తొలి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా.. మూడో టెస్టులో మాత్రం దారుణ ఓటమిని చవిచూసింది. స్పిన్ పిచ్‌లను నమ్ముకుని బరిలోకి దిగిన టీమిండియా ఓటమికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం..
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా ఇండోర్‌లో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి రెండు టెస్టులను గెలిచిన టీమిండియా జోరుకు బ్రేక్ వేసిన ఆసీస్.. మూడో టెస్టు గెలిచి పరువు నిలుపుకుంది. ఈ విజయంతో ఆస్ట్రేలియా అధికారికంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో తన ప్లేను ఖరారు చేసుకున్నట్లే. మరోవైపు టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరాలంటే అహ్మాదాబాద్ వేదికగా జరిగే చివరి టెస్టులో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. అయితే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 109 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బ్యాటింగ్ లైనప్ మొత్తం విఫలమైంది.
ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకు ఆలౌటై.. 88 పరుగుల లీడ్ సాధించింది. జడేజా 4, అశ్విన్, ఉమేష్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. 88 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్.. పుజారా మినహా మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో.. 163 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆసీస్ 76 పరుగుల స్వల్ప లక్ష్యంతో మూడో రోజు ఉదయం ఒక్క వికెట్ కోల్పోయి టార్గెట్‌ను చేధించింది. దీంతో సిరీస్ 2-1గా మారింది. అయితే.. తొలి రెండు టెస్టుల్లానే ఈ టెస్టు కూడా మూడో రోజే ముగిసింది. కాగా.. హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన టీమిండియా.. చిత్తుగా ఓడేందుకు గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం..
1. రోహిత్ శర్మ నిర్ణయాలు!
ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ కెప్టెన్‌గా దారుణంగా విఫలం అయ్యాడనే చెప్పాలి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించడం రోహిత్ తీసుకున్న తప్పుడు నిర్ణయం. నాగ్‌పూర్, ఢిల్లీ లానే ఇండోర్‌లో కూడా స్పిన్ పిచ్‌ను రెడీ చేయించుకున్న భారత్.. తొలుత ఫీల్డింగ్ చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేది. తొలి రెండు టెస్టుల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. టాస్‌తో పాటు బౌలింగ్ మార్పుల్లో కూడా రోహిత్ శర్మ విఫలం అయ్యాడు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ తొలి రోజు అశ్విన్‌కు పెద్దగా బౌలింగ్ ఇవ్వలేదు.
2. బ్యాటింగ్ వైఫల్యం
మూడో టెస్టులో టీమిండియా ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే ప్రధాన కారణంగా చెప్పుకోచ్చు. రెండో ఇన్నింగ్స్‌లో పుజారా ఆడిన ఇన్నింగ్స్ తప్పించి టీమిండియా బ్యాటింగ్ లైనప్ దారుణంగా విఫలమైంది. కేఎల్ రాహుల్ ప్లేస్‌లో వచ్చిన శుబ్‌మన్ గిల్ అతనిలానే విఫలం అయ్యాడు. ఇక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, జడేజా, కేఎస్ భరత్‌లు చెత్త బ్యాటింగ్‌తో ఓటమికి కారణం అయ్యారు.
3. స్పిన్ ఆడటంలో విఫలం
తొలి రెండు టెస్టుల్లో స్పిన్ బలంతో నెగ్గిన టీమిండియా.. మూడో టెస్టులోనూ అదే బలంపై బరిలోకి దిగింది. కానీ.. అందుకు తగ్గట్లు బ్యాటింగ్ చేయలేకపోయింది. మన స్పిన్నర్ల కోసం సిద్ధం చేసిన పిచ్‌పై ప్రత్యర్థి స్పిన్నర్లు కూడా బౌలింగ్ చేస్తారనే విషయాన్ని బహుషా భారత బ్యాటర్లు మర్చిపోయినట్లు ఉన్నారు. ఆస్ట్రేలియా కోసం తీసిన గోతిలో మన బ్యాటర్లు బొక్కబోర్లా పడ్డారు.
4. ఓపెనింగ్ జోడీ
టీమిండియాకు చాలా కాలంగా బిగ్గెస్ట్ మైనస్‌గా నిలుస్తున్న అంశం ఓపెనింగ్ ఓడి. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో కేఎల్ రాహుల్ వైఫల్యంతో రోహిత్ శర్మకు సరైన జోడి దొరకడం లేదు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అద్భుతంగా ఆడుతున్న శుబ్‌మన్ గిల్‌ను తీసుకుంటే.. అతను కూడా ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. పైగా రోహిత్ శర్మ కూడా పెద్దగా ఫామ్‌లో లేడు. తొలి టెస్టులో ఒక మంచి ఇన్నింగ్స్ తప్పించి పెద్దగా ఆడింది లేదు. ఇలా మూడో టెస్టులో ఓటమికి ఓపెనింగ్ సమస్య కూడా ఒక కారణం.
5. దారుణమైన పిచ్
ఇక అన్నింటికంటే ముఖ్యమైంది పిచ్ సమస్య. ఈ పిచ్‌పై ఇరు జట్ల బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. అయితే.. ఆసీస్ బ్యాటర్లు మన కంటే కాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేయడంతో విజయం వారి సొంతమైంది. అయితే.. పిచ్ స్పిన్‌కు అనుకూలించాలి కానీ.. మరీ రెండు రోజుల్లో మ్యాచ్ ముగిసిపోయేంత టర్న్ అవసరం లేదనేది క్రికెట్ నిపుణుల అభిప్రాయం. ఇలాంటి పిచ్‌లు టెస్టు క్రికెట్‌పై ఉన్న ఆ కాస్త ఆసక్తిని కూడా చంపేస్తాయని కొంతమంది క్రికెట్ అభిమానులు సైతం అభిప్రాయపడుతున్నారు. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Australia win the Third Test by 9 wickets. #TeamIndia 🇮🇳 will aim to bounce back in the fourth and final #INDvAUS Test at the Narendra Modi Stadium in Ahmedabad 👍🏻👍🏻
Scorecard ▶️ https://t.co/t0IGbs2qyj @mastercardindia pic.twitter.com/M7acVTo7ch
— BCCI (@BCCI) March 3, 2023