గత కొంతకాలంగా టీమిండియా జట్టుకు దూరంగా ఉన్న అజింక్య రహానే రంజీ ట్రోఫీలో దుమ్మురేపుతున్నాడు. ఈ సీజన్ తొలి మ్యాచ్ లోనే హైదరాబాద్ బౌలర్లకు చుక్కలు చూపించి, డబుల్ సెంచరీతో దుమ్మురేపాడు. దాంతో ముంబై జట్టు భారీ విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం టెస్టుల్లో తనతోపాటుగా విరాట్ కోహ్లీ, పుజరాల బ్యాటింగ్ యావరేజ్ తగ్గటానికి కారణాలను వెల్లడించాడు రహానే. గత 3 సంవత్సరాలుగా మా ముగ్గురి బ్యాటింగ్ యావరేజ్ దీని కారణంగానే తగ్గింది అంటూ బాంబ్ పేల్చాడు రహానే. మరిన్ని వివరాల్లోకి వెళితే..
టీ20లు ఎప్పుడైతే క్రికెట్ ప్రపంచంలోకి ఎంటర్ అయ్యాయో.. అప్పటి నుంచి సాంప్రదాయ క్రికెట్ అయిన టెస్ట్ క్రికెట్ కు కష్టాలు మెుదలైయ్యాయి. ప్రేక్షకులు సైతం టెస్ట్ లను చూడటానికి ఆసక్తి చూపించడం లేదు. ఈ నేపథ్యంలోనే విరాట్ కోహ్లీ, పుజరాలతోపాటుగా తన టెస్ట్ బ్యాటింగ్ యావరేజ్ తగ్గటానికి కారణాలను వెల్లడించాడు అజింక్య రహానే. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ముంబై తరపున ఆడుతున్న రహానే.. తొలి మ్యాచ్ లోనే డబుల్ సెంచరీ చేసి జట్టుకు భారీ విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ లో 261 బంతులు ఎదుర్కొన్న రహానే 26 ఫోర్లు, 3సిక్స్ లతో 204 పరుగులు చేశాడు. ఇతడి స్ట్రైక్ రేట్ 78.16 ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే తమ ముగ్గురి టెస్ట్ బ్యాటింగ్ యావరేజ్ తగ్గటం గురించి మాట్లాడుతూ..
“మీరు గమనిస్తున్నారో.. లేదో.. గత రెండు, మూడు సంవత్సరాలుగా విరాట్ కోహ్లీ, పుజరాలతో పాటుగా నాది కూడా టెస్టుల్లో బ్యాటింగ్ యావరేజ్ తగ్గింది. దానికి ప్రధాన కారణం భారతీయ పిచ్ లే. అవును ఇండియాలో ప్రస్తుతం ఉన్న పిచ్ ల కారణంగానే మా యావరేజ్ లు తగ్గిపోయాయి. టీమిండియాలో ఉన్న పిచ్ లు ఓపెనర్లకు కొద్దిగా అనుకూలిస్తాయి. ఇక వారు అవుట్ అయిన తర్వాత 3,4,5 స్థానాల్లో వచ్చే పుజరా, విరాట్, నా పరిస్థితుల వేరుగా ఉంటాయి. అప్పటికే పిచ్ మారిపోయి ఉంటుంది. దాంతో మేం ఇబ్బందులకు గురికాక తప్పదు” అంటూ ఇండియన్ పిచ్ లపై విమర్శలు చేశాడు రహానే. ఇక 2020-21లో పుజరా టెస్ట్ యావరేజ్ 47.74 గా ఉంటే ప్రస్తుతానికి అది 31.17కు పడిపోయింది. ఇక కోహ్లీ యావరేజ్ 53.41 నుంచి 28.74 కు దారుణంగా పడిపోయింది. ఇక రహానే విషయానికి వస్తే.. 42.58 నుంచి 20కి తగ్గింది. ఇలా టెస్ట్ ల్లో బ్యాటింగ్ యావరేజ్ తగ్గడానికి భారత పిచ్ లే ప్రధాన కారణం అని రహానే ఆరోపించాడు.
Former Indian Test vice-captain Ajinkya Rahane blamed Indian pitches for the dip in his batting average in the last couple of years.#CricTracker #AjinkyaRahane #TestCricket pic.twitter.com/HacjcgTKzN
— CricTracker (@Cricketracker) December 22, 2022