భారత్-సౌతాఫ్రికా మధ్య బుధవారం జరిగిన తొలి టీ20లో పిచ్ బౌలర్లకు అనుకూలించింది. టాస్ గెలవడంతో మారుమాట్లాడకుండా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకన్నాడు. కెప్టెన్ పెట్టుకున్న నమ్మకాన్ని వందకు వందశాతం నిజం చేస్తూ.. టీమిండియా పేసర్లు రెచ్చిపోయారు. సౌతాఫ్రికా టాపార్డర్‌ను అతలాకుతలం చేసి పడేశారు. తొలి ఓవర్‌లో ఒక వికెట్, రెండో ఓవర్‌లో ఏకంగా 3, మూడో ఓవర్‌లో ఇంకో వికెట్ తీసి.. కేవలం 9 పరుగులకే సగం మంది సౌతాఫ్రికా టాప్‌క్లాస్ బ్యాటర్లను పెవిలియన్ చేర్చారు. అసలు ఏం జరుగుతుందో కూడా సౌతాఫ్రికా బ్యాటర్లకు అర్థం కాలేదు. తొలి ఓవర్‌లో దీపక్ చాహర్ ప్రొటీస్ కెప్టెన్ టెంబా బావుమాను బౌల్డ్ చేయగా.. రెండో ఓవర్ వేసిన అర్షదీప్ సింగ్ అద్భుతమైన ఇన్ అండ్ అవుట్ స్వింగర్లతో క్వింటన్ డికాక్, రోసోవ్, డేవిడ్ మిల్లర్‌లను ఒకే ఓవర్‌లో అవుట్ చేసి సంచలన బౌలింగ్ వేశాడు. ఆ మరోసటి ఓవర్‌లో దీపక్ చాహర్ ట్రిస్టన్ స్టబ్స్‌ను అవుట్ చేయడంతో సౌతాఫ్రికా 9 పరుగుల వద్ద 5వ వికెట్ కోల్పోయి దారుణ పరిస్థితితుల్లో పడిపోయింది.
ఇక ఇక్కడి నుంచి మరెంతో సేపు సౌతాఫ్రికా ఇన్నింగ్స్ సాగదని ప్రతి క్రికెట్ అభిమాని అనుకున్నాడు. ఎందుకంటే పిచ్ అంతలా బౌలర్లకు సహకరిస్తుంది. అర్షదీప్, దీపక్ చాహర్ నిప్పులు చెరుగుతున్నారు. మరో పేసర్ హర్షల్‌పటేల్ కూడా ఉన్నాడు. దీంతో సౌతాఫ్రికా కనీసం 50 పరుగులు కూడా దాటదని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ.. సౌతాఫ్రికా సీనియర్ ప్లేయర్ మార్కరమ్(25), ఆల్‌రౌండర్ పార్నెల్(24), స్పిన్నర్ కేశవ్ మహరాజ్(41) పరుగులు చేసి సౌతాఫ్రికాకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. ఇక్కడ ఈ ముగ్గురి పోరాటాన్ని ప్రశంసించడంతో పాటు.. టీమిండియా బౌలర్ల వైఫల్యంపై కూడా ఒక లుక్ వేయాల్సిన అవసరం ఉంది. 3 ఓవర్లలో 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా ఆలౌట్ కాకుండా 106 పరుగులు చేయగలిగింది అంటే అది కచ్చితంగా భారత్ బౌలర్ల వైఫల్యాన్ని సూచిస్తుంది. పైగా బౌలింగ్‌కు పూర్తిగా అనుకూలిస్తున్న పిచ్‌పై సౌతాఫ్రికాను ఆలౌట్ చేయలేకపోవడంపై టీమిండియా బౌలర్లపై విమర్శలు వస్తున్నాయి.
టీ20 వరల్డ్ కప్ 2022కు ముందు ఈ మ్యాచ్‌లో ఆరంభంలోనే మన బౌలర్లు చేసిన ప్రదర్శన అద్భుతంగా ఉన్నా.. అది పిచ్ పరిస్థితుల వల్లే సాధ్యమైంది. బంతి ఊహించని విధంగా స్వింగ్ అయింది. కానీ.. బంతి కొంత పాతబడ్డ తర్వాత పిచ్‌ను అంతగా సహకారం లభించకపోవడంతో భారత బౌలర్లు తేలిపోయారనే చెప్పాలి. ప్రధాన బ్యాటర్లంతా పెవిలియన్ చేరిన తర్వాత కూడా సౌతాఫ్రికాను ఆలౌట్ చేయలేకపోయారు. ఇప్పటి వరకు టీ20ల్లో కేవలం 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ అత్యధికంగా ఉన్న స్పిన్నర్ కేశవ్ మహరాజ్ సైతం మన బౌలర్లను ధాటిగా ఎదుర్కొని 41 పరుగులు సాధించాడు. మార్కరమ్ ఎక్రాస్‌ది షాట్ ఆడి దురదృష్టవశాత్తు ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. లేకుంటే సౌతాఫ్రికా మరింత మంచి స్కోర్‌ను టీమిండియా ముందు ఉంచగలిగేది.
కేవలం 3 ఓవర్లలోనే 5 వికెట్లు దక్కినా టీమిండియా బౌలర్లు ప్రత్యర్థిని ఆలౌట్ చేయలేకపోవడం నిజంగా ఆలోచించాల్సిన విషయమే. మ్యాచ్‌లో ఒక్కసారి పట్టు దొరికితే దాన్ని మరింత బిగించాలి కానీ.. జార విడువ కూడదు. ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు అదే తప్పు చేశారు. సూర్యకుమార్ యాదవ్ ఎటాకింగ్ బ్యాటింగ్‌తో టీమిండియా ఈ మ్యాచ్ గెలిచింది. కానీ.. అతను ఆడకపోయి ఉంటే పరిస్థితి కచ్చితంగా మరోలా ఉండేది. లేదా సౌతాఫ్రికా మరో 30, 40 పరుగులు చేసి ఉన్నా.. విజయం కచ్చితంగా కష్టమయ్యేది. ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు అద్భుతం చేశారనే కంటే పిచ్ అనుకూలించింది అనడమే ఉత్తమం.
5 wickets summed up in 11 seconds. Watch it here 👇👇
Don’t miss the LIVE coverage of the #INDvSA match on @StarSportsIndia pic.twitter.com/jYeogZoqfD— BCCI (@BCCI) September 28, 2022
ఇది కూడా చదవండి: పాక్ ప్లేయర్ రిజ్వాన్ వరల్డ్ రికార్డును బద్దలుకొట్టిన సూర్యకుమార్ యాదవ్!