తొలుత శ్రీలంకతో తలపడనుంది. కొత్త ఏడాది ప్రారంభం అయిన రెండు రోజులకే మ్యాచ్ లు మెుదలు కానున్నాయి. జనవరి 3న ముంబై వేదికగా లంకతో తొలి టీ20 ఆడనుంది భారత్. జనవరి 15వ తారీఖు వరకు లంకతో మూడు టీ20లు, మూడు వన్డే మ్యాచ్ టీమిండియా ఆడనుంది. ఆ తర్వాత వెంటనే కేవలం 3 రోజుల వ్యవధిలోనే జనవరి 18 నుంచి న్యూజిలాండ్ తో మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి.
ఇక కివీస్ తో కూడా మూడు వన్డేలు, మూడు టీ20ల మ్యాచ్ లు ఉన్నాయి. జనవరి 18న తొలి వన్డే హైదరాబాద్ వేదికగా జరగనుంది. ఇది క్రికెట్ ను ఎంతగానో ప్రేమించే హైదరాబాద్ వాసులకు సంతోషకరమైన వార్త. అనంతరం వారం రోజుల వ్యవధిలోనే బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా భారత గడ్డపై అడుగుపెట్టనుంది. 4 టెస్టు మ్యాచ్ ల్లో భాగంగా ఫిబ్రవరి 9 న నాగపూర్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఆసిస్ తో జరిగే మూడు వన్డే మ్యాచ్ ల అనంతరం మాస్టర్ కార్డ్ సిరీస్ మార్చి 22న ముగుస్తుంది. ఆసిస్ తో జరిగే రెండో వన్డే కు వైజాగ్ వేదిక కానుంది. ఇక వచ్చే మూడు నెలలు టీమిండియా ఊపిరి పీల్చుకోలేనంత బిజీగా ఉండబోతోంది. ఇన్ని మ్యాచ్ లు ఉండటం క్రికెట్ ఫ్యాన్స్ కు పండగే అని చెప్పాలి.
🚨 NEWS 🚨: BCCI announces schedule for Mastercard home series against Sri Lanka, New Zealand & Australia. #TeamIndia | #INDvSL | #INDvNZ | #INDvAUS | @mastercardindia
More Details 🔽https://t.co/gEpahJztn5
— BCCI (@BCCI) December 8, 2022