ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ఆరోన్ ఫించ్.. తాజాగా తన వన్డే ఫార్మట్ కు గుడ్ బై చెప్పిన విషయం మనకు తెలిసిందే. ” కొత్త సారథి రావాలని నేను ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. నా నిర్ణయం వచ్చే ప్రపంచ కప్ ఆసిస్ గెలవడానికి ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నాను” ఇవి ఆరోన్ ఫించ్ తన వన్డే రిటైర్మెంట్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు. అయితే గత కొన్ని రోజులుగా ఫించ్ ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన 2వ వన్డేలో డకౌట్ గా వెనుదిరిగాడు. దీంతో న్యూజిలాండ్ తో ఆదివారం జరిగే మ్యాచ్ తన కెరీర్ లో ఆఖరి మ్యాచ్ అని ప్రకటించాడు. అయితే అతడి రిటైర్మెంట్ పై సర్వత్రా ఆసక్తికర వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఫించ్ తనంతట తనే తప్పుకున్నాడా? లేక ఆసిస్ బోర్డు తప్పించిందా? అన్న సందేహాలు సాధారణ క్రికెట్ అభిమానుల్లో కలుగుతున్నాయి. మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఆరోన్ ఫించ్.. సమకాలీన క్రికెట్ లో విధ్వంసకర ఆటగాళ్లలో ఫించ్ ఒకడు.. అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అతడు జట్టులోకి రావడానికి ముందే నిషేధానికి గురయ్యాడు. 2007లో రూమ్ క్లీన్ గా ఉంచడం లేదని అతడిని అకాడమి నుంచి బ్యాన్ చేశారు. ఇక కెరీర్ మెుదట్లో మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ గా ప్రయాణం మెుదలు పెట్టిన ఫించ్.. రాను రాను మంచి హిట్టర్ గా పేరు గడించాడు. 2013లో ఇంగ్లాండ్ పై జరిగి టీ20లో తన విశ్వరూపాన్నే చూపాడు. కేవలం 63 బంతుల్లో 156 పరుగులు చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. అదీ కాక IPLలో తన దూకుడైన ఆటతో అందరి మదిని దోచాడు. ఈ క్రమంలోనే ఓపెనర్ డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ లపై బాల్ టాంపరింగ్ కారణంగా నిషేధం విధించడంతో 2018లో ఫించ్ ఆసిస్ వన్డే కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించాడు.
ఇక అప్పటి నుంచి ఆసిస్ జట్టుకు ఓ కొత్త శకం ప్రారంభం అయ్యిందనే చెప్పాలి. అతడు కెప్టెన్ గా పగ్గాలు అందుకున్న వెంటనే వరుసగా భారత్, పాకిస్థాన్ లపై సిరీస్ లను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. దీంతో ఉప ఖండపు పిచ్ లపై ఆసిస్ వారు ఆడలేరు అన్న అపవాదులను ఫించ్ తిరగరాశాడు. దాంతో వార్నర్, స్టీవ్ స్మిత్ లు తిరిగి జట్టులోకి వచ్చినాగానీ అతడే కెప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తించాడు. ఇక 2019 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో అతడు సాధించిన అర్దశతకం, స్టీవ్ స్మిత్ తో కలిసి ఏర్పరిచిన భాగస్వామ్యంతోనే భారత్ ఆ మ్యాచ్ లో పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా ఫామ్ లేమితో సతమతమవుతున్న ఫించ్ పై ఇంటా.. బయట విమర్శలు వస్తున్నాయి. దాంతోనే వన్డేలకు రిటైర్మెంట్ ప్రకంటించాడు.
అయితే ఫించ్ రిటైర్మెంట్ వెనుక ఆస్ట్రేలియా బోర్డు హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆసిస్ క్రికెట్ బోర్డుకు కావాల్సింది పరుగులు రాబట్టే ఆటగాళ్లు మాత్రమే.. రన్స్ చేయని, ఫామ్ లో లేని ఎంతటి ఆటగాళ్లనైనా బోర్డు నిర్దాక్ష్యాణ్యంగా తొలగిస్తుంది. దీనికి సంబంధించి గతంలోనే హేమా హేమీలైన గిల్ క్రిస్ట్, హెడెన్, మార్క్ వా, రికీ పాంటింగ్ లాంటి ఆటగాళ్లనే పక్కన పెట్టింది. క్రీడా ప్రపంచంలో ఆటగాడి క్రేజ్ ముఖ్యం కాదు.. అతడి ఫామ్.. అతడి ఆటను మాత్రమే పరిగణంలోకి తీసుకోవాలి అంటుంది ఆసిస్ క్రికెట్ బోర్డు. దానికి తగ్గట్లే మా నిర్ణయాలు ఉంటాయని నిక్కచ్చిగా.. నిర్మొహమాటంగా చాలా సార్లే చెప్పింది. దీంతో వరుసగా విఫలమవుతూ వస్తున్న ఫించ్ ఈ నిర్ణయం తీసుకున్నాడా? తీసుకునేలా ఇబ్బంది పెట్టారా? అంటూ చాలా మంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
గతంలో రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఆటగాళ్ల విషయంలో కూడా ఇలాంటి విమర్శలే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుపై వచ్చాయి. విఫలం అవుతున్న ఆటగాడిని పరోక్షంగా అవమానించి, అతడిపై ఒత్తిడి తెచ్చి రిటైర్ అయ్యేలా చేస్తుంది అన్న అపవాదు బోర్డుపై ఎప్పటి నుంచో ఉంది. దీంతో ఒక ఆటగాడికి నిర్ణయం తీసుకునేంత స్వేచ్చను కూడా ఇవ్వరా అంటూ క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డుపై దుమ్మెత్తి పోస్తున్నారు క్రికెట్ అభిమానులు. కోహ్లీ కూడా 3 ఏళ్లు సెంచరీ లేక ఇబ్బంది పడ్డ విషయాన్ని వాళ్లు ప్రస్తావించారు. ఐతే నిజంగానే బోర్డు ఒత్తిడితోనే ఆరోన్ ఫించ్ తన రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడా? అనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా క్రీడా ప్రపంచం ముందుంది. మరి ఆరోన్ ఫించ్ రిటైర్మెంట్ వెనుక ఆ దేశ క్రికెట్ బోర్డు ఉందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.