ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్ లో ఉంది సౌతాఫ్రికా. మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి రెండు టెస్ట్ లను గెలుచుకుని సిరీస్ ను కైవసం చేసుకుంది ఆస్ట్రేలియా. అదే ఊపులో మూడో టెస్ట్ ను కూడా గెలుచుకోవాలని చూస్తోంది. తాజాగా జరుగుతున్న సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ను 475 పరుగులకు డిక్లేర్డ్ ఇచ్చింది. ఆసిస్ స్టార్ ఓపెనర్ వార్నర్ విఫలం అయినా.. మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా భారీ సెంచరీతో చెలరేగాడు. 195 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్ లో ఆసిస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ తీసుకున్న నిర్ణయం అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. అదేంటంటే? ఖవాజా డబుల్ సెంచరీకి కేవలం 5 పరుగుల దూరంలో ఉన్నప్పుడే కమ్మిన్స్ ఇన్నింగ్స్ ను డిక్లేర్డ్ చేశాడు.
సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్ లో ఆసిస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా సెంచరీతో చెలరేగాడు. 368 బంతులు ఎదుర్కొని 19 ఫోర్లు, 1 సిక్స్ తో 195 పరుగులు చేశాడు. ఇక అతడు డబుల్ సెంచరీ చేయడం ఖాయం అని అందరు అనుకున్నారు. కానీ అంతలో వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగింది. వర్షం అనంతరం ఆటను కొనసాగిద్దాం అనుకున్న ఖవాజాకు గట్టి షాక్ ఇచ్చాడు ఆసిస్ కెప్టెన్ కమ్మిన్స్. ఇన్నింగ్స్ ను 475 పరుగుల వద్దే డిక్లేర్డ్ ఇస్తున్నట్లు ప్రకటించాడు. దాంతో కంగుతినడం ఖవాజా వంతైంది. అప్పటికే 195 రన్స్ చేసి డబుల్ సెంచరీకి కేవలం 5 పరుగుల దూరంలో ఉన్నాడు ఖవాజా. కెరీర్ లో తొలి డబుల్ సెంచరీ నమోదు చేద్దామని అనుకున్న ఖవాజాకు ఊహించని పరిణామం ఎదురైంది.
ఈ క్రమంలోనే అయితే డిక్లేర్ ప్రకటించి సౌతఫ్రికాను ఆడించి త్వరగా ఆలౌట్ చేయాలని కమ్మిన్స్ ప్లాన్ గా కనిపిస్తోంది. ఆసిస్ బౌలర్లు ఫుల్ స్వింగ్ లో ఉన్నారు కాబట్టి, పైగా ఇంకా ఒక్కరోజే మిగిలి ఉండటంతో వారిని ఆలౌట్ చేసి ఫాలో ఆన్ ఆడించాలని అతడి గేమ్ ప్లాన్ గా క్రీడా నిపుణులు అభిప్రాయా పడుతున్నారు. ప్రస్తుతం సౌతాఫ్రికా 3 వికెట్లు కోల్పోయి 71 పరుగులు చేసింది. ఇంకా ఒక్కరోజే ఆట మిగిలి ఉండటంతో మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కేవలం 5 పరుగుల దూరంలో తన తొలి డబుల్ సెంచరీని ఖవాజాకు దూరం చేయడంతో అభిమానులు కమ్మిన్స్ పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. కమ్మిన్స్ కు ఇంత స్వార్థం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
అయితే తాను కూడా జాతివివక్షను ఎదుర్కొన్నాను అని ఈ మధ్యే తెలిపాడు ఖవాజా. అనంతరం ఇలా జరగడం కొన్ని సందేహాలకు దారితీస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే గతంలో కూడా వెస్టిండీస్, భారత్ జట్లు బ్యాటర్లు 190ల్లో ఉండగానే ఇన్నింగ్స్ ను డిక్లేర్ గా ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. 1960 లో విండీస్ బ్యాటర్ ఫ్రాంక్ ఓరెల్ 197 పరుగుల వద్ద ఉండగా విండీస్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఇక ఇండియా కూడా పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో సచిన్ 194 పరుగుల వద్ద ఉన్నప్పుడు భారత్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ గా ప్రకటించి ఆశ్చర్యంలో ముంచెత్తింది.
A majestic double 💯 awaits 👊⏳@Uz_Khawaja’s brilliance sealed a perfect day for the hosts in the final #AUSvSA Test 💛#Khawaja #SonyLIV pic.twitter.com/tQtfvWIYxc
— Sony LIV (@SonyLIV) January 5, 2023