90ల్లోకి చేరుకోగానే.. సెంచరీ కోసం సింగిల్స్ మాత్రమే తీసే బ్యాటర్లను చూసి ఉంటారు. కానీ.. 295 పరుగుల వద్ద ఉండి, చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉండి కూడా సిక్స్‌తో ట్రిపుల్ సెంచరీ పూర్తి చేసే గట్స్ మాత్రం ఒక్క సెహ్వాగ్‌కే ఉన్నాయి. అందుకే అతను డాషింగ్ ఓపెనర్. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌కి చుక్కలు చూపిస్తూ.. భారత్ తరఫున తొలి ట్రిపుల్ సెంచరీ సాధించి.. సెహ్వాగ్ ఆడిన గొప్ప ఇన్నింగ్స్‌కు నేటితో 19 ఏళ్లు పూర్తి అయ్యాయి..
టీమిండియాకు టెస్టు క్రికెట్లో ఎన్ని రికార్డులున్నా.. వ్యక్తిగతంగా ట్రిపుల్ సెంచరీ ఫీట్ మాత్రం అప్పటివరకు అందని ద్రాక్షలాగే మిగిలిపోయింది. ఎప్పుడో 1932లోనే భారత్ టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టింది. ఇన్నేళ్ల ప్రయాణంలో సునీల్ గవాస్కర్, గుండప్ప విశ్వనాథ్, దిలీప్ వెంగ్ సర్కార్, సచిన్ టెండూల్కర్, అజహారుద్దీన్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ లాంటి ఎంతో మంది దిగ్గజాలు ఎన్నో గొప్ప ఇన్నింగ్స్ లు ఆడినా.. టీమిండియా తరపున ట్రిపుల్ సెంచరీ నమోదవ్వలేదనే వెలితి అలాగే ఉండేది. కానీ 27 ఏళ్ల కుర్రాడు టెస్టు క్రికెట్లోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే ట్రిపుల్ సెంచరీ కొట్టి.. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోయాడు. కేవలం వ్యక్తిగతంగానే కాదు ఈ ట్రిపుల్ సెంచరీతో దేశానికే గర్వకారణంగా నిలిచాడు. అతడే టీమిండియా మాజీ విధ్వంసకర ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్. ఈ డాషింగ్ ఓపెనర్ సాధించిన ట్రిపుల్ సెంచరీకి నేటితో 19 ఏళ్లు పూర్తి అయ్యాయి.
టెస్టు క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ సాధించడమనేది చాలా కష్టం. ఈ ఫీట్ సాధించడానికి చాలా ఓపికతో పాటు కాస్త దూకుడును కూడా ప్రదర్శించాలి. టెస్టు క్రికెట్ ఆడే అన్ని ప్రధాన జట్ల బ్యాటర్లు కనీసం ఒక్కసారైనా ట్రిపుల్ సెంచరీ బాదేసిన చోట.. మన వాళ్ళు మాత్రం ఈ మార్కుని అందుకోవడంలో ఎందుకో వెనకపడ్డారు. 1983లో సునీల్ గవాస్కర్ చేసిన 236 పరుగుల వ్యక్తిగత స్కోర్ దాదాపు 18 ఏళ్ళు అలాగే ఉంది. 2001లో ఆస్ట్రేలియాపై వీవీఎస్ లక్ష్మణ్ ఆడిన చారిత్రాత్మక ఇన్నింగ్స్ అందరికీ గుర్తుండే ఉంటుంది. లక్ష్మణ్ ఈ సంచలన ఇన్నింగ్స్ తో గవాస్కర్ రికార్డ్ ని బ్రేక్ చేసి 281 పరుగుల వరకు చేరుకున్నాడు. అప్పట్లో లక్ష్మణ్ ఆడిన జోరు చూస్తే భారత తరపున తొలి ట్రిపుల్ నమోదవ్వడం ఖాయం అని భావించారంత. కానీ లక్ష్మణ్ అవుట్ అవ్వడంతో భారత అభిమానులకి నిరాశ తప్పలేదు. ఆ టెస్టు మ్యాచులో టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించడంతో ట్రిపుల్ సెంచరీ విషయాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. అప్పట్లో సచిన్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం వలన ఈ రికార్డ్ అతనికి తప్ప మరెవరికీ సాధ్యం కాదు అనే నమ్మకంతో ఉండేవారు ఇండియన్ ఫ్యాన్స్. కానీ.. సెహ్వాగ్ రూపంలో ఒక విధ్వంసకర బ్యాటర్ వచ్చి భారత్ కి తొలి ట్రిపుల్ సెంచరీని రుచి చూపిస్తాడు అని ఎవరూ కూడా ఊహించి ఉండరు.
