ఐపీఎల్ 2022లో రెండు కొత్త జట్లు ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న 8 జట్లతో పాటు లక్నో, అహ్మాదాబాద్ జట్లు బరిలోకి దిగనున్నాయి. మొత్తం పది జట్లు పోటీ పడే మెగా టోర్నీని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్న ఫ్యాన్స్‌కు ఒక బ్యాడ్ న్యూస్. అహ్మాదాబాద్ ఫ్రాంచైజ్‌పై బెట్టింగ్ ఆరోపణలు రావడమే దీనికి కారణం. ఈ ఆరోపణలు చేస్తూ వచ్చిన ఫిర్యాదును బీసీసీఐ కమిటీ స్వీకరించి విచారణ కోసం కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. విచారణలో అహ్మాదాబాద్ ఫ్రాంచైజ్‌పై వచ్చిన ఆరోపణలు నిజమైతే ఐపీఎల్ నుంచి తప్పించడం ఖాయం.
ఇంతకీ ఈ జట్టుపై బెట్టింగ్ ఆరోపణలు చేస్తుంది ఎవరో కాదు.. ఐపీఎల్ టీమ్ కోసం ప్రయత్నించి విఫలమైన వ్యాపార దిగ్గజం అదానీ. ఐపీఎల్‌లో కొత్త జట్ల కోసం జరిగిన టెండర్‌లో అదానీ గ్రూప్‌తో పాటు సీవీసీ కేపిటల్స్ కూడా బిడ్ దాఖలు చేసింది. బీసీసీఐ నిర్ణయించిన బెస్ ప్రైజ్ రూ.2000 కోట్ల కంటే 160 శాతం అధికంగా బిడ్ వేసిన సీవీసీ కేపిటల్స్ అహ్మాదాబాద్ ఫ్రాంచైజ్‌ను దక్కించుకుంది. కాగా అదానీ గ్రూప్ రూ.5100 కోట్ల బిడ్ దాఖలు చేసినా కూడా ఫ్రాంచైజ్ దక్కలేదు. అదానీ గ్రూప్ కంటే సీవీసీ కేపిటల్స్ రూ.525 కోట్లు అధికంగా బిడ్ వేసింది. ఐపీఎల్ ఫ్రాంచైజీ దక్కకపోవడాన్ని అవమానంగా భావిస్తున్న అదానీ గ్రూప్.. సీవీసీ సంస్థపై బెట్టింగ్ ఆరోపణలు చేస్తుంది.
సీవీసీ సంస్థకు గతంలో బెట్టింగ్‌ల ద్వారా అక్రమ ఆర్జన ఉందని, ఆ డబ్బునే తీసుకొచ్చి ఐపీఎల్ ఫ్రాంచైజ్ కొనుగోలు చేసినట్లు ఆరోపణలు చేస్తుంది. సీవీసీని టార్గెట్ చేస్తూ బీసీసీఐకి అదానీ గ్రూప్ ఫిర్యాదు కూడా చేసినట్లు సమాచారం. ఈ ఫిర్యాదులను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ పరిగణనలోకి తీసుకుంది. దీనిపై చర్చించడానికి శుక్రవారం సమావేశం కానుంది. బీసీసీఐ కార్యదర్శి జయ్ షా, అరుణ్ ధుమాల్, బ్రిజేష్ పటేల్, ప్రజ్ఞాన్ ఓఝా, తదితరులు ఇందులో పాల్గొననున్నారు. ఈ ఆరోపణలపై ఇండిపెండెంట్ కమిటీతో విచారణ జరిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనితోపాటు ఐపీఎల్ మీడియా హక్కులు, ఇతర అంశాలపై ఇందులో చర్చించనున్నారు. ఈ ఆరోపణలు నిజమని తేలితే అహ్మాదాబాద్ ఫ్రాంచైజ్ ఓనర్ మారే అవకాశం ఉంది.