లోకేష్ పాదయాత్ర దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. వందల, వేల సంఖ్యలో జనం, టీడీపీ కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొంటున్నారు. తమ ప్రియతమ యువ నాయకుడు లోకేష్ మద్దతు నిలుస్తున్నారు. ఇక, యాత్ర 22వ రోజుకు చేరుకుంది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రకు జనం అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో లోకేష్ యువగళం పాదయాత్ర సాగుతోంది. 22వ రోజు యాత్ర సత్యవేడు నియోజకవర్గంలో ప్రారంభమై.. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోకి చేరుకుంది. శుక్రవారం ఉదయం సత్యవేడు నియోజకవర్గంలోని బైరాజు కండ్రిక విడిది కేంద్రం నుండి పాదయాత్ర ప్రారంభం అయింది. పాదయాత్రకు ముందు లోకేష్ 1000 మందితో సెల్ఫీలు దిగారు. అనంతరం పాదయాత్రను ప్రారంభించారు. ఉదయమే లోకేష్ పాదయాత్ర ద్వారా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోకి ప్రవేశించారు.
నియోజకవర్గంలోని పార్టీ సీనియర్లతో ఆశీర్వచనాలు తీసుకున్నారు. కొత్తకండ్రిక వద్ద రైతులతో సమావేశం అయ్యారు. శివనాథపురం వద్ద పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. రాజీవ్ నగర్ పంచాయతీ టిడ్కో హౌసెస్ వద్ద నిరుద్యోగులు-టిడ్కో బాధితులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పీవీఆర్ గార్డెన్స్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో పాదయాత్ర ద్వారా తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు.
ఇక, లోకేష్ పాదయాత్రకు పోలీసులు అడుగడుగునా అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. లోకేష్ పాదయాత్ర నిర్వహిస్తున్న ప్రాంతాల్లో వేలాది మంది పోలీసులు మోహరించారు. నిర్బంధాలను సైతం లెక్క చేయకుండా లోకేష్ ముందుకు సాగారు. ప్రజలని పలకరిస్తూ.. అభిమానుల కోరిక మేరకు సెల్ఫీలు సైతం దిగారు. జనం కూడా లోకేష్‌ను చూడటానికి పోలీసులకు సైతం భయపడకుండా వస్తున్నారు. పాదయాత్రకు మద్దతు తెలుపుతున్నారు. మరి, 22వ రోజు లోకేష్ పాదయాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.