నారా లోకేష్ పాదయాత్ర 26వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం తిరుపతి నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర సాగుతోంది. లోకేష్ ప్రజలతో మమేకం అవుతూ ముందుకు సాగుతున్నారు. వారి కష్టాల గురించి తెలిసి చలించిపోతున్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దినదినాభివృద్ధి సాధిస్తోంది. ప్రజల్లోకి వాయువేగంతో దూసుకు వెళుతోంది. ప్రజలు లోకేష్ పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు. తమ కష్టాలు తీర్చే నాయకుడు వచ్చాడంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ బాధల్ని ఆయన ముందు వెల్లబోసుకుంటున్నారు. నారా లోకేష్ నేను ఉన్నానంటూ వారికి భరోసా ఇస్తున్నారు. ఇక, లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 26వ రోజుకు చేరుకుంది. శుక్రవారం 26వ రోజు పాదయాత్ర తిరుపతి అంకుర ఆసుపత్రి వద్ద ఉన్న విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. పాదయాత్ర ప్రారంభానికి ముందుకు లోకేష్ సెల్ఫీల కార్యక్రమాన్ని చేపట్టారు. విడిది కేంద్రం వద్ద 1000 మందితో ఆయన సెల్ఫీలు దిగారు.
అనంతరం ఆటో యూనియన్ ప్రతినిధులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పారు. లోకేష్ ఆటో డ్రైవర్‌లా షర్టు వేసుకుని ఆటో నడిపారు. ఆటో డ్రైవర్‌లతో సెల్ఫీలు కూడా దిగారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. ‘‘2019 ఎన్నికల సమయంలో పాదయాత్ర చేసిన వైఎస్ జగన్ ఆటో డ్రైవర్లందరికీ వాహన మిత్ర ఇస్తానన్నారు. మనం పాలిచ్చే ఆవును మర్చిపోయి.. తన్నే దున్నపోతును తెచ్చుకున్నాం. డీజిల్ 100 రూపాయలు, పెట్రోల్ 112 రూపాయలు అయింది. 13 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉంటే.. 10 శాతం మందికి మాత్రమే వాహన మిత్ర ఇచ్చారు. ట్రాఫిక్ పోలీసులకు ఆదేశాలిచ్చి మరీ ఛలాన్లు వేయిస్తున్నారు.
వాహన మిత్ర నుంచి ఇచ్చిన డబ్బుల కంటే ఎక్కువగా ఛలాన్లనుంచి కొల్లగొడుతున్నారు. ఆటో వాళ్లకు ఓ బోర్డు ఉండాలి. అందరికీ అన్ని వసతులు కల్పించాలి. ఆటో డ్రైవర్లపై వేధింపులు ఎక్కువయ్యాయి. మేము అధికారంలోకి వస్తే.. ఈవేధింపులు ఉండవు’’ అని అన్నారు. అనంతరం టీటీడీ ఉద్యోగులతో లోకేష్ సమావేశం అయ్యారు. కాగా, నారా లోకేష్ పాదయాత్ర ద్వారా ఇప్పటివరకు 344.6 కిలోమీటర్లు నడిచారు. దాదాపు 400 రోజుల పాటు ఆయన 4వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు. మరి, 26వ రోజు నారా లోకేష్ పాదయాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.