బంగ్లాదేశ్‌తో ఆదివారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. పసికూన బంగ్లాదేశ్‌పై ఒక్క వికెట్ తేడాతో ఓటమి పాలైంది. బ్యాటింగ్‌కు టఫ్‌గా ఉన్న పిచ్‌పై తక్కువ స్కోర్‌కే పరిమితమైన టీమిండియా.. బౌలింగ్‌లో బాగానే రాణించి.. బంగ్లాదేశ్‌ను కూడా కట్టడి చేసింది. 136 పరుగులకే 9 వికెట్లు పడగొట్టి.. విజయానికి చేరువైంది. కానీ.. బ్యాడ్ ఫీల్డింగ్‌తో మ్యాచ్‌ను చేజార్చుకుంది. ముఖ్యంగా మెహదీ మిరాజ్ గాల్లోకి ఆడిన బంతిని వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ నేలపాలు చేయడమే టీమిండియా ఓటమికి కారణమైందని క్రికెట్ అభిమానులతో పాటు, క్రికెట్ విశ్లేషకులు సైతం అభిప్రాయపడ్డారు. అయితే కొంతమంది మాత్రం రాహుల్ క్యాచ్ డ్రాప్ చేయడంతో సిరీస్‌లో ఒక మ్యాచ్ మాత్రమే కదా ఓడింది అని అంటున్నారు. కానీ.. ఒక క్యాచ్ డ్రాప్‌కి ఎంత భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందో.. ప్రస్తుతం టీమిండియా కంటే.. సౌతాఫ్రికా జట్టుకు బాగా తెలుసు. ఎందుకంటే రాహుల్ క్యాచ్ డ్రాప్‌తో మనం ఒక మ్యాచ్ మాత్రమే ఓడాం.. కానీ, సౌతాఫ్రికా ఏకంగా వరల్డ్ కప్‌నే దూరం చేసుకుంది. ఒక్క క్యాచ్ డ్రాప్ ఎంత నష్టం చేస్తుందో ఈ సందర్భంగా తెలుసుకుందాం..
1999 వన్డే వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికా హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగింది. ఇండియా, శ్రీలంక, ఇంగ్లండ్, కెన్యా, పాకిస్థాన్, న్యూజిలాండ్.. జట్లను వరుసపెట్టి ఓడించుకుంటూ.. సూపర్ సిక్స్‌లో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సౌతాఫ్రికా సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. సౌతాఫ్రికాను ప్రపంచ ఛాంపియన్ కాకుండా ఇక ఎవరూ అడ్డుకోలేరని అంతా భావించారు. ఆ కాన్ఫిడెన్స్ సౌతాఫ్రికా టీమ్‌లోనూ కనిపించింది. ఇక సూపర్ సిక్స్‌లో తమ చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడింది సౌతాఫ్రికా. ఆ మ్యాచ్ ఓడినా సౌతాఫ్రికా సెమీస్ ఆడుతుంది. కానీ.. ఆస్ట్రేలియా పరిస్థితి అలా కాదు.. ఓడితే ఇంటికే. జింబాబ్వే కాకుండా తాము సెమీస్ చేరాలంటే ఆసీస్ కచ్చితంగా గెలిచి తీరాలి. టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ హాన్సీ క్రోంజే తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గ్యారీ క్రిస్టెన్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన విధ్వంసకర బ్యాటర్ హెర్షెల్ గిబ్స్ ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
10 ఫోర్లు, ఒక సిక్సతో సెంచరీ బాది సౌతాఫ్రికాకు భారీ స్కోర్ అందించాడు. 50 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా 7 వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది. లీడ్స్ గ్రౌండ్‌లో అది చాలా మంచి స్కోర్. పైగా అలన్ డోనాల్డ్, షాన్ పొలాక్, స్టీవ్ ఎల్వర్తీ, లాన్స్ క్లూసెనర్‌తో కూడిన భీకరమైన పేస్ ఎటాక్‌ను ఎదుర్కొని 272 పరుగులు చేయడం అంత ఆషామాషీ విషయం కాదు. ఆ విషయం ఆస్ట్రేలియాకు కూడా బాగా తెలుసు. భయపడినట్లే.. సౌతాఫ్రికా పేసర్లు ఆసీస్ టాపార్డర్‌ను కుప్పకూల్చారు. మార్క్ వా, ఆడమ్ గిల్‌క్రిస్ట్, డామియన్ మార్టిన్‌లను వెంటవెంటనే అవుట్ చేయడంతో.. ఆసీస్ 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజ్‌లోకి వచ్చిన ఆసీస్ కెప్టెన్ స్టీవా రికీ పాంటిక్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను భుజాన వేసుకున్నాడు.
