దేశంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ శాంతీలాల్ అదానీకి చాలా వ్యాపారాలు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఐపీఎల్‌పై కూడా దృష్టి పెట్టి, ఒక ఫ్రాంచైజ్‌ను సొంతం చేసుకోనున్నట్లు సమాచారం. 2022లో జరగబోయే ఐపీఎల్ సీజన్‌లో మరో రెండు కొత్త జట్లు ఎంట్రీ ఇవ్వబోతోన్నాయి. వచ్చే సీజన్ నుంచి మొత్తం పది జట్లు ఐపీఎల్ టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. అక్టోబర్ 25న బీసీసీఐ రెండు కొత్త ఐపీఎల్ జట్ల వివరాలను వెల్లడించనుంది. ఫ్రాంచైజీలు, టీమ్ మేనేజ్‌మెంట్ డీటెయిల్స్‌ను ప్రకటిస్తుంది.
ఈ విషయాన్ని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ధృవీకరించింది. ఐపీఎల్‌లో ఇండక్ట్ అయ్యే రెండు కొత్త జట్ల వివరాలను వెల్లడించిన వెంటనే.. 2023-2027 మధ్యకాలానికి సంబంధించిన ఐపీఎల్ మీడియా హక్కుల టెండర్లను కూడా విడుదల చేస్తామని స్పష్టం చేసింది. కొత్త ఐపీఎల్ జట్ల కోసం ప్రతిపాదించిన ఇన్విటేషన్ టు టెండర్ గడువు అక్టోబర్ 10వ తేదీన ముగుస్తుంది. నిజానికి- 5వ తేదీ నాడే ఈ టెండర్ల గడువు ముగియాల్సి ఉన్నప్పటికీ.. దాన్ని ఇంకో అయిదు రోజుల పాటు పొడిగించింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జైషా ఇదివరకే నిర్ధారించారు. ఐపీఎల్ ఫ్రాంఛైజీల కోసం ఆగస్టు 31వ తేదీన ఇన్విటేషన్ టు టెండర్ డాక్యుమెంట్లను బీసీసీఐ ప్రకటించింది.
ఈ టెండర్లను దాఖలు చేయడానికి అక్టోబర్ 5వ తేదీని చివరి గడువుగా నిర్ధారించింది. దీన్ని 10వ తేదీ వరకు పొడిగించినట్లు జైషా తెలిపారు. ఒక్కో ఫ్రాంచైజ్‌ని కొనుగోలు చేయడానికి బీసీసీఐ 2000 కోట్ల రూపాయలను బేస్ ప్రైస్‌గా నిర్ధారించినట్లు తెలుస్తుంది. ఈ ఇన్విటేషన్ టు టెండర్‌ను దాఖలు చేయాలంటే ఫ్రాంఛైజీలు 10 లక్షల రూపాయల మొత్తాన్ని నాన్ రీఫండబుల్ పేమెంట్‌గా బీసీసీఐకి చెల్లించాల్సి ఉంటుంది. కొత్త ఫ్రాంచైజ్ కోసం ఇంకా రెండు వారాల పాటు గడవు ఉన్నందున మరిన్ని టెండర్లు దాఖలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్రాంచైజ్ కొనుగోలు చేయదలిచిన కంపెనీ వార్షిక టర్నోవర్ కనీసం 3,500 కోట్ల రూపాయల వరకు ఉండాలి. 2,500 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను కలిగి ఉండాలనే నిబంధనలను బీసీసీఐ విధించింది.
కొత్త ఫ్రాంచైజ్ కోసం అహ్మదాబాద్, లక్నో, ఇండోర్, కటక్, గువాహతి, ధర్మశాలను షార్ట్ లిస్ట్ చేసింది బీసీసీఐ. కొత్త ఫ్రాంఛైజీల కోసం డజనుకు పైగా కంపెనీలు ఇన్విటేషన్ టు టెండర్ డాక్యుమెంట్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆర్పీ-సంజీవ్ గోయెంకా (ఆర్పీఎస్జీ) గ్రూప్, అరబిందో ఫార్మాసూటికల్, టోర్రెంట్ ఫార్మాసూటికల్స్, బ్రాడ్‌క్యాస్ట్ అండ్ స్పోర్ట్స్ కన్సల్టింగ్ ఏజెన్సీస్ ఐటీడబ్ల్యూ, గ్రూప్ ఎం, సింగపూర్‌కు చెందిన ఈక్విటీ కంపెనీ ఇందులో ఉన్నట్లు తెలిపింది. గుజరాత్‌కు చెందిన పారిశ్రామిక దిగ్గజం అదాని గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదాని కూడా ఈ రేసులో ఉన్నారు. ఆయన ఇంకా టెండర్ డాక్యుమెంట్లను తీసుకోలేదని, అక్టోబర్ 10వ తేదీ వరకు గడువు ఉన్నందున.. ఆ లోగా వాటిని కొంటారని తెలుస్తుంది.