2004 మార్చి 28 మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత్ పాకిస్థాన్‌లో పర్యటించింది. ముల్తాన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ సెహ్వాగ్ అదే పనిగా బౌండరీల వర్షం కురిపిస్తున్నాడు. ఆడుతుంది టెస్టు మ్యాచ్ నా ? లేకపోతే వన్డే మ్యాచ్ నా అనేలా సాగింది వీరేంద్రుడి విధ్వంసం. చూస్తుండగానే సెంచరీ బాదేశాడు సెహ్వాగ్. ఇతని జోరు చూస్తుంటే పాక్ బౌలర్లకు ఇక చుక్కలే అనుకున్నారు. పాకిస్థాన్ స్టార్ పేసర్, రావాల్పిండి ఎక్స్‌ప్రెస్, బౌన్సర్లతో బ్యాటర్లను భయపెట్టే షోయబ్ అక్తర్ సైతం.. సెహ్వాగ్ బాదుడిని తట్టుకోలేక.. రెండు చేతులు ఎత్తి దండం పెట్టేశాడు. ఆ ఫొటో అప్పట్లో బాగా వైరల్ అయింది.
కానీ సెంచరీ తర్వాత సచిన్ నువ్వు కాస్త చిన్నగా ఆడు అని చాలా సున్నితంగా చెప్పాడు. సీనియర్ మాటను గౌరవించిన సెహ్వాగ్ అప్పటినుంచి సిక్సులు మీద దృష్టిపెట్టకుండా కేవలం ఫోర్ లతోనే డబుల్ సెంచరీ పూర్తి చేసుకొని అదే ఊపులో ట్రిపుల్ సెంచరీకి సమీపంగా వచ్చాడు. వ్యక్తిగత స్కోర్ 295 దగ్గర ఉన్న సమయంలో నాన్ స్ట్రైకింగ్ లో ఉన్న సచిన్ దగ్గరకు వెళ్లి సిక్సర్ కొట్టి ట్రిపుల్ సెంచరీ పూర్తి చేసుకుంటాను అని చెప్పాడు. దీనికి సచిన్ నీకేమైనా పిచ్చా? ఇప్పటివరకు భారత్ తరపున ఎవరు కూడా ట్రిపుల్ సెంచరీ చేయలేదు. నువ్వు నిదానంగానే ట్రిపుల్ సెంచరీ పూర్తి చేసుకో అని చెప్పాడు. ఆ మాటకు సెహ్వాగ్ ఏ మాత్రం భయపడలేదు. సక్లైన్ ముస్తాక్ బౌలింగ్ లో సిక్సర్ కొట్టి ట్రిపుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సిక్సర్ తో యావత్ భారత్ దేశం మురిసిపోయింది. భారత్ తరపున తొలిసారి ట్రిపుల్ సెంచరీని బాది.. చరిత్ర సృష్టించాడు సెహ్వాగ్. అప్పటి నుంచి సెహ్వాగ్ పేరు మారుమ్రోగిపోయింది. అంతే కాదు 2008లో దక్షిణాఫ్రికా మీద మరో ట్రిపుల్ సెంచరీ చేసి టెస్టుల్లో రెండు ట్రిపుల్ సెంచరీలు సాధించిన మూడో ప్లేయర్‌గా విండీస్ దిగ్గజం లారా, ఆస్ట్రేలియా ఆల్ టైం గ్రేట్ బ్రాడ్ మన్ సరసన నిలిచాడు.
సెహ్వాగ్ కి భారీ ఇన్నింగ్స్ లు ఆడడం కొత్తేమి కాదు. పాకిస్థాన్ తో సిరీస్ కి ముందే ఆస్ట్రేలియా పర్యటనలో 195 పరుగులు చేసాడు.. అంతే కాదు అరంగ్రేటం చేసిన తొలి టెస్టు మ్యాచ్ లోనే దక్షిణాఫ్రికా మీద సెంచరీ బాదేశాడు. దూకుడే మంత్రంగా భావించే సెహ్వాగ్ ఎప్పుడూ కూడా తన సహజశైలికి భిన్నంగా ఆడేవాడు కాదు. ఈ లక్షణమే సెహ్వాగ్ కి ట్రిపుల్ సెంచరీతో పాటు పలు రికార్డులు సాధించేలా చేసింది. వన్డేల్లో డబుల్ హండ్రెడ్, 2011 వన్డే వరల్డ్ కప్ లో తొలి బంతికి ఫోరు కొట్టడం ఎవరు మర్చిపోగలరు. అప్పటికే జట్టులో సచిన్, గంగూలీ, ద్రావిడ్, లక్ష్మణ్ లాంటి దిగ్గజాలు ఉన్నా భారత క్రికెట్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇంతటి ఘనత సాధించిన వీరేందర్ సెహ్వాగ్ కి మనం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. మరి సెహ్వాగ్ చేసిన తొలి ట్రిపుల్ సెంచరీకి నేటితో 19 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా ఆ ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Virender Sehwag created history on this day in 2004 by becoming first Indian to score triple hundred in Test cricket.
He completed Triple hundred with a six against Pakistan in Multan. pic.twitter.com/BdjL2zmLjM
— Johns. (@CricCrazyJohns) March 29, 2023