బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టులో టీమిండియా పట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో పంత్, జడేజా సెంచరీలతో చెలరేగడంతో భారత్ 416 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం ఇంగ్లండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా బౌలర్లు 284 పరుగులకే కట్టడి చేశారు. 127 పరుగుల లీడ్‌తో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ 3 వికెట్లు కోల్పోయి 125 పరుగుల వద్ద మూడో రోజు ఆటను ముగించింది. దీంతో టీమిండియా మొత్తం మీద 257 పరుగుల ఆధిక్యంలో ఉంది.
తొలి రెండు రోజులు బ్యాట్ బాల్ పోరులా సాగిన టెస్టులో మూడో రోజు కాస్త మసాలా వచ్చి చేరి.. మాటల యుద్దంగా కూడా సాగింది. మూడో రోజు ఇన్నింగ్స్ 14వ ఓవర్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జానీ బెయిర్‌స్టో మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై జానీ బెయిర్‌స్టో స్పందించాడు. అసలు కోహ్లీతో గొడవ ఎందుకు జరిగిందో వివరించాడు. కోహ్లీతో తనకు ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేశాడు. పైగా కోహ్లీపై ప్రత్యర్థిగా బరిలో దిగడాన్ని అదృష్టంగా భావిస్తానని చెప్పాడు. తామిద్దరం ఒకరినొకరు గౌరవించుకుంటామని పేర్కొన్నాడు.
క్రికెట్ మీద కోహ్లీకి అపారమైన ప్రేమ, అంకితభావం ఉందని, ఆ దూకుడుతోనే అతను గేమ్ ఆడుతుంటాడని బెయిర్ స్టో వ్యాఖ్యానించాడు. నిజానికి తనని డిన్నర్‌కు పిలవనందుకే కోహ్లీ కోపం వచ్చిందని బెయిర్‌స్టో నవ్వుతూ బదులిచ్చాడు. ఏ జట్టయినా తన దేశం కోసమే ఆడుతుందని, మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా దేశానికి పేరు తీసుకుని రావాలనే భావిస్తుందని బెయిర్‌స్టో చెప్పాడు. తమ ఇద్దరి విషయంలోనూ అదే జరిగిందని వివరించాడు. భారత జట్టును ఎదుర్కొనడం ఎప్పటికీ కష్టసాధ్యమేనని అన్నాడు. సిరీస్ సిరీస్‌కూ టీమిండియా ప్లేయర్లు రాటుదేలుతున్నారని కితాబిచ్చాడు.
దీనికి కోహ్లీ కూడా మినహాయింపు కాదని పేర్కొన్నాడు. తామిద్దరం ప్రత్యర్థులుగా ఎదురుపడటాన్ని ఆస్వాదిస్తానని అన్నాడు. విరాట్ కోహ్లీతో గొడవ తర్వాత తనలో మరింత బాగా ఆడాలనే కసి పెరిగిందని బెయిర్‌స్టో పేర్కొన్నాడు. కోహ్లీతో గొడవ కంటే ముందు నిదానంగా ఆచీతూచి ఆడుతున్న బెయిర్‌స్టో.. గొడవ అనంతరం కసితో ఆడుతున్నట్లు కనిపించాడు. అదే ఊపులో సెంచరీ కూడా బాదేశాడు. నిజానికి బెయిర్‌స్టోతో కోహ్లీ గొడవకు దిగడం టీమిండియాకు కొంత నష్టం చేసిందనే చెప్పాలి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Bairstow said “There was nothing between Virat and me – we are fortunate to play against each other – he plays with lots of passion, that is what make him better”.
— Johns. (@CricCrazyJohns) July 4, 2022