భారత మహిళా క్రికెటర్ రాజేశ్వరి గైక్వాడ్ వివాదంలో చిక్కుకుంది. తన సన్నిహితులతో సూపర్ మార్కెట్ పై దాడికి పాల్పడ్డ ఆమె.. దుకాణదారుడిపై చేయి చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజేశ్వరి గైక్వాడ్ కర్ణాటకలోని విజయపురలో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో ఆమె, కాస్మొటిక్స్ కొనడం కోసం.. కాలనీలోని ఓ సూపర్ మార్కెట్ కు వెళ్ళింది. అక్కడకి వెళ్ళాక ఆమె సిబ్బందితో ఏదో విషయమై గొడవపడినట్లు సమాచారం. సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ఆమె.. అక్కడి నుంచి వెళ్లిపోయింది. కొద్దిసేపటి తర్వాత తన సన్నిహితులతో కలిసి వచ్చి సూపర్ మార్కెట్ సిబ్బందిపై దాడి చేసింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఘటనపై సూపర్ మార్కెట్ నిర్వాహకులు పోలీసులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన అనంతరం రాజేశ్వరి గైక్వాడ్ సూపర్ మార్కెట్ సిబ్బందికి క్షమాపణలు చెప్పినట్లు సమాచారం. అయితే సీసీటీవీ ఫుటేజ్ క్లారిటీ లేకపోవడంతో.. ఈ ఘటనలో తప్పెవరిది? సిబ్బందిపై ఎవరు దాడి చేసింది ఎవరు? ఎంత మంది వచ్చారనే వివరాలుతెలియరాలేదు. ఏదేమైనా.. చిల్లర గొడవతో రాజేశ్వరి గైక్వాడ్ అప్రతిష్టపాలైంది. అయితే ఈ ఘటనపై ఆమె ఎటువంటి వివరణ ఇవ్వలేదు. కాగా, రాజేశ్వరి గైక్వాడ్ 2014 జనవరిలో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటివరకు భారత్ తరుపున 2 టెస్టులు, 64 వన్డేలు, 44 టీ20 మ్యాచులు ఆడిన గైక్వాడ్.. టెస్టుల్లో 5, వన్డేల్లో 99, టీ20 మ్యాచుల్లో 54 వికెట్లు తీసింది.