పాంటింగ్-స్టీవా కలిసి మరో వికెట్ పడకుండా 30 ఓవర్లు ముగిసే సరికి స్కోర్‌ను 149 పరుగులకు చేర్చారు. దీంతో ఆసీస్ విజయం దిశగా సాగుతున్నట్లు కనిపించింది. 31వ ఓవర్‌లో ఈ ప్రమాదకరమైన జోడీని విడదీస బంగారం లాంటి అవకాశం సౌతాఫ్రికాకు వచ్చింది. 31వ ఓవర్‌లో స్టీవా మిడ్ వికెట్ వైపు షాట్ ఆడే ప్రయత్నంలో షార్ట్ మిడ్ వికెట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న హెర్షెల్ గిబ్స్ చేతికి క్యాచ్ ఇచ్చాడు. ఆ క్యాచ్‌ను గిబ్స్ సైతం దాదాపు అందుకున్నాడు. కానీ.. కాస్త తొందరపాటుతో ఆ క్యాచ్‌ను పూర్తి చేయలేక నేలపాలు చేశాడు. దీంతో అవుట్ కాకుండా బతికిపోయిన స్టీవా.. గిబ్స్‌తో మాట్లాడుతూ..‘నువ్వు వరల్డ్ కప్ వదిలేశావ్ గిబ్స్..’ అని అన్నాడు. దాని అర్థమెంటో రెండు రోజుల్లోనే గిబ్స్‌తో పాటు సౌతాఫ్రికాకు సైతం అర్థమైపోయింది.
వదిలింది ఒక్క క్యాచ్చే కదా.. మ్యాచ్ ఓడినా మేము సెమీస్‌కి పోతాం అన్న ధీమా సౌతాఫ్రికా టీమ్‌లో కనిపించింది. గిబ్స్ క్యాచ్ వదిలేయడంతో సెంచరీ పూర్తి చేసుకున్న స్టీవా 120 పరుగులు బాది.. ఆసీస్ గెలిపించి.. సెమీస్ చేర్చాడు. సెమీస్‌లో మళ్లీ సౌతాఫ్రికాతోనే మ్యాచ్. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి ఆస్ట్రేలియా 213 పరుగులు చేయగా.. సౌతాఫ్రికా సైతం 213 పరుగులు చేసి ఆలౌట్ అవ్వడంతో మ్యాచ్ టైగా ముగిసింది. కానీ.. ఆస్ట్రేలియా వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌కు క్వాలిఫై అయింది. కేవలం 0.001 రన్‌రేట్ తేడాతో సౌతాఫ్రికాను వెనక్కు నెట్టి ఆసీస్ ఫైనల్‌కు చేరి పాక్‌పై వరల్డ్ కప్ గెలిచింది. ప్రపంచ కప్ గెలిచి, ఛాంపియన్స్ అవ్వాలనే సౌతాఫ్రికా కల.. కలగానే మిగిలిపోయింది. అలా కాకుండా.. సూపర్ 6లోనే ఆసీస్‌ను ఓడించి ఉంటే సెమీస్‌లో సౌతాఫ్రికా ప్రత్యర్థిగా జింబాబ్వే ఉండేంది. గిబ్స్ ఆ క్యాచ్ పట్టి ఉంటే.. కచ్చితంగా సౌతాఫ్రికా ఆ మ్యాచ గెలిచేంది. అలా ఒక్క క్యాచ్‌తో హాట్‌ఫేవరేట్ సౌతాఫ్రికా వరల్డ్ కప్‌కు దూరమై.. అక్కడి నుంచి ఒత్తిడిలో చిత్తు అయ్యే జట్టుగా చోకర్స్ అనే ముద్ర వేసుకుంది.
ఆ మ్యాచ్‌లో గిబ్స్ క్యాచ్ వదిలేసిన తర్వాత.. ఆసీస్ కెప్టెన్ స్టీవా చెప్పిన మాట సౌతాఫ్రికా పాలిట అక్షర సత్యమైంది. గిబ్స్ వదిలేసింది క్యాచ్ కాదు వరల్డ్ కప్ అని స్టీవా చెప్పినట్లే జరిగింది. ప్రపంచ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సులు కొట్టిన రికార్డు గిబ్స్ పేరిక కూడా ఉన్నా.. ఎన్నో గొప్ప గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడినా.. ఆ మ్యాచ్‌లో కూడా గిబ్స్ సెంచరీ చేసినా.. ఇప్పటికీ గిబ్స్‌ను సౌతాఫ్రికాకు వరల్డ్ కప్ దూరం చేసిన ఆటగాడిగా గుర్తుపెట్టుకుంటున్నారంటే.. అతను వదిలేసిన ఆ క్యాచ్ విలువ అలాంటిది. అందుకే క్యాచ్‌లు మ్యాచ్‌లు గెలిపిస్తాయని చెబుతుంటారు. ఒక్క క్యాచ్‌తో వరల్డ్ కప్ గెలిచే మంచి అవకాశాన్ని వదిలేసుకున్న సౌతాఫ్రికా.. 23 ఏళ్ల గడుస్తున్నా.. ఇంకా వరల్డ్ కప్ గెలిచేందుకు పోరాడుతూనే ఉంది. ప్రపంచ ఛాంపియన్‌గా నిలవాలనే వారి కల.. ఇంకా కలగానే మిగిలి ఉంది. ఆ రోజు సౌతాఫ్రికా ఓటమి, గిబ్స్ చేసిన తప్పిదం.. ఎన్ని తరాలైన ఆటగాళ్లకు, జట్లకు ఒక గుణపాఠం.