సోమవారం చంద్రగిరి నియోజకవర్గంలోని శివగిరి క్యాంప్ సైట్ నుంచి లోకేష్ పాదయాత్ర మొదలైంది. చంద్రగిరి నియోజకవర్గం తొండవాడ బహిరంగసభలో యువనేత నారా లోకేష్ ప్రసంగించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.
యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర పెను సంచలనంగా ముందుకు దూసుకుపోతోంది. చిత్తూరు జిల్లాలో సాగుతున్న యాత్రకు భారీగా మద్దతు లభిస్తోంది. జనం పెద్ద ఎత్తున నారా లోకేష్ యాత్రలో పాల్గొంటున్నారు. యువనేతకు తమ మద్దతు తెలుపుతున్నారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ.. భరోసా ఇస్తూ లోకేష్ ముందుకు సాగుతున్నారు. ఇక, 29వ రోజు యువగళం పాదయాత్ర చంద్రగిరి నియోజకవర్గంలో శివగిరి క్యాంప్ సైట్‌నుంచి ప్రారంభం అయింది. క్యాంప్ సైట్ వద్ద ప్రతి రోజులాగే తనని కలవడానికి వచ్చిన ప్రజలు, అభిమానులు, కార్యకర్తల్ని కలిసి లోకేష్ సెల్ఫీలు దిగారు. ఇలా 1000 మందితో సెల్ఫీలు దిగారు. అనంతరం తొండవాడ బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్బంగా లోకేష్ మాట్లాడుతూ.. ‘‘పిల్లి 4 సంవత్సరాలు తాడిపల్లెలోని ఇంట్లో పడుకుని యువగళం దెబ్బకు భయపడి పల్లెనిద్రకు వెళతానని అంటోంది. అది యువగళం దెబ్బ. నేను యువగళం ప్రారంభించే ముందే తాడేపల్లి పిల్లి జీఓ-01ను తెచ్చింది. దాన్ని అడ్డుపెట్టి నన్ను రోడ్డపై నిలబడనివ్వడం లేదు. మైక్ పట్టుకోనివ్వడం లేదు. సౌండ్ వాహనాలు లాక్కుంటున్నారు. నేను నిలబడే స్టూల్ కూడా లాక్కుంటున్నారు. జగన్ ది గవర్నమెంట్ ఆర్డర్.. లోకేష్ ది పబ్లిక్ ఆర్డర్. జగన్ గవర్నమెంట్ ఆర్డర్‌తో నన్ను ఆపాలని చూస్తున్నారు. కానీ పబ్లిక్ ఆర్డర్‌ను మాత్రమే నేను గౌరవించి మీ వద్దకు వస్తున్నాను. 2019ఎన్నికల సమయంలో మీరు యువతకు ఇచ్చిన హామీలు 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రతియేటా 6500పోలీసు ఉద్యోగాలు, మెగా డీఎస్సీ లను నెరవేరిస్తే నా సౌండ్ వెహికల్స్ స్వచ్చందంగా ఇచ్చేస్తా.
మహిళలకు ఇచ్చిన 45 ఏళ్లకే బీసీ,ఎస్సీ,ఎస్టీ మహిళలకు పెన్షన్… ఎంత మంది పిల్లలు ఉన్నా అమ్మ ఒడి.. మద్యపాన నిషేదం లాంటి హామీలను నిలబెట్టుకుంటే నా మైక్ సరెండర్ చేస్తా. పోలీసులకు జగన్ రెడ్డి చాలా బాకీ పడ్డారు. పెండింగ్‌లో ఉన్న 4 సరెండర్లు, 8 టీఏ, డీఏ బిల్లులు, మెడికల్ బిల్లులు ఇచ్చేస్తే నా స్టూల్ కూడా జగన్ రెడ్డి కి ఇచ్చేస్తా’’ అని అన్నారు. అనంతరం శానంబట్లలో చంద్రగిరి మండల దళితులు లోకేష్‌ను కలిశారు. తమ సమస్యలను ఆయనకు విన్నవించుకున్నారు. ఆ తర్వాత చంద్రగిరి నియోజకవర్గం తొండవాడలో మీసేవ మిత్రులతో నారా లోకేష్ ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మీసేవ మిత్రులు తమ సమస్యలను నారా లోకేష్‌కు ఏకరువు పెట్టారు. వారి సమస్యల పరిష్కారానికి లోకేష్ హామీ ఇచ్చారు.