నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 38వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం పీలేరు నియోజకవర్గంలో యాత్ర సాగుతోంది. జనం పెద్ద సంఖ్యలో యువనేత యాత్రలో పాల్గొంటున్నారు. తమ మద్దతు తెలియజేస్తున్నారు.
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు చేపట్టిన యువగళం పాదయాత్రకు విశేష స్పందన వస్తోంది. జనం పెద్ద సంఖ్యలో లోకేష్ పాదయాత్రలో పాల్గొంటున్నారు. యువనేతకు తమ మద్దతు తెలియజేస్తున్నారు. లోకేష్ ప్రస్తుతం చిత్తూరు జిల్లాలోని పీలేరు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. ఇక, పాదయాత్ర 38వ రోజుకు చేరుకుంది. 38వ రోజు పాదయాత్ర చింతపర్తి విడిది కేంద్రంనుంచి ప్రారంభం అయింది. పాదయాత్ర ప్రారంభానికి ముందు లోకేష్ సెల్ఫీల కార్యక్రమంలో పాల్గొన్నారు. తనను చూడటానికి వచ్చిన 1000 మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలతో సెల్ఫీలు దిగారు. లోకేష్ తమతో ఎంతో ప్రేమతో సెల్ఫీలు దిగటంపై వారు సంతోషం వ్యక్తం చేశారు.
సెల్ఫీల కార్యక్రమం అనంతరం ‘‘ది ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్’’లతో లోకేష్ సమావేశం అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 7000 మంది ఫిజియోథెరపిస్ట్‌లు ప్రాక్టీస్ చేస్తున్నారని, మరో 4 ఏళ్లలో 9000 మంది విద్యార్థులు ఫిజియోథెరపి కోర్సు పూర్తి చేసుకోబోతున్నారని వారు తెలిపారు. కానీ, ఇప్పటి వరకు కేవలం ప్రభుత్వ సేవల్లో 7 మందిమి మాత్రమే పని చేస్తున్నామని వెల్లడించారు. మిగిలిన వాళ్ళు అంతా ప్రైవేట్‌గానే ప్రాక్టీస్ చేస్తున్నారని అన్నారు. పీహెచ్‌సీ లెవల్‌లో తమ సేవలు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై లోకేష్ స్పందిస్తూ.. ‘‘ రాష్ట్ర వ్యాప్తంగా ఫిజియోథెరపిస్ట్స్ ఎదుర్కొంటున్న సమస్యల పై నాకు అవగాహన ఉంది. త్వరలోనే మీతో ప్రత్యేకంగా నేను సమావేశం అవుతాను.
మీ సేవల్ని ఎలా వినియోగించుకోవాలి, మీ సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై ప్రత్యేక సమావేశంలో చర్చించి మీకు నిర్ధిష్టమైన హామీలు ఇస్తాను’’ అని అన్నారు. ఆ తర్వాత మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. పునుగుపల్లిలో యువగళం పాదయాత్ర సందర్భంగా రోడ్డుపై వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు బాదుడులో జగన్ దూకుడు.. మూడు సార్లు ఆర్టీసి ఛార్జీలు పెంపు అంటూ లోకేష్ ప్లకార్డ్ చూపించారు. నాలుగేళ్ల లో ఆర్టీసీ ఛార్జీల రూపేనా రూ.4 వేల కోట్ల దోపిడీ అంటూ ఆయన ప్రయాణికులకు వివరించారు.