క్రికెట్ ఆస్ట్రేలియా వన్డే, టీ20 జట్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ తండ్రయ్యాడు. బుధవారం అతని భార్య అమీ ఫించ్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను ఫించ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. తల్లిబిడ్డా క్షేమంగా ఉన్నట్లు, పాపకు ఎస్తేర్ కేట్ ఫించ్‌గా నామకరణం చేసినట్టు పేర్కొన్నాడు. కాగా మోకాలి గాయంతో వెస్టిండీస్ సిరీస్ నుంచి ఫించ్ తప్పుకున్న సంగతి తెలిసిందే. మోకాలికి చికిత్స చేయించుకున్న అతను.. అంతా సవ్యంగా జరిగితే అక్టోబర్ 17న ప్రారంభమయ్యే టీ20 వరల్డ్ కప్లో పాల్గొనే అవకాశం ఉంది.
‘‘ఎస్తేర్ కేట్ ఫించ్.. ఈ అందమైన ప్రపంచంలోకి నీకు స్వాగతం. మా చిన్నారి రాకుమారి నిన్న సాయంత్రం 4 గంటల 58 నిమిషాల సమయంలో జన్మించింది. తను 3.54 కిలోల బరువు ఉంది. అమీ, బేబీ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు’’ అని భార్యాబిడ్డలతో దిగిన ఫొటోలను ఆరోన్ ఫించ్ ఇన్‌స్టాలో షేర్ చేశాడు.