భారత్-ఆస్ట్రేలియా మధ్య గురువారం నుంచి ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. నాగ్‌పూర్ వేదికగా రేపు(గురువారం) ఉదయం నుంచి తొలి టెస్టు మొదలుకానుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇప్పటికే సంసిద్ధంగా ఉన్నాయి. ఆస్ట్రేలియాను ఎలాగైనా ఓడించి వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరాలని టీమిండియా, గత రెండు, మూడు ఏళ్ల నుంచి ‘బీజీటీ’(బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ)ని ఓడిపోతున్న ఆస్ట్రేలియా ఈ సారి ఎలాగైనా గెలవాలనే కసితో ఉన్నాయి. విజయం కోసం ఇప్పటికే ఎవరికి వారు ప్రణాళికలు వేసుకోవడం, గెలుపుపై ధీమా వ్యక్తం చేయడం జరిగిపోయాయి.
అయితే.. ఇరు జట్లు ప్రత్యర్థి టీమ్‌లోని కొంతమంది ప్రధాన ఆటగాళ్లపై ప్రత్యేకంగా శ్రద్ధపెడుతున్నాయి. వారి కోసం ప్రత్యేకమైన ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నాయి. టీమిండియాలో విరాట్ కోహ్లీని త్వరగా అవుట్ చేయడం, స్పిన్నర్లను ధీటుగా ఎదుర్కొవడం ఆస్ట్రేలియా ప్రధాన లక్ష్యాలు కాగా.. స్మిత్‌ను ఒక ప్లాన్ ప్రకారం అవుట్ చేయడం టీమిండియా బౌలర్లకు ప్రధాన టార్గెట్. ఈ టార్గెట్లలో సక్సెస్ అయ్యేందుకు ఇరు జట్లు తమ రహస్య ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాయి. ఆస్ట్రేలియా ముఖ్యంగా విరాట్ కోహ్లీపై ఫోకస్ పెట్టింది.
అయితే.. కోహ్లీ విషయంలో ఆస్ట్రేలియా ఇప్పుడే కాదు.. చాలా కాలంగా ఇదే భయాన్ని ప్రదర్శిస్తోంది. విరాట్ కోహ్లీని పెద్ద ఇన్నింగ్స్ ఆడనివ్వకుండా, వీలైనంత త్వరగా అవుట్ చేసేందుకు మ్యాచ్ ముందు రోజు గంటల కొద్ది టీమ్ మీటింగ్‌లు నిర్వహిస్తూ.. కోహ్లీ గతంలో ఆడిన మ్యాచ్‌లకు సంబంధించిన వీడియోలను ప్రదర్శిస్తూ.. అందులో కోహ్లీ ఏ బాల్‌ను ఎలా ఆడుతున్నాడు. అతని షాట్ సెలెక‌్షన్, ఫుట్‌వర్క్‌లను చాలా సూక్ష్మంగా పరిశీలిస్తున్నారు. కోహ్లీ ప్లస్, మైనస్‌లను అంచనా వేస్తూ.. అతన్ని అవుట్ చేసేందుకు ఎలాంటి బౌలింగ్ వేయాలి, ఏ బౌలర్‌తో వేయించాలి, ఎలాంటి ఫీల్డ్ సెట్ చేయాలనే విషయంలో ఆస్ట్రేలియా కోచ్, కెప్టెన్‌తోపాటు టీమ్ మొత్తం ఆ మీటింగ్‌లో పాల్గొంటుంది.
ఈ మీటింగ్ కేవలం కోహ్లీ కోసమే నిర్వహిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే త్వరత్వరగా వికెట్లు పడినా కోహ్లీ నిదానంగా ఎలాంటి భాగస్వామ్యాలు నిర్మిస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే ఓపెనర్ల నుంచి మంచి స్టార్ట్ వస్తే.. వేగంగా కూడా ఆడగలడు. ఇలా ఎలాంటి పరిస్థితుల్లోనైనా కోహ్లీ డేంజరస్ ప్లేయర్. పైగా కోహ్లీ క్రీజ్‌లో కుదురుకుంటే.. భారీ ఇన్నింగ్స్‌లు ఆడగలడు. ఇదే విషయం ఆస్ట్రేలియాను తెగ కలవర పెడుతోంది. ఇప్పుడే కాదు.. గతంలోనూ కోహ్లీ గురించి ఆసీస్‌ది ఇదే భయం.
అందుకు మంచి ఉదాహరణ 2018 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ, ఆ సిరీస్ సమయంలో కోహ్లీ స్టాట్స్‌ను పెద్ద స్క్రీన్లపై చూపిస్తూ.. ఆసీస్ టీమ్ జరిపిన మీటింగ్ అప్పట్లో ఎంత వైరల్ అయిందో తెలిసిందే. అప్పుడు కోహ్లీ ఉన్న ఫామ్ అలాంటింది. ఇప్పుడు కూడా కోహ్లీ మళ్లీ అలాంటి ఫామ్‌లోనే ఉన్నాడు. అందుకే ఇప్పుడు నాగ్‌పూర్ వేదికగా జరిగే తొలి మ్యాచ్‌కు ముందు కూడా కోహ్లీ గురించి ఆసీస్ ప్రత్యేక మీటింగ్ జరిపినట్లు సమాచారం. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.