టీమిండియా వెటరన్ క్రికెటర్ అంబటి రాయుడు బీఆర్‌ఎస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారం వెనకున్న నిజం ఎంత? అసలు ఈ ప్రచారం జరగడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి, 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా టీఆర్‌ఎస్(తెలంగాణ రాష్ట్ర సమితి) నిలిచింది. అదే సింపథీతో 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మొట్టమొదటి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. తాము ఉద్యమ పార్టీ నుంచి నిఖార్సయిన రాజకీయ పార్టీగా మారుతున్నట్లు ఆ పార్టీ అధినేత కే చంద్రశేఖర్ రావు ప్రకటించారు. చెప్పినట్లుగానే ప్రత్యేక రాష్ట్రాని నాలుగేళ్ల పాటు పాలించి.. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి రెండో పర్యాయం కూడా అధికారం చేపట్టింది. అయితే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాలను హక్కులను కాలరాస్తోందని ఆరోపిస్తూ.. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాదు.. దేశమంతా తెలంగాణ మోడల్ పాలన అందిస్తామంటూ.. తెలంగాణ రాష్ట్ర సమితిని, భారత్ రాష్ట్ర సమితిగా మార్చి దేశ రాజకీయాల్లోకి ఎంటరయ్యారు కేసీఆర్.
ఇప్పటికే అధికారికంగా టీఆర్‌ఎస్ పార్టీ బీఆర్‌ఎస్‌గా మారింది. మొదట తెలంగాణలోనే భారీ సభ పెట్టిన కేసీఆర్.. ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులతో పాటు పలురాష్ట్రాల ముఖ్యనేతలను తెలంగాణకు ఆహ్వానించారు. దేశ రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు కారణాలను, అలాగే కేంద్రంలో అధికారంలోకి వస్తే చేసే పనులను, ప్రస్తుతం దేశంలో నడుస్తున పాలనపై కేసీఆర్ తన మార్క్ ప్రసంగాన్ని చేశారు. అలాగే ఇతర రాష్ట్రాల్లోనూ పార్టీ కార్యక్రమాలను విస్తరించే పనిలో కేసీఆర్ నిమగ్నమై ఉన్నారు. ఈ క్రమంలో టీమిండియా వెటరన్ క్రికెటర్ అంబటి రాయుడు బీఆర్‌ఎస్‌లో చేరబోతున్నారంటూ.. ప్రచారం సాగుతోంది. అయితే.. ఇప్పటి వరకు క్రికెట్ తప్ప మరే విషయంలోనూ కనిపించని, వినిపించని అంబటి రాయుడు పేరు సడెన్‌గా బీఆర్‌ఎస్‌లో చేరబోతున్నట్లు ప్రచారం జరగడానికి ఒక కారణం ఉంది.
ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా సీఎం కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ మూడో సీజన్ ని సిద్ధిపేట్ లో స్టార్ట్ చేశారు. గురువారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమానికి హీరో నానితో పాటు అంబటి రాయుడు కూడా హాజరై.. తాను కేసీఆర్‌కు పెద్ద ఫ్యాన్ అని ప్రకటించాడు. దీంతో రాయుడు బీఆర్‌ఎస్‌లో చేరబోతున్నారంటూ ప్రచారం మొదలైంది. అయితే ఈ ప్రచారం మరీ అంత తేలిగ్గా కొట్టివేసిది కూడా కాదు. ఎందుకంటే.. దేశ రాజకీయాల్లో బీఆర్‌ఎస్ పూర్తి స్థాయిలో విస్తరించాలన్నా.. విజయం సాధించాలన్న ముందు పార్టీకి ప్రజల్లో ప్రచారం ముఖ్యం. జనాల్లోకి పార్టీని తీసుకెళ్లాలంటే ఒక వెల్‌నోన్ ఫేస్ ఉంటే చాలా సులువు అవుతుంది. ఆ పని ఒక్క కేసీఆర్‌తోనే సాధ్యం కాకపోవచ్చు. అందుకే అంబటి రాయుడిని బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు.
టీమిండియా క్రికెటర్‌గా అంబటి రాయుడు దేశవ్యాప్తంగా సుపరిచితుడైన వ్యక్తి. అలాంటి వ్యక్తి బీఆర్‌ఎస్‌లో చేరి.. ఇతర రాష్ట్రాలకు వెళ్లి ప్రచారం చేస్తే కచ్చితంగా పార్టీకి మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా యువకుల్లో పార్టీని బలంగా తీసుకెళ్లవచ్చు. ఇదే ఆలోచనతో అంబటి రాయుడుని బీఆర్‌ఎస్‌లో చేర్చుకునేందుకు ఆ పార్టీ పెద్దలు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. మరో వైపు అంబటి రాయుడు సైతం క్రికెట్‌లో చూడాల్సిన హైట్స్ ను చూసేశాడు. ఇక క్రికెట్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ గా రాజకీయాల్లోకి వెళ్లాలనే ఉద్దేశం రాయుడికి కూడా ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెప్పుకుంటున్నారు. రాజకీయంగా సరైన ప్లాట్‌ఫామ్ కోసం రాయుడు ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. రాయుడు బీఆర్‌ఎస్‌లో చేరడం ద్వారా తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారడంతో పాటు.. జాతీయ స్థాయిలో బీఆర్‌ఎస్ పార్టీకి ముఖచిత్రంగా మారొచ్చు. ఒక వేళ అంబటి రాయుడు బీఆర్‌ఎస్‌లో చేరితే.. అటు అంబటికి అలాగే బీఆర్‌ఎస్‌కు సమపాళ్లలో ప్రయోజనం ఉంటుంది. ఇదంతా అవుతుందా? అవ్వదా అనే విషయం పక్కనపెడితే.. ఒక వేళ జరిగితే మాత్రం మంచి ఫలితం ఉండొచ్చు.