టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా సెమీస్ లో ఇంటిదారి పట్టింది. ఈ టోర్నీలో చిన్నజట్లపై కూడా చెమటోడ్చి నెగ్గుకొచ్చారు. సెమీస్ లో ఇంగ్లాండ్ పై దారుణంగా పరాజయం పాలైయ్యారు. దాంతో టీమిండియాపై, సెలక్షన్ జట్టుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జట్టులో సమూలమైన మార్పులు తేవాలని మాజీ క్రికెటర్లు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లే జట్టు కూర్పుపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీమిండియాకు రెండు జట్లు ఉండాలని సూచించాడు. వైట్ బాల్ ఫార్మాట్ కు, రెడ్ బాల్ ఫార్మాట్ కు వేరు వేరు జట్లు ఉండాలని పేర్కొన్నాడు.
టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో పరాజయం తర్వాత టీమిండియా సెలక్షన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కంటిన్యూస్ గా పరుగులు చేయడంలో విఫలం అవుతున్న బ్యాట్స్ మెన్ లను ఎందుకు తీసుకుంటున్నారన్న ప్రశ్నలు.. సెలక్షన్ కమిటీని, BCCI ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే జట్టు కూర్పుపై స్పందించాడు. ప్రముఖ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ..”ప్రస్తుతం టీమిండియాకు రెండు టీమ్ లు కావాలి. వైట్ బాల్ గేమ్ కు ఒక టీమ్. రెడ్ బాల్ టీమ్ కు మరో టీమ్ ఉండాలి. అదీ కాక టీమిండియాకు ఇంకా టీ20 స్పెషలిస్టులు కావాలి. అయితే ఇక్కడ గమనించాల్సిన మరో అంశం ఏంటంటే? భారత జట్టులో ఆల్ రౌండర్ల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. దాన్ని టీమిండియా అధిగమించాలి” అని కుంబ్లే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
గత టీ20 ప్రపంచ కప్ లో అటు ఆసిస్ జట్టుకు, ఈ టీ20 ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్ జట్టుకు ఉపయోగపడింది ఆల్ రౌండర్లే నని కుంబ్లే గుర్తు చేశాడు. లివింగ్ స్టోన్, స్టోయినిస్, బెన్ స్టోక్స్ లాంటి ఆల్ రౌండర్లు జట్టుకు ఎంత అవసరమో వారు నిరూపించారని కుంబ్లే పేర్కొన్నాడు. టీమిండియాలో హార్దిల్ పాండ్యా, రవీంద్ర జడేజా తప్ప మరే ఇతర ఆటగాళ్లు సంపూర్ణ ఆల్ రౌండర్లు గా రాణించడం లేదన్నాడు. అయితే జట్టుకు ఫార్మాట్ ను బట్టి కెప్టెన్, కోచ్ లు ఉంటే పరిస్థితులు మారతాయని నేనైతే అనుకోను అంటూ కుంబ్లే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇప్పటికైన సెలక్షన్ కమిటీ ఆల్ రౌండర్ల ఎంపికపై దృష్టి పెడితే బాగుంటుందని అనిల్ కుంబ్లే చెప్పుకొచ్చాడు.