2023 ఐపీఎల్లో 14 మ్యాచ్‌లాడిన సన్‌రైజర్స్ ఈ ఏడాది చాలా పేలవమైన ప్రదర్శన ఇచ్చిందని విమర్శలు తలెత్తాయి. దీంతో ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది యాజమాన్యం.
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా.. అంతా అయిపోయాక సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం మేలుకున్నట్లు కనిపిస్తోంది. జట్టు పేలవ ప్రదర్శన కారణంగా హెడ్ కోచ్ బ్రియాన్ లారాపై వేటు వేసినట్లు వార్తలు వస్తున్నాయి.
2023 ఐపీఎల్లో 14 మ్యాచ్‌లాడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 4 మ్యాచ్‌ల్లో నెగ్గి.. పదింట ఓడి 8 పాయింట్లతో పట్టిక అట్టడుగున (పదో స్థానంలో) నిలిచింది. 2022 సీజన్‌లో ఆరు విజయాలతో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. గత సీజన్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయి 9వ స్థానంలో నిలిచిన మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఈ సారి అదిరిపోయే ఆటతో ఐదోసారి ఐపీఎల్ టైటిల్ నెగ్గిన విషయం తెలిసిందే. తొటి జట్లన్ని ఎప్పటికప్పుడు ఆట మెరుగు పర్చుకుంటూ.. ముందుకు సాగుతుంటే.. సన్‌రైజర్స్ మాత్రం అందుకు భిన్నంగా నానాటికీ తీసికట్టులా మారుతోంది. ఐపీఎల్ 16వ సీజన్ కోసం దాదాపు కొత్త జట్టును తీసుకున్న సన్‌రైజర్స్ ఆటగాళ్ల ఎంపిక నుంచే పప్పులో కాలేసిందనేది సుస్పష్టం. అయితే ఆలస్యంగానైనా సరే ఎస్‌ఆర్‌హెచ్ దిద్దుబాటు చర్యలకు పూనుకోవడం శుభపరిణామం.
డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ వంటి విజయవంతమైన సారథులను వదులుకొని భారీ మూల్యం చెల్లించుకున్న సన్‌రైజర్స్.. ఇక తెరవెనుక మార్పులు చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. గత కొన్ని సీజన్లుగా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న సన్‌రైజర్స్ వచ్చే ఏడాదైనా.. మెరుగైన ప్రదర్శన చేయాలంటే ఇప్పటి నుంచే ప్రక్షాళన చేయడం తప్పనిసరే. ఇందులో భాగంగా మొదట హెడ్ కోచ్ బ్రియాన్ లారాపై వేటు పడే అవకాశం కనిపిస్తోంది. ఐపీఎల్ 16వ సీజన్‌లో జట్టు పరాజయాలకు లారాదే బాధ్యత అని టీమ్ ఓనర్ కావ్య మారన్ భావిస్తున్నట్లు జట్టు వర్గాలు పేర్కొన్నాయి. స్వతహాగా టెస్టు ప్లేయర్ అయిన లారా.. ఎక్కువ సంప్రదాయ శైలి ఉన్న ఆటగాళ్లకే అవకాశాలు ఇస్తున్నాడనే అపవాదు కూడా సీజన్ ప్రారంభం నుంచే వినిపించింది. దీనికి తోడు జట్టు సమావేశాల్లో అతడి అతి జోక్యం వల్ల.. కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోలేకపోయాడని కావ్య మారన్ భావిస్తున్నది. టీమ్ సెలెక్షన్ విషయంలోనూ లారా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నట్లు గతంలోనే మార్క్‌రమ్ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న ఆరెంజ్ ఆర్మీ యాజమాన్యం.. లారాను హెడ్ కోచ్‌గా తప్పించాలని భావిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. గతంలో సన్‌రైజర్స్ బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా ఉన్న లారా.. టామ్ మూడీ తప్పుకోవడంతో కోచింగ్ బాధ్యతలు చేపట్టాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ కోసం జరిగిన మినీ వేలంలోనే ఆరెంజ్ ఆర్మీ తప్పుడు నిర్ణయాలతో పప్పులో కాలేసింది. పంజాబ్ జట్టు తమకు అక్కర్లేదని వదిలించుకున్న ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ను ఏరికోరి కొనుకున్న హైదరాబాద్.. అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా పేరు లేని ఇంగ్లిష్ బ్యాటర్ హ్యరీ బ్రూక్ కోసం కోట్లు కుమ్మురించింది. కేన్ విలియమ్సన్‌ను వదులుకున్న ఆరెంజ్ ఆర్మీ.. ఆ స్థాయి ప్లేయర్‌ను కొనుగోలు చేయలేకపోయింది. యువ ఆటగాళ్లపై నమ్మకముంచినా.. జట్టును ముందుండి నడిపించగల వార్నర్ వంటి స్టార్ ప్లేయర్‌తో కయ్యం పెట్టుకొని దూరం చేసుకుంది. ఇలాంటి పొరపాట్లతో మూల్యం చెల్లించుకున్న సన్‌రైజర్స్ వచ్చే ఏడాది వరకు పూర్తి ప్రక్షాళాన చేసి కొత్తగా బరిలోకి దిగాలని చూస్తోంది. మరి బ్రియాన్ లారాను సన్‌రైజర్స్ హెడ్ కోచ్ పదవి నుంచి తప్పించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.