ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు కొత్త కుంపటిని రాజేసినట్లు అయ్యింది. వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడటంతో ఒక ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ విజయం సాధించింది. ఈ క్రాస్ ఓటింగ్ ఘటను సీరియస్ తీసుకున్న పార్టీ నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేసింది.
ఏపీలో రాజకీయాలు ఎంతో ఉంత్కంఠను రేపుతున్నాయి. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీలోనే పొరపొచ్చాలు ఉన్నాయనే విషయం స్పష్టమైంది. ఎమ్మెల్యే ప్రాధాన్యత ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అనురాధ విజయంతో సొంతపార్టీ ఎమ్మెల్యేలే క్రాస్ ఓటింగ్ కి పాల్పడిన విషయం వెల్లడైంది. అలా క్రాస్ ఓటింగ్ చేసింది ఎవరో? వారిని గుర్తించి సరైన సమయంలో తగిన చర్యలు తీసుకుంటాం అంటూ ఇప్పటికీ వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాజాగా నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమ పార్టీలోని నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేశారు.
చెప్పిన విధంగానే క్రాస్ ఓటింగ్ చేసిన ఎమ్మెల్యేలపై వైసీపీ పార్టీ చర్యలు తీసుకుంది. ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలను సస్పెండ్ చేస్తున్నట్లు సజ్జల ప్రకటిచారు. ఈ విషయంపై సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. “క్రాస్ ఓటింగ్ పై అంతర్గత విచారణ చేశాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేసినట్లు పార్టీ గుర్తించింది. క్రాస్ ఓటింగ్ చేసినవారిపై పార్టీ చర్యలు తీసుకుంది. ఆ నలుగురు శాసన సభ్యులను సస్పెండ్ చేస్తున్నాం. దర్యాప్తు చేసిన తర్వాతే ఎమ్మెల్యేలపై వేటు వేశాం” అని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.