టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం యాత్ర చిత్తూరులో సాగుతోంది. ప్రజలు, టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో యాత్రలో పాల్గొంటున్నారు. యాత్రకు తమ మద్దతు తెలియజేస్తున్నారు.
నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 34వ రోజుకి చేరుకుంది. 34వ రోజు పాదయాత్ర పుంగనూరు నియోజకవర్గంలోని కొక్కువారిపల్లి విడిది కేంద్రంనుంచి ప్రారంభమైంది. సెల్ఫీల కార్యక్రమం తర్వాత లోకేష్ తన పాదయాత్రను ప్రారంభించారు. కల్లూరు వద్ద యువతీ, యువకులతో లోకేష్ ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన యువతీ, యువకులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు సరైన న్యాయం చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
విద్యార్థి లోకేష్: మాకు సరైన విద్య లేదు. చుట్టుపక్కల డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీలు లేవు. దూరం వెళ్లాలంటే ఆర్టీసీ బస్సుల్లో వెళ్లాలి. ఛార్జీలు పెరిగిపోయాయి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాం. మాకు డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీలు తెస్తారా?
నారా లోకేష్: ఏపీని ఐటీ హబ్ గా తీర్చి దిద్దాలనే ఉద్దేశంతో చంద్రబాబు అనేక కంపెనీలతో ఒప్పందం చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వేలాది ఇంజినీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేశారు. డిగ్రీ కాలేజీలు అందుబాటులోకి తీసుకువచ్చారు. మీ కోరిక మేరకు డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీని తీసుకొస్తాం.
కుమార్: నేను రైతును. ఉద్యోగాలు లేక వ్యవసాయం చేస్తుంటే ఇదీ నష్టదాయకంగానే ఉంది. మమ్మల్ని మీరు ఏవిధంగా ఆదుకుంటారు?
లోకేష్: చంద్రబాబు వ్యవసాయంతో పాటు, అనుబంధ రంగాలను పెద్దఎత్తున ప్రోత్సహించారు. రైతులకు విత్తనాలు నుండి పంట రవాణా చేసే వరకు అయ్యే ఖర్చులను తగ్గించాలని చంద్రబాబు నిర్ణయించారు. గతంలో భూసార పరీక్షలు చేశాం. ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చాం. అన్ని విధాలా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశాం. జగన్ రెడ్డి వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నాశనం చేశాడు.
వైసీపీ నాయకుల వేధింపుల కారణంగా తమ కుమార్తె మిస్బా ఆత్మహత్య చేసుకుందని అంటూ మిస్బా కుటుంబసభ్యులు లోకేష్ వద్ద కన్నీరు పెట్టుకున్నారు. తమ బాధను నారా లోకేష్‌కు చెప్పుకున్నారు. లోకేష్ మాట్లాడుతూ.. ‘‘గతంలో ఎప్పుడూ ఇన్ని దారుణాలు చూడలేదు. ఎంతో భవిష్యత్తు ఉన్న మిస్బా ఆత్మహత్య చేసుకుంది. డాక్టర్ కావాలని కలలు కన్న మిస్బాని వైసీపీ నేతలు అన్యాయంగా చంపేశారు. మీ కుటుంబానికి నేను అండగా ఉంటా. మీకు న్యాయం జరిగేలా నేను పోరాడతా. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మిస్బా ఆత్మహత్యకు కారణం అయిన వారిని శిక్షిస్తాం’’ అని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ముస్లిం మైనార్టీలతో సమావేశం ప్రారంభం అయింది. వారు తమ సమస్యలను లోకేష్‌కు చెప్పుకున్నారు. లోకేష్ వారి సమస్యల పరిస్కారానికి భరోసా ఇచ్చారు.