ఆసియా కప్ 2022 తొలి పోరులో పాకిస్తాన్ పై అద్భుత విజయాన్ని అందుకున్న భారత జట్టు, తదుపరి మ్యాచులో హాంగ్ కాంగ్ తో తలపడనుంది. ఇక్కడ హాంగ్ కాంగ్ ని చిన్న జట్టని తేలిగ్గా తీసుకోలేం. 2018 ఆసియా కప్ టోర్నీలో భాగంగా జరిగిన ఇండియా వర్సెస్ హాంగ్ కాంగ్ మ్యాచే అందుకు నిదర్శనం. 34 ఓవర్ల వరకు టీమిండియా బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారంటేనే అర్థం చేసుకోవచ్చు. హాంగ్ కాంగ్ ఎంత భయపెట్టిందన్నది.
పది దేశాలకే పరిమితమైన క్రికెట్ ప్రపంచంలో చాలా దేశాలు ఇప్పుడిప్పుడే, ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. అందులో హాంగ్ కాంగ్ కూడా ఒకటి. ఇప్పటికే.. క్వాలిఫైయర్ మ్యాచుల్లో.. యూఏఈ, సింగపూర్, కువైట్ జట్లపై అలవోకగా గెలిచి సూపర్ 6 లోకి అడుగుపెట్టిన హాంగ్ కాంగ్..ఇప్పుడు కొండను ఢీకొట్టబోతోంది. భారత జట్టును ఓడించడమంటూ జరగదు. కానీ, కనీస పోటీ అయినా.. ఇవ్వగలదా! లేదా అన్నదే ప్రశ్న. హంగ్‌కాంగ్‌తో టీమిండియా ఇప్పటివరకూ రెండు వన్డేలు మాత్రమే ఆడింది. రెండు వన్డేల్లోనూ భారత జట్టుదే విజయం.
2008 ఆసియా కప్ (వన్డే ఫార్మాట్)లో హాంగ్ కాంగ్ తో మొదటిసారి తలపడిన భారత జట్టు, 256 పరుగుల తేడాతో ఆ జట్టును చిత్తుగా ఓడించింది. ఆ తర్వాత మరో 10 ఏళ్ల వరకూ భారత్, హాంగ్ కాంగ్ మధ్య మ్యాచ్ జరగలేదు. ఆపై.. 2018 ఆసియా కప్ టోర్నీలో గ్రూప్ స్టేజీకి అర్హత సాధించింది హాంగ్ కాంగ్. అయితే ఈసారి టీమిండియాకి అనుకున్నంత ఈజీగా గెలుపు దక్కలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 285 పరుగులు చేసింది. అనంతరం.. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హాంగ్ కాంగ్ కు ఓపెనర్లు నిజకత్ ఖాన్ (92), అన్సీ రత్ (73).. తొలి వికెట్‌కు 174 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.
September 18, 2018, Asia Cup
India vs Hong Kong pic.twitter.com/xemKqPzNwu— Govardhan Reddy (@gova3555) August 30, 2022
ఎంత మంది బౌలర్లను మార్చినా టీమిండియాకి 34వ ఓవర్ వరకూ వికెట్ దక్కలేదు. టీమిండియాపై హాంగ్ కాంగ్ విజయం సాధించడం ఖాయమనుకున్నారంతా. అయితే 34.1 ఓవర్లకు 174 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన హాంగ్ కాంగ్, 50 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్లు కోల్పోయి 259 పరుగులకి పరిమితమైంది. ఫలితంగా భారత జట్టు ఊపిరి పీల్చుకుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి మరోసారి పునరావృతం కావొచ్చని అభిమానులు భారత జట్టును హెచ్చరిస్తున్నారు. చిన్న జట్టు కదా! అని తేలిగ్గా తీసుకోకండి అని కామెంట్లు పెడుతున్నారు. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.