సంజయ్ మంజ్రేకర్.. మాజీ క్రికెటర్. అలాగే ప్రస్తుత వ్యాఖ్యత. ఇంత వరకు సంజయ్ కి అంతా గౌరవం ఇస్తారు. కానీ.., ఆటగాళ్ళని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేయడం, ఆ తరువాత విమర్శలకి గురి కావడం ఈ మాజీ క్రికెటర్ కి అలవాటు. టీమ్ ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాపై గతంలో ఇలానే కామెంట్స్ చేశాడు మంజ్రేకర్. జడ్డు బిట్ అండ్ పీసెస్ క్రికెటర్ మాత్రమే. అతను మ్యాచ్ విన్నర్ కాదు అంటూ కామెంట్స్ చేశాడు. ఏ ముహూర్తాన మంజ్రేకర్ ఆ మాటలు అన్నాడో తెలియదు గాని.., అప్పటి నుండి జడేజా పవర్ హిట్టింగ్ లో సూపర్ అనిపించుకుంటున్నాడు. దీంతో.., జడ్డు దుమ్మురేపిన ప్రతిసారి మంజ్రేకర్ ని ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్. కట్ చేస్తే.., ఇప్పుడు అశ్విన్ పై కూడా ఇలాంటి కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు సంజయ్ మంజ్రేకర్. ‘రవిచంద్రన్ అశ్విన్ను ఆల్టైమ్ గ్రేట్ బౌలర్లలో ఒకడిగా నేను పరిగణించలేను. ఎందుకంటే దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల్లో అతడు ఒక్కసారి కూడా 5 వికెట్ల ఘనత సాధించలేదు. సొంతగడ్డపై మాత్రం చెలరేగిపోతాడు. ఇక్కడ కూడా జడేజా, అక్షర్ పటేల్ అతనికి పోటీగా వికెట్స్ తీస్తున్నారు. అశ్విన్ను నిజమైన ఆల్టైమ్ గ్రేట్గా పరిగణించడంలో ఇవే నా సమస్యలని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.
దీంతో.., 78 టెస్టుల్లో 409 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్ పై ఇలాంటి కామెంట్స్ ఎలా చేస్తావు అంటూ మంజ్రేకర్ పై నెటిజన్స్ ట్రోల్స్ తో విరుచుకుపడ్డారు. తరువాత తనపై వస్తున్న ట్రోల్స్ కి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు మంజ్రేకర్. తన దృష్టిలో ఆల్టైమ్ గ్రేట్ అంటే గవాస్కర్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ తదితరుల్లాంటి వారని చెప్పుకొచ్చాడు. ఇంకా ఆ జాబితాలోకి రవిచంద్రన్ అశ్విన్ రాలేదని పేర్కొన్నాడు. సరిగ్గా.. ఇదే సమయంలో అశ్విన్ కూడా మంజ్రేకర్ ని టార్గెట్ చేస్తే ఓ సరదా ట్వీట్ వదిలాడు. అపరిచితుడులోని ఓ డైలాగ్ మీమ్ను పోస్ట్ చేశాడు. “అలా అనకు చారీ.. నా మనసు బాధపడుతుంది అనే డైలాగుతో ఉన్న ఫొటోను అశ్విన్ సెటైరిక్గా పోస్ట్ చేశాడు. దీంతో.. ఈ పోస్ట్ వైరల్ అయ్యింది. అయితే.., ఇక్కడితో కూడా వీరి వివాదానికి ఫుల్ స్టాప్ పడలేదు. ఈ మీమ్పై మంజ్రేకర్ కూడా స్పందించాడు. ‘చారీ గారూ క్రికెట్కు సంబంధించిన విషయాలను సూటిగా చెబితే చాలా మంది సహించలేకపోతున్నారు. వీటన్నిటిని చూస్తే కూడా నా గుండె బరువెక్కుతుందని మంజ్రేకర్ బదులిచ్చాడు. ఇక ఈ విషయాన్ని పెద్దది చేయడం ఇష్టం లేకనో, మంజ్రేకర్ లాంటి సీనియర్ కి గౌరవం ఇచ్చో అశ్విన్ నుండి మరోమారు బదులు రాలేదు. కానీ.., క్రికెట్ లవర్స్ మాత్రం అశ్విన్ కి పూర్తి మద్దతు తెలుపుతూ, మంజ్రేకర్ నోటి దురుసు తగ్గించుకోవాలని ట్రోల్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.