భారత క్రికెట్ లో ఆటగాళ్ల రిటైర్మెంట్ పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ మధ్య కాలంలోనే టీమిండియా ప్లేయర్స్ అయిన ఉతప్ప, ఈశ్వర్ పాండే.. మరికొంత మంది క్రికెట్ కు గుడ్ బై చెప్పిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా 34 ఏళ్ల క్రికెటర్ తన క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. అయితే అవకాశాలు రాక.. వచ్చినా గానీ ఫామ్ కోల్పొయి సతమతమవుతూ.. ఉంటే ఆ ఆటగాళ్లు ఇక తమ కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టే రోజు వచ్చిందని అర్దం చేసుకుని కెరీర్ కు వీడ్కోలు పలుకుతారు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
అనురీత్ సింగ్.. టీమిండియా జాతీయ జట్టుకు ఆడకపోయినప్పటికీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో బౌలర్ గా తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. సరైన అవకాశాలు రాకపోవడంతో ఈ 34 ఏళ్ల క్రికెటర్ తన కెరీర్ కు వీడ్కోలు పలకక తప్పలేదు. అనురీత్ తన ఇన్ స్టా గ్రామ్ లో తన వీడ్కోలు గురించి ఈ విధంగా రాసుకొచ్చాడు. “నేను చిన్నప్పటి నుంచి క్రికెటర్ అవ్వాలనే కలల కన్నాను. దానికి తగ్గట్టు గానే నా ప్రయాణాన్ని సాగించాను. నాకు 16 ఏళ్ల వయసున్నప్పుడే సుభానియా క్రికెట్ క్లబ్ ఢిల్లీ లో చేరాను. నేను అనుకున్నట్లుగానే నాకల త్వరలోనే నెరవేరింది. 2008లో ఇండియన్ రైల్వేస్ జట్టు తరపున రంజీ ట్రోఫీలో అరంగ్రేటరం చేశాను. నా సుధీర్ఘ కెరీర్ కు సహకరించిన మా కెప్టెన్&మెంటర్ సంజయ్ బంగార్ కు, అలాగే కోచ్ రాధే శ్యామ్ శర్మ గారికి.. బీసీసీఐ, అన్ని రైల్వే జట్లకు, ఐపీఎల్ జట్లకు నాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు” అంటూ రాసుకొచ్చాడు.
ఇక క్రికెట్ కెరీర్ విషయానికి వస్తే.. అనురీత్ 2007లో అండర్-22 విభాగంలో సీకే నాయుడు ట్రోఫీతో క్రికెట్ లోకి అరంగ్రేటరం చేశాడు. ఇక అనురీత్ సింగ్ 2018-19లో రైల్వేస్ తరపున, 2019-20 లో బరోడా తరపున ప్రాతినిధ్యం వహించాడు. అదీ కాక 2014 IPL వేలంలో ఇతడిని పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్టులోకి తీసుకుంది. ఆ జట్టులో మంచి ప్రదర్శన కనబరచడంతో తర్వాత రాజస్థాన్ రాయల్స్, కొల్ కత్త నైట్ రైడర్స్ ఇతన్ని తర్వాత ఐపీఎల్ వేలంలో కొనుగోలు చేశారు. తన కెరీర్ లో 23 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడిన అనురీత్ 18 వికెట్లు తీసుకున్నాడు. 3/23 కెరీర్ బెస్ట్ బౌలింగ్ నమోదు చేశాడు. 72 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో249 వికెట్లు తీశాడు. లిస్ట్-ఏ క్రికెట్ లో 56 మ్యాచ్ ల్లో 85 వికెట్లను నేలకూల్చాడు. ఇక బ్యాటింగ్ లో 72 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో 1209 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అటు జాతీయ జట్టు నుంచి పిలుపు రాకపోవడం, వయసు మీద పడుతుండటంతో అనురీత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.