భారీ షాట్లకు పెట్టింది పేరైన రస్సెల్.. మేజర్ లీగ్ క్రికెట్‌లో కొట్టిన సిక్సర్‌కు గ్యాలరీలో ఉన్న కుర్రాడి తలకు దెబ్బ తగిలింది. మ్యాచ్ అనంతరం బుడ్డోడిని దగ్గరకు తీసుకున్న రస్సెల్.. ఆటోగ్రాఫ్ ఇచ్చి దిల్‌ఖుష్ చేశాడు.
విండీస్ విధ్వంసక వీరుడు ఆండ్రూ రస్సెల్.. గొప్ప మనసు చాటుకున్నాడు. మేజర్ లీగ్ క్రికెట్‌లో భాగంగా రస్సెల్ కొట్టిన భారీ షాట్ స్టాండ్స్‌లో ఉన్న ఓ బుడతడికి తగిలింది. దీంతో మ్యాచ్ అనంతరం ఆ బుడ్డోడిని దగ్గరకు తీసుకున్న రస్సెల్ దెబ్బ ఎక్కడ తగిలిందో గమనించి.. ప్రేమగా మాట్లాడాడు. ఈ క్రమంలో ఆ చిన్ని ఫ్యాన్ తలపై ముద్దుపెట్టిన రస్సెల్.. అతడికి ఆటోగ్రాఫ్ ఇవ్వడంతో పాటు.. ఫొటో దిగి అభిమానిని ఆనందంలో ముంచెత్తాడు. భారీ షాట్లకు పెట్టింది పేరైన ఈ డేంజర్ మ్యాన్.. కుర్రాడిని ప్రేమగా పలకరిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై పలువురు తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. రస్సెల్ చేసిన పని అందరికీ ఆదర్శవంతమైందని ఒకరు కామెంట్ చేస్తే.. ఆ బుడ్డోడి పంట పండిందని మరొకరు అభిప్రాయపడుతున్నారు.
విశ్వ వ్యాప్తంగా క్రికెటర్లకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తమ అభిమాన ఆటగాడిని చూసేందుకు ఎంతకైనా తెగించిన సందర్భాలు గతంలో అనేకం. టీమ్‌ఇండియా మ్యాచ్‌లు ఆడుతున్న స్టేడియంలో బందోబస్తు నిర్వహించడం కత్తిమీద సాము వంటిదే అని గతంలో ఎంతో మంది భద్రతా సిబ్బంది వెల్లడించారు. తమ హీరోలను దగ్గర నుంచి చూడాలని వాళ్లను తాకాలని తాపత్రపయపడే అభిమానులకు కొదవేలేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహేంద్రసింగ్ ధోనీ స్టేడియంలో ఆడుతున్నారంటే.. వారి వీరాభిమానులను నియంత్రించేందుకు ప్రత్యేక ఫోర్స్ మైదానం చూట్టు మొహరించడం మామూలే. మరి అలాంటిది తన అభిమాన ఆటగాడే దగ్గరకు పిలిచి ఆటోగ్రాఫ్, ఫొటో గ్రాఫ్ ఇస్తే ఇక ఆ కుర్రాడి ఆనందానికి అవధులు ఏం ఉంటాయి. అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్‌లో చోటు చేసుకుంది.
లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్, వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్ల మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో వాషింగ్టన జట్టను విజయం వరించింది. సునీల్ నరైన్ సారథ్యంలోని లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 175 రన్స్ చేసింది. సహచరులంతా విఫలమైన చోట రస్సెల్ 37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో అజేయంగా 70 పరుగులు సాధించాడు. రస్సెల్ రాణించడంతో పోరాడే స్కోరుచేయగలిగిన లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్.. ఆ తర్వాత బౌలింగ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో వాషింగ్టన్ టీమ్ 18.1 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 177 రన్స్ చేసి విజయం సాధించింది. మ్యాచ్ ఓడినా.. బౌండ్రీలతో మైదానాన్ని మోతెక్కించిన రస్సెల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
Dre Russ made sure to check on the kid who took a blow to his head from one of his sixes in Morrisville 💜
We’re glad the impact wasn’t too bad, and the li’l champ left with a smile and some mementos for a lifetime.#LAKR #LosAngeles #WeAreLAKR #MLC23 #AndreRussell @Russell12A… pic.twitter.com/EtLO5z2avx
— Los Angeles Knight Riders (@LA_KnightRiders) July 22, 2023