ఓ సినిమా తీయాలంటే కోట్లకు కోట్లు ఖర్చు పెట్టాలి. హీరోతో పాటు ఆయన టీమ్, హీరోయిన్ తో పాటు ఆమె టీమ్ ఖర్చులు. హీరోహీరోయిన్ల కోసం స్పెషల్ క్యార్ వాన్లు, వాళ్లు అడిగింది ప్రతిదీ కూడా తీసుకొచ్చి ఇవ్వాలి. అబ్బో ఇలా చాలా ఉంటాయి. ఇవన్నీ చూసుకుంటే ప్రొడ్యూసర్ కి తడిసిమోపెడవుతుంది. ఇదంతా ఇప్పుడు.. కానీ ఒకప్పుడు మాత్రం హీరోలంటే నిర్మాతని చాలా బాగా చూసుకునేవారు. అలాంటి వారిలో కృష్ణంరాజు ఒకరు. ఆదివారం ఆయన మరణించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘చిలకా గోరింక’ సినిమాతో హీరోగా కెరీర్ మొదలుపెట్టిన కృష్ణంరాజు, ఆ తర్వాత హీరోగానే కాకుండా విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ పేరు సంపాదించారు. అలా 180కి పైగా సినిమాలు చేశారు. ఇన్నేళ్లపాటు ఇన్ని సినిమాలు చేసిన కృష్ణంరాజుకి ఓ మంచి లక్షణం ఉండేది. రెమ్యునరేషన్ ఇంతా అని అనుకున్న తర్వాత.. చివర్లో పెంచడం గానీ, పారితోషికం గురించి నిర్మాతల్ని వేధించడం గానీ ఉండేది కాదు. షూటింగ్ సమయంలో తన ఖర్చులన్నీ తానే భరించేవారు. సెట్ కి తన సొంత కారులోనే వెళ్లేవారు. అక్కడ ఏం తిన్నాసరే తన అకౌంట్ లోనే.
ఇలా ఆయన అనుకోవడానికి ఓ పెద్ద కారణమే ఉంది. ఓ సినిమా షూటింగ్ సమయంలో కృష్ణంరాజుకి బత్తాయిరసం తాగాలనిపించింది. బాయ్ ని పిలిచి అడిగితే లేదనే సమాధానమొచ్చింది. ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి.. ‘మా సెట్ లో మేం ఇచ్చిందే తాగాలి’ అన్నట్లు మాట్లాడాడు. ‘అయితే నేను బయటకెళ్లి బత్తాయి జ్యూస్ తాగేసి వస్తా’ అని కృష్ణంరాజు లేచారు. విషయం తెలిసి నిర్మాత, ఆయన్ని కూర్చొబెట్టి బత్తాయి రసం తెప్పించారు. అది తాగిన తర్వాత.. ‘ఈరోజు నుంచి సెట్లో నేను ఏదడిగితే అది ఇవ్వాల్సిందే. కానీ ఆ ఖర్చు అణాపైసలతో సహా నా ఖాతాలోనే వేయండి’ అని అన్నారట. అప్పటి నుంచి ఆయన చేసిన అన్ని సినిమాల విషయంలోనూ ఇదే పాటించారట. ఈ విషయంలో కృష్ణంరాజు మంచితనంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: అందరికి మంచి భోజనం పెట్టే కృష్ణంరాజుకి ఆ కూరంటే చాలా ఇష్టం!