సౌరవ్ గంగూలీ, ధోని కెప్టెన్ గా ఉన్న సమయంలో టీమిండియా ఒక కుటుంబంలా ఉండేది. జట్టులో ఉన్న ప్రతి ప్లేయర్ మరో ప్లేయర్ కు ఆప్త మిత్రుడుగా ఉండేవారు. ఆ సమష్టితత్వమే.. ఎక్కడో జింబాబ్వే కింద టీమిండియాని ప్రపంచ ఛాంపియన్స్ గా మార్చింది.
అప్పట్లో క్రికెట్ యాడ్స్ చాలా బాగుండేవి. సచిన్, దాదా, దాదా బాయ్స్ ఇలా చాలా యాడ్స్ లో నటించారు. అవన్నీ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. దాదా అండ్ బాయ్స్ సింహంతో కలిసి చేసిన పెప్సీ యాడ్ 20 ఏళ్ళ తరువాత ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. అంతలా ఆ యాడ్స్ లో ఏముంది? ఇప్పుడున్న ఐడియాలజీ లేదు. ఇప్పుడున్న టెక్నాలజీ లేదు. ఇప్పుడు ఉన్న ప్రొడక్షన్ వ్యాల్యూస్ లేవు. ఏముందని ఆ యాడ్ ఇప్పటికీ మన మనసులను హత్తుకుటుంది? ఈ ప్రశ్నలు అన్నిటికీ ఒక్కటే సమాధానం “స్నేహం”!అవును.. ఆ యాడ్స్ లో ఆటగాళ్లపై కెప్టెన్ గా గంగూలీ చూపించే ప్రేమ ఉంది. మిగతా ప్లేయర్స్ మధ్య స్నేహం ఉంది. తనతో సమానమైన ఆట కలిగినా.. కెప్టెన్ మాటకి గౌరవం ఇచ్చే రాహుల్ ద్రావిడ్ గొప్పతనం ఉంది. బజ్జీ అమాయకత్వం ఉంది. రాయల్ బెంగాల్ టైగర్ గంగూలీ దైర్యం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. మనమంతా ఒక కుటుంబం అన్న విధంగా ఆటగాళ్ల మధ్య అందమైన అనుబంధం ఉంది.
అవును.. ఒకప్పుడు భారత జట్టంటే ఒక కుటుంబం.. ఒకరి కోసం మరొకరు తమ స్థానాలను త్యాగం చేయడం. ఒకరి కష్టంలో ఇంకొకరు అండగా నిలువడం. గడ్డు పరిస్థితుల్లో సహచరులకు సూచనలివ్వడం. ఇలా అంతా సమష్టిగా సాగేది. మరిప్పుడు పరిస్థితి మారిపోయింది. బయటి నుంచి చూస్తే అంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా.. ఇటీవలీ పరిణామాలు చూస్తుంటే.. ఎక్కడో ఏదో తేడా కొడుతున్నట్లు అనిపిస్తోంది. జట్టులో స్నేహితులుండరు.. కొలిగ్స్ మాత్రమే ఉంటారని రవిచంద్రన్ అశ్విన్, ప్రుథ్వీ షా చేసిన వ్యాఖ్యల అంతరార్థం ఇదే అనిపిస్తోంది. పరిస్థితులు పరీక్షిస్తున్నప్పుడు అండగా నిలువాల్సిన జట్టు సభ్యులు ఇప్పుడు ఎవరికి వారే యమునా తీరేలా వ్యవహరిస్తున్నారనడానికి ఇదే సరైన ఉదాహరణ.
ఈ శతాబ్దపు తొలి నాళ్లలో భారత జట్టు సమష్టితత్వం ప్రపంచంలోని మిగతా టీమ్ లన్నింటికీ ఆదర్శంగా నిలిచేది. అప్పట్లో ఒకరి కోసం ఒకరు అనే వాతావరణం ఉండేది. అందుకు ఉదాహరణలు కోకొల్లలు. మిడిలార్డర్ లో పెద్దగా రాణించలేకపోతున్న వీరేంద్ర సెహ్వాగ్ కోసం అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన ఓపెనింగ్ స్థానాన్నే త్యాగం చేశాడు. అంతే కాదు.. ఒకవేళ ఆ స్థానంలో సత్తాచాటక పోయినా.. జట్టులో నీ స్థానానికి ఏ ఢోకా లేదు అని భరోసా ఇచ్చి వీరూని బరిలో దింపాడు. సారథి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్న సెహ్వాగ్.. ఓపెనర్ గా పరుగుల వరద పారించాడు. మరే ఆటగాడికి సాధ్యం కాని రీతిలో విధ్వంసక రీతిలో చెలరేగి.. చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్ లో టెక్నిక్ పరంగా అత్యుత్తమ బ్యాట్స్ మన్ గా గుర్తింపు పొందిన రాహుల్ ద్రవిడ్.. ఒక దశలో రెగ్యులర్ వికెట్ కీపర్ అవతారమెత్తాడంటే అంతుకు కారణం జట్టు సమిష్టి తత్వమే. ఆ సమయంలో జట్టులోకి వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోతుండటంతో.. సౌరవ్ గంగూలీ ఆ బాధ్యతలను ద్రవిడ్ కు అప్పగించాడు. టీమ్ కోసం సర్వస్వం అర్పించేందుకు సదా సిద్ధంగా ఉండే మిస్టర్ డిపెండబుల్ మారు మాట్లాడకుండా.. చేతులకు గ్లౌజ్ లు తొడుక్కొని వికెట్ల వెనుక చేరిపోయాడు. ఇలా చెప్పుకుంటూ పోతే.. దాదా హయాంలో జరిగినన్ని వినూత్న చర్యలు.. మరే సారథి నాయకత్వంలోనూ సాధ్యం కాలేదు.
యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, మహమ్మద్ కైఫ్, జహీర్ ఖాన్, వీరేంద్ర సెహ్వాగ్.. ఇలా వీళ్లందరికీ కెరీర్ తొలి నాళ్లలో అండగా నిలువడంతోనే.. ఆ తర్వాత సుదీర్ఘ కాలం జట్టుకు సేవలందించారు. ఇలా అందరికీ సమానమైన ఆదరణ, అవకాశాలు అందాయి కాబట్టి.. వీరి మధ్య కూడా అద్భుతమైన స్నేహం మొలకెత్తింది. ఆ స్నేహమే సమిష్టితత్వంగా మారి.. ఇండియాని ప్రపంచ విజేతగా మార్చింది. విదేశీ కోచ్ లు, పేరున్న శిక్షణ సిబ్బంది ఇలా ఎందరున్నా.. జట్టులో తమకు సహకారం అందించే ప్లేయర్లు ఉంటే.. ఆటగాళ్లు అద్భుతాలు చేయగలరని గతంలో ఎన్నోసార్లు నిరూపితమైంది. ప్రత్యర్థి ఆటగాళ్లు క్రీజులో పాతుకుపోయి.. వికెట్ ఇవ్వని పరిస్థితి ఉన్న ప్రతిసారి బంతిని పార్ట్ టైమ్ లకు ఇచ్చే ఆనవాయితీ కూడా దాదా హయంలోనే ప్రారంభమైందని చెప్పొచ్చు. ఇలా వన్డేల్లో లెక్కకు మిక్కిలి సార్లు దాదా నుంచి బంతినందుకున్న సచిన్ టెండూల్కర్.. వన్డే క్రికెట్ లో ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ కంటే ఎక్కువ వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
మరి ఇప్పుడు జట్టులో అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. మహేంద్ర సింగ్ ధోనీ సారథి గా ఉన్నంత కాలం.. అర్ధరాత్రి అపరాత్రి కూడా అతడి గది తలుపులు తెరిచే ఉండేవని ఎందరో చెప్పారు. యువ ఆటగాళ్లు ఎప్పుడు ఎలాంటి సలాహాలు అవసరమైనా.. అతిడిని సంప్రదించేవారు. కొత్తగా వచ్చిన ప్లేయర్లలో భయం పోగొట్టి వారి సందేహాలు తీర్చడంలో మహీ ఎప్పుడూ ముందుండే వాడు. అయితే ప్రస్తుతం మాత్రం జట్టులో అలాంటి వాతావరణం లేదనే చొప్పొచ్చు. ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో చోటు దక్కని సమయంలో అశ్విన్ ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. తాజాగా యువ ఓపెనర్ ప్రుథ్వీ షా మాటల అంతరార్థం కూడా అదే. తనకు ఎవరు సహచరులు లేరని.. అండగా నిలిచేందుకు తనకు కోటరీ లేదని పేర్కొన్నాడు. టీమ్ గేమ్ అయిన క్రికెట్ లో ఇలాంటి పరిస్థితి మంచిది కాదనేది సీనియర్లు అభిప్రాయం.
ప్రస్తుత జట్టులో స్టార్లకు కొదవ లేకున్నా.. వాళ్లంతా కలిసి కట్టుగా కుటుంబంలా సాగడమే ఇబ్బందిగా పరిణమించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, శుభ్ మన్ గిల్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్.. ఇలా ప్రతి ఒక్కరూ అంతార్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. వీరింత ప్రచార చిత్రాల్లో తరచూ కనిపిస్తూనే ఉన్నారు. ఇంత ఎదిగినా, ఇంత సాధించినా.. వీరంతా ఒక కుటుంబంలా ఎందుకు ఉండలేకపోతున్నారు? కనీసం స్నేహితులుగా ఆయినా.. ఎందుకు ముందుకి పోలేకపోతున్నారు? అంత మంచి వాతావరణం టీమ్ లో ఎందుకు కనిపించడం లేదు? క్రికెట్ అంటే జెంటిల్మెన్ గేమ్ మాత్రమే కాదు, సమష్టిగా పోరాడి గెలవాల్సిన ఓ యుద్ధం. అలాంటి ఆటలో ఈ ఇగోలతో సాధించేది ఏముంటుంది? రానున్న ప్రపంచ కప్ ని దృష్టిలో పెట్టుకుని అయినా.. మన ఇండియన్ క్రికెట్ టీమ్ ఓ ఫ్యామిలీలా ముందుకి పోవాలని కోరుకుందాము.